ఒకప్పుడు పేదల ఇంటి అవసరం.. ఇప్పుడు ఇంట్లో అలంకారంగా!

26 May, 2022 16:47 IST|Sakshi

కొలువుదీరుతున్న మట్టి అందం 

Creative Ideas: మట్టి పాత్రలు ఒకప్పుడు పేదల ఇంటి అవసరంగా ఉండేవి. ఇప్పుడు ధనవంతుల ఇళ్ల అలంకారాలుగా మారాయి. ఇంటి అలంకరణలో మట్టి అందాలు దండిగా చేరి నిండుదనాన్నిస్తున్నాయి. వెనకటి రోజులను మళ్లీ నట్టింట చూసుకోవడానికి పట్టణ జీవి మట్టి రూపాలను ఎంచుకుంటున్నాడు. అందుకేనేమో మట్టి.. రంగులద్దుకొని మరీ ముస్తాబవుతోంది. 

కుండల దొంతర.. సమృద్ధికి కుండల దొంతరలనూ ఓ గుర్తుగా చూస్తుంది ప్రాచీన భారతీయం. ఇప్పుడు ఆ కుండలు ఇల్లాలి చేతిలో ఓ కళగా మారి ఇల్లంతా రాజ్యమేలు తున్నాయి. మంచి నీటి కూజాల దగ్గర్నుంచి .. లివింగ్‌ రూముల్లో ఆర్ట్‌ కాన్వాస్‌గా.. బాల్కనీల్లో మొక్కలను ఆవరిస్తున్న తొట్టెలు చేరి ఇంటి కళనే మార్చేస్తున్నాయి.  

వంటపాత్రల హంగామా.. వంట కోసం ఇత్తడిని రీప్లేస్‌ చేసిన అల్యూమినియం జమానా కూడా పోయి మట్టి పాత్రల ఎరా మొదలైంది. వీటి శోభ వంట గట్టు మీద సరే... డైనింగ్‌ టేబుల్‌ మీదా విరాజిల్లుతోంది.. గ్లాసులు, బాటిళ్లుగా!  జల్లెడలు, జ్యూసర్లు, ప్లేట్లు, ఇడ్లీ పాత్రలు... ఒక్కటని ఏంటి ఇంట్లో అవసరాలకు ఉపయోగపడే పాత్రలన్నీ మట్టి రూపాలై పెద్ద పెద్ద షాపింగ్‌మాల్స్‌లలోనూ దర్శనమిస్తున్నాయి. ఇందులో టెర్రకోటానే ఆధిపత్యం చూపుతున్నా అక్కడక్కడా మన ప్రాంతీయ నల్ల మట్టీ మెరుస్తోంది.

మట్టి సవ్వడి.. అల్యూమినియం, స్టీల్‌తో తయారైన హ్యాంగింగ్‌ బెల్స్‌ చేసే సవ్వడి  మనకు తెలిసిందే. కానీ, గుడిలో గంటల మాదిరిగా రూపుదాల్చుకున్న మట్టి గంటల అమరికా ఇంటి ముందు కొత్త అందానికి తోరణంగా నిలుస్తోంది.

బొమ్మల కథ..  మట్టి గణేశుడు మరెన్నో రూపాలకు ప్రేరణ ఇచ్చాడు. రాజా–రాణి ఫేస్‌ మాస్క్‌లు, వెల్‌కమ్‌ బొమ్మలు గోడపైన హొయలొలికిస్తున్నాయి. ఇండోర్‌ ప్లాంట్స్‌ కోసం తొట్టెలుగానూ సరికొత్త మట్టిరూపాలు కొలువుదీరుతున్నాయి. ఈ మట్టి రూపాలకు పెద్ద మొత్తంలో ధర పెట్టాల్సిన అవసరం లేదు. వందల రూపాయల్లోనే దొరుకుతున్నాయి. రోజూవారీ వాడకంలో.. ఇంటి అలంకరణలో మేలైనవిగా నిలుస్తున్నాయి. 

Interior Decor: చేటలో ప్లాంట్‌.. బాల్కనీకి పల్లె సొగసు.. వెదురు అందం!

మరిన్ని వార్తలు