దీదీ కావాలా.. లాకెట్‌ కావాలా..!

6 Apr, 2021 06:45 IST|Sakshi
లాకెట్‌ చటర్జీ

బెంగాల్‌ ఎన్నికల్లో ఒక నినాదం బలంగా వినిపిస్తోంది. ‘మీకు దీదీ కావాలా లాకెట్‌ కావాలా’ అని. దీదీ అంటే మమతా బెనర్జీ. లాకెట్‌ అంటే లాకెట్‌ చటర్జీ. గత ఐదేళ్లుగా బిజెపిలో పని చేస్తూ ఎం.పిగా గెలిచి ఇప్పుడు కీలకమైన ఎన్నికలు అయినందున అసెంబ్లీ బరిలో దిగిన లాకెట్‌ చటర్జీ అన్నీ అనుకున్నట్టుగా అయితే బెంగాల్‌కు కాబోయే ముఖ్యమంత్రి అని కొందరు జోస్యం చెబుతున్నారు. బెంగాల్‌లో మహా శక్తి అయిన మమతా బెనర్జీని ఈ మాజీ నటి సమర్థంగా ఎదుర్కొంటూ వార్తల్లో నిలవడం విశేషమే. పాపులర్‌ విన్యాసాల ద్వారా జనాన్ని ఆకర్షిస్తున్న ఈ మహిళా నేత పరిచయం...

కళాకారులకు జనాకర్షక పద్ధతులు బాగానే తెలుస్తాయి. ఎలక్షన్లలో దిగిన సినిమా తారలు తమ అయస్కాంత శక్తితో సగటు ఓటరును గట్టిగా లాగగలరనేదానికి లాకెట్‌ చటర్జీ కూడా ఒక ఉదాహరణే. పశ్చిమ బెంగాల్‌లో ఇప్పుడు బి.జె.పి తరఫున ఎవరైనా గట్టి మహిళా నాయకురాలు ఉందంటే అది ఈ లాకెట్‌ చటర్జీనే. బెంగాల్‌కు మహిళా ముఖ్యమంత్రి పని చేసే ఆనవాయితీని కొనసాగించాలని బి.జె.పి అనుకుంటే ఈ అసెంబ్లీ ఎలక్షన్లలో ఆ పార్టీ గెలిస్తే లాకెట్‌ చటర్జీ రసగుల్లా విరిగి పాకంలో పడ్డట్టే. ఎందుకంటే ఆమెకు మాత్రమే ఆ పార్టీ తరఫున మహిళా సి.ఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఎవరీ లాకెట్‌ చటర్జీ
లాకెట్‌ చటర్జీది కోల్‌కతా ఉత్తర ప్రాంతంలో ఉండే దక్షిణేశ్వర్‌. ఇక్కడ కూడా ఒక కాళీ ఆలయం ఉంది. ఆమె తండ్రి అందులో పురోహితుడుగా పని చేసేవాడు. లాకెట్‌ చటర్జీకి చిన్నప్పటి నుంచి డాన్స్‌ అంటే ఆసక్తి ఏర్పడింది. భరత నాట్యం, కథక్‌ నేర్చుకుని బెంగాల్‌ నటి మమతా శంకర్‌ ట్రూప్‌లో 13 ఏళ్ల వయసులోనే చేరి ప్రదర్శనలు మొదలెట్టింది. ఒక వైపు దక్షిణేశ్వర్‌లో చదువుకుంటూనే సినిమాల్లో ప్రవేశించింది. దాదాపు 35 సినిమాల్లో నటించింది. అయితే అవన్నీ ద్వితీయ శ్రేణి సినిమాలు అని చెప్పవచ్చు. పెద్ద పెద్ద తారాగణం ఉండే భారీ సినిమాలు ఆమెకు దక్కలేదు. ఆమె నటించిన ఒక సినిమా తెలుగు డబ్బింగ్‌తో యూ ట్యూబ్‌లో ఉంది. సినిమా రంగంలో తన ప్రస్తావనను ముగించి ఆమె 2015లో తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరింది. అయితే కొద్దిరోజులకే అక్కడ ఇమడలేక బయటకు వచ్చి బి.జె.పిలో చేరింది.

2016లో ప్రత్యక్ష ఎన్నికలలో...
2016 పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎలక్షన్లలో బి.జె.పి తరఫున మాయురేశ్వర్‌ నుంచి లాకెట్‌ చటర్జీ నిలబడింది. అయితే తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి చేతిలో ఓడిపోయింది. అయినప్పటికీ బి.జె.పి ఆమెను 2019 పార్లమెంట్‌ ఎలక్షన్లలో ‘హుగ్లీ’ నియోజకవర్గం నుంచి నిలబెడితే ఆశ్చర్యకరంగా 70 వేల ఓట్ల మెజారిటీతో గెలిచింది. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి హుగ్లీ పార్లమెంట్‌ నియోజకవర్గం కీలకమైనది. ఇక్కడ 18 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలన్నింటికి బి.జె.పి ఇప్పుడు లాకెట్‌ను ప్రచార కార్యదర్శి చేసింది. అంతే కాదు ‘చిన్‌సుర’ (చుచుర) నియోజకవర్గం నుంచి ఎం.ఎల్‌.ఏ అభ్యర్థి గా నిలబెట్టింది. పార్టీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి లాకెట్‌ రేయింబవళ్లు కష్టపడుతోంది.

సైకిల్‌ ప్రచారం
లాకెట్‌ చటర్జీ విభిన్న ప్రచార రీతులను పాటించడంలో సమర్థురాలు. తాను పార్లమెంట్‌ అభ్యర్థిగా నిలబడినప్పుడు పూర్తి ప్రచారాన్ని సైకిల్‌ మీద, స్కూటర్‌ మీద నిర్వహించింది. ఇప్పుడు కూడా సైకిల్‌ మీద ఎక్కువగా తిరుగుతూ పార్టీ కోసం ప్రచారం చేస్తోంది. అవసరమైన చోట కార్యకర్తలతో కలిసి పోలీసుల మీద, ప్రత్యర్థుల మీద కలబడిన రికార్డు ఆమెకు ఉంది. ప్రస్తుతం హుగ్లీ నది మీద పడవలో తిరుగుతూ ఆమె పడుతున్న శ్రమ ఓటర్ల దృష్టిలోనే కాదు మీడియా దృష్టిలో కూడా పడుతోంది. సొంతగా చేతితో రాసిన పోస్టర్లను  విడుదల చేసి తృణమూల్‌తో ఐసల్‌ ఫైసల్‌ తేల్చుకోవడానికి సిద్ధమవుతోంది.

మమతాపై దాడి
లాకెట్‌ చటర్జీని మమతాపై దాడికి పార్టీ ఎక్కువ ఉపయోగించుకుంటోంది. లాకెట్‌ కూడా సమర్థమైన వాదనే ఓటర్ల ముందు వినిపిస్తోంది. ‘స్త్రీలు తమకేదైనా మేలు జరుగుతుందని మహిళా సి.ఎంగా మమతా బెనర్జీని ఎన్నుకున్నారు. రెండుసార్లు పదవి ఇచ్చారు. కాని ఆమె వారి కోసం ఏమీ చేయలేదు. పశ్చిమ బెంగాల్‌లో ఉమెన్‌ ట్రాఫికింగ్‌ అత్యధికంగా ఉంది. గృహ హింస ఎక్కువ గా ఉంది. యాసిడ్‌ దాడులైతే దేశంలోనే బెంగాల్‌లో అత్యధికం. కిడ్నాప్‌ కేసులకు అతీగతీ లేదు. ఇవన్నీ మమతా బెనర్జీ వైఫల్యాలు. స్త్రీలు ఇవన్నీ గమనించారు. వారు ఈ.వి.ఎంల ద్వారా తమ ప్రతీకారం తీర్చుకుంటారు’ అని లాకెట్‌ తన ప్రచారంలో మాట్లాడుతూ ఉంది.

అవతలి వైపు
అయితే అవతలి వైపు నుంచి చూస్తే లాకెట్‌కు అన్నీ అనుకూలంగా ఉంటాయని చెప్పలేము. హుగ్లీ నదిపై ఆధునిక ఘాట్‌ కట్టి వారణాసిలోలాగా హారతి కార్యక్రమం చేస్తామని ఆమె చేస్తున్న హామీలు ఆకర్షిస్తున్నా మాకు ఉపాధి కావాలి అనే యువతే ఆమెకు ఎక్కువగా ఎదురు పడుతోంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ అభివృద్ధి చేసిందో చేయలేదో బి.జె.పి వస్తే మొత్తం వాతావరణం దెబ్బ తింటుందని భయపడుతున్నాం అనేవారూ ముఖ్యంగా పై వయసు వారు ఆమె ప్రచార పరిధిలో కనిపిస్తున్నారు. అలాగే తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా తమ ప్రచారంలో జూన్‌ మలియా, కౌషాని ముఖర్జీ, లౌలీ మైత్ర వంటి ఈకాలపు తారలను రంగంలో దించి ఉంది.

హోరాహోరీగా సాగుతున్న ఈ పోటీలో విజేతలెవరో అన్న ఉత్కంఠ తప్పక నెలకొని ఉంది. ఎవరు గెలిచినా బెంగాల్‌ మళ్లీ మహిళా సి.ఎంనే చూస్తుందని ఆశిద్దాం.

– సాక్షి ఫ్యామిలీ
 

మరిన్ని వార్తలు