గోల్ఫ్‌ కోర్స్‌.. ఆకాశమంత ఎత్తు

21 Aug, 2021 08:54 IST|Sakshi

అదితి అశోక్‌... ఒలింపిక్స్‌లో ఎవరూ ఊహించని విధంగా మౌనంగా పాయింట్‌లు తెచ్చుకుంది. దేశం దృష్టిని గోల్ఫ్‌ వైపు మళ్లించింది. మన దేశంలో గోల్ఫ్‌ ఇంతగా విస్తరించి ఉందా అనే సందేహాన్ని, నిజమేననే సమాధానాన్ని ఏకకాలంలో చెప్పింది అదితి. మరో విషయం... మన దేశంలో గిన్నిస్‌ రికార్డు సాధించిన గోల్ఫ్‌ కోర్స్‌ ఉంది.

ప్రపంచంలో ఎత్తైన గోల్ఫ్‌ కోర్స్‌ సిక్కింలో ఉంది. పేరు... యాక్‌ గోల్ఫ్‌ కోర్స్‌. ఎంత ఎత్తులో అంటే... ఒక్కమాటలో చెప్పాలంటే ఆకాశమంత ఎత్తులో. కొలత వేసి చెప్పాలంటే పదమూడు వేల అడుగుల ఎత్తులో. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో నమోదైన గోల్ఫ్‌ కోర్స్‌ ఇది. ప్రపంచం మొత్తంలో ఇంతకంటే ఎత్తైన ప్రదేశంలో గోల్ఫ్‌ కోర్స్‌లు లేవా అనే సందేహం వచ్చినా కూడా తప్పు కాదు. పెరూలో ఒకప్పుడు పద్నాలుగు వేల అడుగులకు పైగా ఎత్తులో గోల్ఫ్‌ కోర్స్‌ ఉండేది. రికార్డు కూడా దానికే ఉండేది. అయితే గడచిన రెండు దశాబ్దాలుగా గోల్ఫ్‌ క్రీడాకారులు ఆ గోల్ఫ్‌ క్లబ్‌ వైపు చూడడమే లేదు. అంత ఎత్తులో ఆల్టిట్యూడ్‌ సమస్యలు, తల తిరగడం, ముక్కు నుంచి రక్తం కారడం వంటి ఇబ్బందులు తలెత్తుతుండడంతో అది ఇప్పుడు వాడుకలో లేదు. ఇప్పుడు రికార్డు మన సిక్కిమ్, యాక్‌ గోల్ఫ్‌ క్లబ్‌దే. పైగా ఇది పద్దెనిమిది హోల్స్‌ గోల్ఫ్‌ క్లబ్‌. దీనిని భారత ఆర్మీ నిర్వహిస్తోంది. 

ఈ పేరు ఎందుకు?
సిక్కిమ్‌ వాళ్లు హిమాలయాల్లో సంచరించే యాక్‌ (జడలబర్రె) మీద ప్రయాణించడాన్ని గర్వంగా భావిస్తారు. దేవతల పూజల్లో ఉపయోగించే చామరాలను ఈ జడలబర్రె వెంట్రుకలతో తయారు చేస్తారు. ఇక్కడికి ఎవరికి వాళ్లుగా వెళ్లడం కంటే టూర్‌ ప్యాకేజ్‌లో వెళ్లడమే సౌకర్యంగా ఉంటుంది. సిల్క్‌ రూట్‌లోని ప్రదేశాలను కవర్‌ చేసే కొన్ని టూర్‌ ప్యాకేజ్‌లలో ఈ యాక్‌ గోల్ఫ్‌ కోర్స్‌ ఉంటుంది. 

మరిన్ని వార్తలు