దేశ సమైక్యతకు చిహ్నం ఆ భాష! జాతీయ భాషగా నీరాజనాలు అందుకుంటోంది

14 Sep, 2023 10:26 IST|Sakshi

భాషతో బంధంజాతి నిర్మాణంలో భాష పాత్ర చాలా గొప్పది. అనేక విషయాలను అధ్యయనం చేయడం, విజ్ఞాన సాంకేతిక తదితర ఉన్నత రంగాల్లో ప్రావీణ్యత పొందడం ఒక భాష ద్వారానే సాధ్యపడుతుంది. ఒక వ్యక్తి సమగ్ర వికాసానికి భాష ఆయువుపట్టు. అదే భాష దేశాన్ని ఒకే తాటిపై నిలబడేలా, జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించినప్పుడు ఆ భాష ‘జాతీయ భాష’గా నీరాజనాలు అందుకుంటుంది. ఆ పాత్రను అక్షరాలా ‘హిందీ’ భాష నిర్వర్తించింది, నిర్వర్తిస్తోంది కూడా.

భారత స్వాతంత్య్ర సమరంలో ప్రజలను జాగృత పరచడంలో క్రియాశీల పాత్ర పోషించి, ప్రపంచంలోనే అత్యధికులు మాట్లాడే రెండవ భాషగా వికసించిన భాష హిందీని కొందరు ఇంకా పరాయి భాషగా భావించడం దురదృష్టకరం. హిందీ ఒక భాష మాత్రమే కాదు, మన దేశ సమైక్యతా చిహ్నం కూడా! దేశంలో హిందీ మాట్లాడేవారు, అర్థం చేసుకునే వారు అధికంగా ఉండడం చేత కేంద్ర ప్రభుత్వము హిందీని అధికార భాషగా ప్రకటించింది.

ప్రస్తుతం పదికి పైగా రాష్ట్రాలలో ప్రథమ భాషగా, మిగతా రాష్ట్రాల్లో ద్వితీయ భాషగా హిందీ ప్రచలనములో ఉన్నప్పటికీ, ఆంగ్ల భాషపై మోజుతో హిందీని నిర్లక్ష్యం చేస్తున్నారు. గాంధీజీ స్వయంగా దక్షిణ భారతదేశంలో ఈ భాష ప్రచార కార్యక్రమా నికి ‘దక్షిణ భారత హిందీ ప్రచార సభ’ స్థాపనతో శ్రీకారం చుట్టారు. ఆ మహాత్ముని ఆశయాలను అనుసరిస్తున్న మనం ఆయన విస్తరింపచేసిన భాషను తగిన విధంగా ఆదరించలేక పోవడం విచారకరం.

వివిధ దేశాల్లో ఎన్నో విశ్వవిద్యాలయాల్లో హిందీని పాఠ్యాంశంగా బోధించడం గమనార్హం. కానీ, మన దేశంలో మాత్రం అంతగా హిందీకి ప్రాముఖ్యం ఇవ్వడం లేదు. ‘త్రిభాషా సూత్రా’న్ని అనుసరించి మాతృ భాష ప్రథమ భాషగా ద్వితీయ భాషగా హిందీని, తృతీయ భాషగా ఆంగ్లం. పాఠశాల విద్యార్థులకు బోధించాలని కేంద్రం నిర్దేశించింది. కానీ కొన్ని రాష్ట్రాలు ముఖ్యంగా తమిళనాడు లాంటి దక్షిణాది రాష్ట్రాలు ఈ సూత్రాన్ని వ్యతిరేకిస్తున్నాయి. పరాయి భాషలు అవసరానికి ఎన్ని నేర్చుకున్నా, మన మాతృ భాష, అధికార భాషలను నిర్లక్ష్యం చేయరాదు. 

– భైతి దుర్గయ్య, హిందీ ఉపాధ్యాయుడు
 

(చదవండి: మాట తప్పిన ఆత్రేయ! ముచ్చటపడ్డా.. ఆ కోరిక నెరవేరకుండానే..)

మరిన్ని వార్తలు