ఇంటిలోనూ రాక్షసులా? అలాంటి వాడు మీకూ అల్లుడుగా వస్తే ఏమవుతుందో ఆలోచించారా?

25 Nov, 2022 10:10 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మహిళలపై హింస–నివారణ చర్యల దినం

స్త్రీ గడప దాటితే పదిలం కాదని పెద్దలు నూరిపోశారు. కాబోలు అని స్త్రీలు అనుకున్నారు. నేడు స్త్రీలు ఇంటిలోనే తీవ్ర అభద్రతను ఎదుర్కొంటున్నారని ఉదంతాలు చెబుతున్నాయి. ‘మహిళలపై హింస–నివారణ చర్యల అంతర్జాతీయ దినం’ సందర్భంగా ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన తాజా నివేదికలో ప్రపంచంలో ప్రతి 11 నిమిషాలకు ఒక స్త్రీ అయిన వారి చేతిలో ప్రాణాలు కోల్పోతోంది.

అంటే గంటకు ఐదుగురు ఇంట్లోని వాళ్ల వల్ల చనిపోతున్నారు. ఇటీవల ఢిల్లీలో చోటు చేసుకున్న శ్రద్ధా వాకర్‌ హత్య ఇల్లు ఎంత ప్రమాదకరంగా ఉందో చెప్పింది. స్త్రీని సొంత ఆస్తిగా తాము దండించదగ్గ ప్రాణిగా మగవాడు భావించే వరకు ఈ హింస పోదు. విస్తృత చైతన్యం కోసం ప్రయత్నించడమే ఇప్పుడు చేయవలసిన పని. సామూహిక నిరసన దీనికి విరుగుడు.

కుమార్తెను చంపి ‘పరువు’ను నిలబెట్టుకున్నాననుకుంటాడు తండ్రి. భర్త భార్యను ముక్కలు ముక్కలు చేసి ‘క్షణికావేశం’లో చేశానని వ్యాఖ్యానిస్తాడు. అన్నయ్యకు ఎప్పుడూ చెల్లెల్ని చెంపదెబ్బ కొట్టే హక్కు ఉంటుంది. బయట భయం వేస్తే స్త్రీలు ఇంట్లో వారికి చెప్పుకుని ధైర్యం పొందాలనుకుంటారు. ఇంట్లో వాళ్లే హింసాత్మకంగా మారితే ఆమె

ఎవరితో చెప్పుకోవాలి?
భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా స్త్రీలకు ‘అయిన వారి’ బెడద ఎక్కువైందని ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక– అంటే రెండు రోజుల క్రితం నివేదిక తెలియచేస్తోంది. 2021 లో ప్రపంచవ్యాప్తంగా హత్యకు గురైన స్త్రీలు 81,000 మంది. వీరిలో 56 శాతం అంటే 45,000 మంది అయిన వారి (భర్త, తండ్రి, సోదరుడు, బంధువు, స్నేహితుడు) చేతిలో మృత్యువాత పడ్డారు.

‘ఇది చాలా ఆందోళన కలిగించే విషయం’ అని ఐక్యరాజ్య సమితి సర్వోన్నత ప్రతినిధి ఆంటోనియో గుట్రెస్‌ అన్నారు. 2021లో సహజ మరణం పొందే స్త్రీలు ఎలా ఉన్నా ప్రతి పదిమందిలో నలుగురు కేవలం ఉద్దేశపూర్వకంగా చంపబడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.

అలాంటి వాడు అల్లుడుగా వస్తే ఏమవుతుందో ఆలోచించారా?
అసలు స్త్రీ మీద హింస ఎందుకు చేయాలి? అదీ మన కుటుంబ సభ్యురాలిపై ఎందుకు చేయాలి? దీనికి అనుమతి ఉందని పురుషుడు ఎందుకు అనుకోవాలి? భర్త భార్యను కొడుతూ ఉంటే ‘వాడి పెళ్లాం... వాడు కొట్టుకుంటాడో కోసుకుంటాడో’ అని ఇరుగు పొరుగువారు ఎందుకు అనుకోవాలి.

ఇంకా ఎంతకాలం అనుకోవాలి. ఇంట్లో బాల్యంలో ఆడపిల్ల తప్పు చేస్తే ఇంటి మగపిల్లాణ్ణి పిలిచి ‘నాలుగు తగిలించరా’ అని చెప్పే తల్లులు, తండ్రులు ఆ నాలుగు తగిలించి మరో ఇంట్లో పెరిగినవాడు తమకు అల్లుడుగా వస్తే ఏమవుతుందో ఆలోచించారా?

హింస ద్వారా స్త్రీని అదుపు చేయాలని పురుషుడు అనుకున్నంత కాలం ఇలాంటి ధోరణి కొనసాగుతూనే ఉంటుంది. కుటుంబంలో అందరూ కుటుంబ మర్యాదకు బాధ్యులే. కాని స్త్రీకి ఆ భారం ఎక్కువ ఉంచారు. ఆమె ఎప్పటికప్పుడు తన ప్రవర్తనతో, పరిమితం చేసుకున్న ఇష్టాలతో, అనుమతించిన మేరకు నడుచుకుంటూ కుటుంబ మర్యాద కాపాడాలి.

‘మగాడికి ఎదురు తిరగడం’ అంటే
అంటే ఆమె జీవితం ఆమె పూర్తిగా జీవించడానికి వీల్లేదు. అలాంటి ప్రయత్నం ‘మగాడికి ఎదురు తిరగడం’గా భావించబడుతుంది. ‘మగాడికి ఎదురు తిరగడం’ అంటే ‘సమాజానికి ఎదురు తిరగడమే’. ఎందుకంటే సమాజం కూడా ‘మగ స్వభావం’ కలిగినదే. అందువల్ల మగాడు, సమాజం కలిసి స్త్రీకి ‘బుద్ధి’ చెప్పాలనుకుంటాయి. అంటే భౌతికంగా దండించాలనుకుంటాయి.

మనిషి నాగరికం అయ్యాడనుకున్న ఇంత కాలం తర్వాత కూడా పురుషుడితోపాటు సమాన సంఖ్యలో ఉన్న ఒక జాతి జాతంతా హింసాయుత పీడనకు లోను కావడం విషాదం. ఇల్లు హింసకు ఆలవాలం కావడం పెను విషాదం.

దీనిని మార్చాలి. పురుషులను సరిదిద్దడానికి స్త్రీలు నోరు తెరవాలి. చట్టాల మద్దతు తీసుకోవాలి. ధైర్యంగా తమపై హింసను ఎదిరించగలగాలి. మహిళలపై జరిగే హింస నశించాలని ఆశిద్దాం.

చదవండి: 5AM Club: వాళ్లంతా ఉదయం ఐదింటికే నిద్రలేస్తారు! ప్రయోజనాలెన్నో!
Cinnamon Health Benefits: దాల్చిన చెక్క పొడి పాలల్లో వేసుకుని తాగుతున్నారా? సినామాల్డెహైడ్‌ అనే రసాయనం వల్ల

మరిన్ని వార్తలు