ఇలా చేస్తే ఇల్లంతా శుభ్రమే!

4 Mar, 2023 04:23 IST|Sakshi

ఇంచుమించు ప్రతి ఇంట్లోనూ సోఫా, మ్యాట్రెసెస్, టేబుల్స్, చైర్స్‌ ఇలా చాలా రకాల ఫర్నీచర్‌ ఉంటుంది. వీటిని శుభ్రం చేయకపోతే దుమ్ము, ధూళీ పేరుకుని పోయి చాలా అపరిశుభ్రంగా కనిపిస్తాయి. అంతేకాదు, వీటివల్ల డస్ట్‌ అలర్జీ ఉన్న వారికి ఎంతో ఇబ్బంది కలుగుతుంది. వీటిలో దాగి ఉండే సూక్ష్మక్రిముల వల్ల రకరకాల అనారోగ్యాలు వస్తుంటాయి. వీటిని క్లీన్‌ చేసేందుకు కొన్ని టిప్స్‌ పాటించాలి. దీనివల్ల ఫర్నీచర్‌ శుభ్రంగా కనిపించడంతోపాటు ఎక్కువకాలం మన్నుతుంది కూడా. ఫర్నీచర్‌ను శుభ్రం చేసేందుకు ఏం చేయాలో చూద్దాం. 

సోఫా: ఆరు టీస్పూన్ల బాత్‌ సోప్‌ పౌడర్‌ తీసుకోండి. ఈ పొడికి కప్పు వేడి నీరు కలపండి. సబ్బు నురగ వచ్చిన తర్వాత దానికి రెండు టీస్పూన్ల అమ్మోనియా లేదా తేనె జోడించండి. ఈ ద్రావణం చల్లబడిన తర్వాత దానిని బాగా కలపండి. దీంతో నురగ వస్తుంది. ఒక క్లాత్‌ లేదా స్పాంజ్‌ సహాయంతో ఈ నురగతో సోఫా పై భాగంలో శుభ్రం చేయండి. దీని తరువాత సోఫాను ఫ్యాన్‌ కింద ఆరనివ్వండి. దీంతో ఫ్యాబ్రిక్‌ సోఫా కొత్తగా కనిపిస్తుంది.

లెదర్‌ సోఫా: లెదర్‌ సోఫాను క్లీన్‌ చేసే ఏకైక మార్గం మైల్డ్‌ క్లీనర్‌తో శుభ్రం చేయడమే. ఇందు కోసం ఎప్పుడూ మృదువైన బ్రష్‌.. వాక్యూమ్‌ క్లీనర్‌ను ఉపయోగించాలి. శుభ్రం చేయడానికి నీటితో కలిపిన వెనిగర్‌ ద్రావణాన్ని ఉపయోగించవచ్చు.

డైనింగ్‌ టేబుళ్లు, చెక్క కుర్చీలు తదితర ఉడెన్‌ ఫర్నీచర్‌ని తుడిచేందుకు పొడి వస్త్రాన్ని వాడండి. వీటిని మరింతగా మెరిసేలా చేయాలంటే వ్యాక్స్, పాలిష్‌ కూడా చేయొచ్చు. అదే విధంగా దుమ్ముని క్లీన్‌ చేయాలంటే డిష్‌ వాష్‌ని నీటిలో కలిపి అందులో మెత్తటి బట్టను ముంచి బయటికి తీసి పిండి దానితో ఫర్నీచర్‌ని రుద్దాలి. తర్వాత పొడిబట్టతో చక్కగా తుడవండి. ఇలా క్లీన్‌ అయిన ఫర్నీచర్‌ని పూర్తిగా ఆరబెట్టండి. కొన్ని వస్తువులు పాత పాలిష్‌తో చూడ్డానికి అంత బాగుండవు. వీటిని క్లీన్‌ చేయాలంటే.. ముందుగా కొద్దిగా టీ బ్యాగ్స్‌ తీసుకుని వేడినీటిలో వేసి డికాషన్‌ చేయాలి. ఇది గోరువెచ్చగా అయ్యే వరకూ ఉంచి గుడ్డపై దీనిని పోస్తూ కొద్దికొద్దిగా తుడవాలి. టీ డికాక్షన్‌లోని యాసిడ్‌ ఉడ్‌ని క్లీన్‌ చేస్తుంది.

మరకలు దూరమవ్వాలంటే..
కొన్నిసార్లు డైనింగ్‌ టేబుల్‌పై ఫుడ్‌ ఐటెమ్స్‌ మూలాన మరకలు పడుతుంటాయి. వాటిని తొలగించాలంటే... మరకలు పడ్డ చోట కాస్తంత టూత్‌పేస్ట్‌ అప్లై చేసి దానితో రుద్దాలి. ఆరిన తర్వాత ఒక తడిబట్టతో శుభ్రంగా తుడిచెయ్యండి. మరకలు మొండిగా ఉంటే బేకింగ్‌ సోడా, టూత్‌పేస్ట్‌లను సమానంగా కలిపి వాటితో రుద్దండి. కాసేపయ్యాక తడిగుడ్డతో తుడిచి ఆరబెట్టండి.

గోడలపై ఇంక్‌ మరకలు, పెన్ను గీతలు
టేబుల్‌ స్పూన్‌ బేకింగ్‌ సోడాలో కొద్దిగా నీరు కలిపి పేస్ట్‌లా చేయండి. ఈ పేస్ట్‌ని మరకలపై పట్టించి రుద్ది తడిగుడ్డతో తుడిచెయ్యాలి.దీనికి మరో పద్ధతి ఉంది. అదేంటంటే... గిన్నెలో కాసిన వేడినీళ్లు తీసుకోవాలి. అందులో కొన్ని చుక్కల షాంపూ వేసి బాగా కలపాలి. గోరువెచ్చగా అయిన తర్వాత ఆ నీటిలో ఒక క్లాత్‌ను ముంచి మరకలు పడ్డ చోట రుద్దండి. ఆరిన తర్వాత తడిబట్టతో తుడవండి. మరకలు పలచబడతాయి. కొద్దిరోజుల తర్వాత మరోసారి ఇలాగే చేయాలి. ఇలా ఒకటి రెండుసార్లు చేయడం మంచిది. 

ఉడెన్‌ ఫర్నిచర్‌: చెక్కతో చేసిన గృహోపకరణాలు పాడు కాకుండా ఉండాలంటే టీ డికాషన్‌లో మెత్తటి క్లాత్‌ను నానబెట్టి పిండి దాంతో తుడవండి. ఇలా చేస్తే రంగు వెలిసిన ఫర్నీచర్‌కు కూడా తిరిగి మెరుపు వస్తుంది. చెక్కపై నీటి మరకలు దాని అందాన్ని పాడు చేస్తాయి. నీటి మరకలు పడినచోట వైట్‌ టూత్‌ పేస్ట్‌ (జెల్‌ పేస్ట్‌ కాదు) రాయండి. తర్వాత మెత్తని బట్టతో రుద్దాలి. అప్పుడు టూత్‌పేస్ట్‌ను తీసివేసి.. తడిబట్టతో తుడిచేయాలి. 

చెక్క ఫర్నిచర్‌పై మసి ఉంటే.. టీస్పూన్‌ బేకింగ్‌ సోడాను నీటిలో వేసి కరిగించండి. మసి ఉన్న ప్రాంతంపై దీన్ని అప్లై చేయండి. తర్వాత మెత్తని పొడిబట్టతో తుడవండి. 

సీలింగ్‌ ఫ్యాన్‌లు
సాధారణంగా సీలింగ్‌ ఫ్యాన్‌లు ఎక్కువ ఎత్తులో అమర్చుతారు. అందువల్ల ముందుగా మీరు టేబుల్‌ పైకి ఎక్కి ఫ్యాన్‌ను తీసేయండి. ఆ తర్వాత ఫ్యాన్‌ బ్లేడ్‌ని తీసి విడిగా శుభ్రం చేయండి. రెక్కలను కూడా సబ్బుతో రుద్ది శుభ్రంగా కడిగిన తర్వాత పొడి వస్త్రంతో తుడవాలి.
రెండో విధానం.. పాత పిల్లో కవర్‌ తీసుకుని టేబుల్‌ మీద ఎక్కి సీలింగ్‌ ఫ్యాన్‌ రెక్కలలో ఒకదానిని  కవర్‌ చేయాలి. ఇప్పుడు కవర్‌ పైనుంచి చేతులతో రుద్దాలి. అదేవిధంగా మూడు రెక్కలను శుభ్రం చేయాలి. రెక్కలపై పేరుకుపోయిన దుమ్ము, ధూళి, బూజు అంతా కవర్‌ లోపల పడిపోతుంది. తర్వాత దాన్ని పారవేసి పిల్లో కవర్‌ను ఉతుక్కుంటే సరిపోతుంది. 
గుర్తుంచుకోవాల్సింది.. ఫ్యాన్‌ను క్లీన్‌ చేసినప్పుడల్లా కింద ఒక షీట్‌ లేదా వస్త్రాన్ని పరవాలి. దీంతో ఫ్యాన్‌ క్లీన్‌ అయిన తర్వాత మీకు పని పెరగదు. ఫ్యాన్‌ మురికి షీట్లో పడిపోతుంది. ఫ్యాన్‌ శుభ్రం చేసేటప్పుడు కళ్లకి ప్లెయిన్‌ గ్లాసెస్‌ లేదా సన్‌ గ్లాసెస్‌ ధరిస్తే కంట్లో దుమ్ము పడకుండా ఉంటుంది. అలాగే ముక్కుకు మాస్క్‌ లేదా రుమాలు కట్టుకోవాలి లేదంటే డస్ట్‌ అలర్జీ వచ్చే ప్రమాదం ఉంది. ఫ్యాన్‌ని క్లీన్‌ చేసిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోవడం మరచిపోవద్దు. 

మరిన్ని వార్తలు