ఇమ్యూనిటీ ఫస్ట్‌...పిండి వంటలు నెక్ట్స్‌

3 Nov, 2021 22:33 IST|Sakshi

నగరంలో లక్షలాది మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నవారు ఉన్నారు. మరోవైపు ఇంకా కోవిడ్‌ ప్రమాదం పొంచి ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో పండుగ సంబరాన్ని ఆస్వాదిస్తూనే మరోవైపు జిహ్వా చాపల్యాన్ని నియంత్రించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
–సాక్షి, సిటీబ్యూరో

    పండుగల సీజన్‌ వచ్చిందంటే జీవితంలో జిహ్వకు ఉన్న ప్రాధాన్యం ఏమిటో దాని ప్రభావం ఏమిటో కూడా అర్ధమవుతుంది. రకరకాల వంటకాల ఘమఘమలు ఇల్లంతా పరుచుకోకపోతే పండుగ పరిపూర్ణం కాదని భావిస్తాం. దీపావళి రోజున రకరకాల పిండివంటలు వండుకోవడం, మిఠాయిలు కొని పరస్పరం పంచుకోవడం సంప్రదాయం. అయితే సంప్రదాయాన్ని వదులుకోకుండానే  వ్యాధి నిరోధక సామర్ధ్యాన్ని కాపాడుకోవడం అత్యవసరం.  

మక్కువ ఉన్నా తక్కువగా...
    అరిసెలు, బూరెలు, గారెలు, కజ్జికాయలు...ఇంకా ఇష్టమైన వంటకాలను చూస్తే నియంత్రించుకోవడం కష్టం. కాబట్టి వీలున్నంత వరకూ తక్కువ పరిమాణంలో వండుకోవడం మంచిది. అంతేకాకుండా పిండి వంటల్ని పండుగకు ఒక్కసారే చేసుకుని కొన్ని రోజుల పాటు నిల్వ  ఉంచే సమయంలో వాటిని సరైన చోట, సరైన విధంగా నిల్వ చేయాలి. అలాగే కొన్ని రోజుల పాటు పాడవకుండా ఉండాలన్నా, కొంచెం ఎక్కువ పరిమాణంలో తీసుకున్నా అనారోగ్యం కలుగకుండా ఉండాలన్నా.. వండేటప్పుడు ముడిదినుసులు, దాదాపుగా అన్నీ ఆయిల్‌ వంటకాలే కాబట్టి, సరైన నూనెలు ఉపయోగించడం తప్పనిసరి. 

ఆయిల్‌...కేర్‌
    పండుగ సమయంలో ఇచ్చి పుచ్చుకునేందుకు షాప్స్‌లో స్వీట్స్‌ కొనుగోలు చేసే ముందు  వాళ్లు వినియోగించిన ఆయిల్స్‌ గురించి కనుక్కోవడం అవసరం. ఇప్పుడు దాదాపు అన్ని ప్రధాన బ్రాండ్స్‌ వాళ్లూ ఆరోగ్య అవగాహనను దృష్టిలో పెట్టుకుని  నాణ్యతా పరంగా తాము పాటిస్తున్న ప్రమాణాలు వెల్లడిస్తున్నారు. ‘‘అత్యుత్తమ రా మెటీరియల్స్, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నూనె ఉత్పత్తి చేస్తున్నాం. నిల్వ చేసుకునేందుకు వీలుగా మా ప్యాక్స్‌  ట్యాంపర్‌ ప్రూఫ్‌ సీల్స్‌తో వస్తాయి. మా ప్రమాణాలే ఐబిసి, యుఎస్‌ఎల నుంచి  ఏసియాస్‌ మోస్ట్‌ ట్రస్టెడ్‌ ఆయిల్‌ బ్రాండ్‌ అవార్డ్‌ని దక్కించాయి’’ అని గోల్డ్‌ డ్రాప్‌ సంస్థ ప్రతినిధి మితేష్‌ లోహియా చెప్పడం దీనికో నిదర్శనం. అంతేకాక మార్కెట్లో సహజమైన పద్ధతిలో తయారైన ఆర్గానిక్‌ నూనెలూ లభిస్తున్నాయి. వాటినీ పరిశీలించడం మంచిది. 

వ్యాయామం...అవసరం..
    జాగ్రత్తలు పాటిస్తూ పిండి వంటలు పరిమితంగా ఆస్వాదిస్తూ ఈ సమయంలో తగినంత వ్యాయామం కూడా జోడించాలి. ఒక్కసారిగా అధికంగా శరీరానికి అందిన కేలరీలు ఖర్చయేందుకు శారీరక శ్రమ తప్పనిసరి. పండుగలు ఏటేటా వస్తాయి... ఇప్పటి పరిస్థితుల్లో ఆరోగ్యం కోల్పోతే తిరిగి తెచ్చుకోవడం  సులభం కాదని  గుర్తుంచుకోవాలి. 

పోషకాహారం అవసరం..
నగరంలో కోవిడ్‌ నుంచి కోలుకున్నవారున్నారు కోల్పోయిన ఆరోగ్యాన్ని శక్తిని తిరిగి సమకూర్చుకునేందుకు వారికి కొన్ని నెలల పాటు పోషకాహారం అవసరం. పండుగల సందర్భంగా వండే వంటకాల్లో పోషకాలు ఉండేవి తక్కువే. రుచి కోసం వీటిని తీసుకున్నప్పటికీ, మితిమీరకుండా జాగ్రత్తపడాలి.
–వాణిశ్రీ, న్యూట్రిషనిస్ట్‌

మరిన్ని వార్తలు