Diwali Celebrations: దీపావళి వేడుకలు.. అమెరికాలో స్కూళ్లకు సెలవు

8 Nov, 2023 10:31 IST|Sakshi

అగ్రరాజ్యం అమెరికాలో దీపావళి వేడుకలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ కోసం అమెరికాలోని భారతీయులు భారీ వేడుకలను ప్లాన్ చేశారు. అమెరికా ప్రభుత్వం దీపావళిని పండుగగా గుర్తించి పాఠశాలలకు సెలవు ప్రకటించింది. ఈ నేపథ్యంలో న్యూజెర్సీలోని ఎడిసన్‌లో దీపావళి ఫెస్టివల్ గ్రాండ్‌గా జరిగింది. పాపాయిని పార్క్‌లో ఎడిసన్ మేయర్ సామ్ జోషి ఆధ్వర్యంలో దీపావళి వేడుకలను నిర్వహించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించే ఈ వేడుకల్లో చిన్నా, పెద్ద అంతా కలిసి ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు.

అమెరికాలోని  వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి ఈ వేడకల్లో  పాల్గొన్నారు. తెలుగు వైభవాన్ని ఘనంగా చాటుతూ ఈ వేడుకలు నిర్వహించారు.  తెలుగు పాట,ఆట కనువిందు చేశాయి. తెలుగు సంస్క్రృతి, సంప్రదాయాలకు ఈ వేడుకలు అద్దం పట్టాయి. మహిళలు  రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి తీసుకువచ్చారు. ఇక  వేదికపై  బతుకమ్మలను పెట్టి ఆడపడుచులు ఆడి పాడారు.  పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఇక పలువురు కళాకారులు భారతీయ సంస్కృతిని చాటిచెప్పేలా ప్రదర్శనలు నిర్వహించారు. జే సీన్  స్ఫెషల్ మ్యూజికల్ ఫెర్మామెన్స్‌.. అహుతులను అలరించింది. 

ఈ  సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భారతీయ సాంప్రదాయ నృత్యాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఇక దీపావళి వేడుకల్లో ఇండియన్‌ ఫుడ్‌ స్టాల్స్ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. షాపింగ్ స్టాల్స్, ఫుడ్ అండ్ రిటైల్ వెండర్స్ స్టాల్స్,  కిడ్స్ జోన్, ఫైర్ వర్క్, Raffles బహుమతులు, విందు భోజనంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. ఇక ఈ వేడుకల్లో పాల్గొనటం ఒక అద్భుతమైన అనుభవం అంటూ ప్రవాసులు తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న ఎడిసన్ మేయర్ సామ్ జోషి‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు