Negative Thoughts: గత అనుభవాలు, నెగెటివ్‌  ఆలోచనలు వెంటాడుతున్నాయా?

26 Feb, 2022 08:50 IST|Sakshi

గతంలో సంభవించిన అపజయాలు, ఎదురైన అనుభవాల వల్ల ప్రతికూల ఆలోచనలు రావడం సహజం. అయితే నెగెటివ్‌ ఆలోచనల వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోతారు. నిరాశా నిస్పృహలతో కుంగిపోతారు కనుక ప్రతికూల ఆలోచనల నుంచి బయటపడటానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుందని చెబుతున్నారు మానసిక నిపుణులు. మనకు చేదు అనుభవాలు ఎదురైన గతాన్ని ఓ పీడకలలా మర్చిపోవాలి. గతంలో జరిగిన తప్పులు, ఇతరుల వల్ల మనకు ఎదురైన అవమానాలను గుర్తు చేసుకోకూడదు. అదేవిధంగా మన వల్ల ఇతరులకు కలిగిన ఇబ్బందులు, అసౌకర్యాలు పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలి.

ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని ఓ పుస్తకంలో రాసుకోవాలి. అవి  మనం తీసుకొనే నిర్ణయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఆలోచించాలి. అసలు ఇలాంటి ఆలోచనలు ఎందుకు కలుగుతున్నాయో తెలుసుకోవాలి. వాటినుంచి బయట పడాలనే బలమైన కోరిక, తపన మనకు ఉండాలి. భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించడం, అసలు ఆలోచించక పోవడం రెండూ తప్పే. భవిష్యత్తులో అలా జరుగుతుందేమో... ఇలా జరుగుతుందేమో అనే నెగెటివ్‌ ఆలోచనల వల్ల ఆరోగ్యం పాడవుతుంది. అందువల్ల అంతా మంచే జరుగుతుందనే ఆలోచన మంచిది.
చదవండి: కాలేయాన్ని కాపాడుకోవాలంటే...ఏం చేయాలి?

ఎప్పుడైతే మీపై మీకు నమ్మకం లేదో ప్రతికూల ఆలోచనలు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి అయేలా చేస్తాయి.  అందువల్ల మన మీద మనకు ఇష్టం, గౌరవం, నమ్మకం ఉండేలా చూసుకోవడం అత్యవసరం. ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడు... వాటిని సానుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయాలి.

చివరగా ఒక మాట.. నెగెటివ్‌ ఆలోచనలు మనల్ని చుట్టుముట్టకూడదంటే ముందు మనల్ని మనం అన్‌ కండిషనల్‌గా ప్రేమించుకోవాలి. సాధ్యమైనంత వరకూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతాం. 
చదవండి: Laser Comb: విగ్గు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.. నొప్పి ఉండదు.. ధర ఎంతంటే!

మరిన్ని వార్తలు