రివర్‌ సఫారీ! శ్రీదీవిలో దీవుల మధ్య విహారం

5 Oct, 2023 16:37 IST|Sakshi

సెప్టెంబర్‌లో నెలలో ఓ వారం రోజుల పాటు శ్రీలంకలో పర్యటించే అవకాశం వచ్చింది. నేను చూసిన శ్రీలంకకు అక్షరరూప పరంపర ఇది. మొదట మదుగంగలో రివర్‌ సఫారీ 

మదుగంగ... ఈ నది శ్రీలంక దీవిలో ప్రవహిస్తోంది. బాల్‌పిటియా అనే చిన్న పట్టణం నుంచి ఈ నదిలో రివర్‌ సఫారీ చేయవచ్చు. ఈ ప్రదేశం కొలంబో– గాలే హైవేలో వస్తుంది. బెన్‌తోట నుంచి అరగంట ప్రయాణ (18 కి.మీలు) దూరంలో ఉంది బాల్‌పిటియా. ఇక్కడ మదుగంగ నది విశాలమైన సరస్సును తలపిస్తూ ఉంటుంది. నీరు నిశ్చలంగా అనిపిస్తుంది. ఈ ప్రదేశం నుంచి పడవలో ప్రయాణం మొదలు పెడితే ఒకటిన్నర గంట నదిలో విహరించవచ్చు. నది మధ్యలో ఉన్న దీవులను చుట్టిరావచ్చు. మధ్యలో బుద్ధుడి విగ్రహాన్ని, వినాయకుడి మందిరాన్ని చూడవచ్చు. ముఖ్యంగా ఇది ప్రకృతి రమణీయతను, మాన్‌గ్రోవ్‌ (మడ అడవులు) బారులను చూడడానికి వెళ్లాల్సిన ప్రదేశం.

నదికి మహా స్వాగతం
మదు గంగ నది తీరమంతా మడ అడవులు దట్టంగా ఉంటాయి. చెట్ల కొమ్మల నుంచి పుట్టుకొచ్చిన వేళ్లు నదిలోని నీటి కోసం ఊడల్లాగ కిందకు వేళ్లాడుతుంటాయి. బాల్‌పిటియా దగ్గర మొదలైన రివర్‌ సఫారీ మొదట మదుగంగ నది హిందూమహాసముద్రంలో కలిసే ప్రదేశం వరకు సాగుతుంది. నిశ్చలంగా ప్రవహించిన నదికి హిందూ మహా సముద్రం అలలతో స్వాగతం పలుకుతున్న అద్భుతాన్ని చూసిన తరవాత దీవుల పరిక్రమ దిశగా సాగింది మా పడవ.

ప్రకృతి ప్రపంచమిది
శ్రీలంకలో ఎటు చూసినా పచ్చదనమే. అయితే ఈ నది మధ్య ఉన్న దీవులు ఇంకా దట్టమైనవి, ఇంకా పచ్చనైనవి. పొన్నియిన్‌ సెల్వన్‌ సినిమాలో కనిపించినట్లు దట్టమైన అడవులవి. ఈ దీవులు కొన్ని ప్రైవేట్‌ వ్యక్తులవి. కొన్ని సామాన్య జనావాసాలు. ఒక దీవిలో పూర్తిగా దాల్చిన చెక్కను చెక్కే వాళ్లే నివసిస్తున్నారు. మొత్తం ఇరవై కుటుంబాలు. దాల్చిన చెక్క చెట్ల నుంచి బెరడును సేకరించడం, సినమిన్‌ ఆయిల్‌ తయారు చేయడమే ఆ దీవిలో నివసించే వారి వృత్తి. పడవలన్నీ ఆ దీవి దగ్గర ఆగుతాయి. ఒక ఇంట్లోకి వెళ్లగానే ఒక చిన్న గది, పర్యాటకులు కూర్చోవడానికి చేసిన ఏర్పాటు ఉంది. మనం వెళ్లగానే ఒక వ్యక్తి సినమిన్‌ ఆకులు రెండింటిని మన చేతిలో పెట్టి వాసన చూడమంటాడు. ఆ తర్వాత ఒక కర్రను చూపించి బెరడును ఒలుస్తాడు. ఆ తర్వాత పర్యాటకులందరికీ గాజు కప్పుల్లో దాల్చిన చెక్క టీ ఇస్తారు.

చేపల పట్టే అమ్మాయి
టీ తాగిన తర్వాత వారి వద్దనున్న దాల్చిన చెక్కతోపాటు సినమిన్‌ పౌడర్‌ ప్యాకెట్‌లు, సినమిన్‌ ఆయిల్‌ సీసాలను మన ముందు పెడతారు. కావల్సినవి కొనుక్కున్న తర్వాత పడవ ఇతర దీవుల వైపు సాగుతుంది. ఈ మధ్యలో బుద్ధుని విగ్రహం దగ్గర కొంతసేపు ఆగవచ్చు. ఒక్కో దీవిని చుట్టి వస్తుంటే మనం ప్రకృతి ప్రపంచాన్ని చుట్టి వస్తున్న విజేతగా ఒకింత అతిశయంగా ఫీలవుతాం. అన్నట్లు చేపలతో ఫుట్‌ మసాజ్‌ సౌకర్యం కూడా ఒక దీవిలో ఉంది. చేపలు పట్టే అమ్మాయి మదుగంగలో ఒకమ్మాయి చిన్న తెడ్డు పడవలో చేపలు పడుతూ కనిపించింది. ‘నువ్వు ఆడపిల్లవి, ఈ పనులు నువ్వు చేసేవి కాదు’ అని అడ్డగించే వాళ్లు లేకపోతే అమ్మాయిలు ఏ పనిలోనైనా అద్భుతాలు సాధిస్తారనిపించింది.

ఆ అమ్మాయికి హాయ్‌ చెప్పి, మనసులోనే సెల్యూట్‌ చేసుకుని ముందుకు సాగిపోయాం. తిరుగు ప్రయాణంలో ఒక దీవి దగ్గర గబ్బిలాలు భయం గొల్పాయి. దీవి నిండా చెట్లకు తలకిందుగా వేళ్లాడుతూ నల్లటి పెద్ద పెద్ద గబ్బిలాలు. ఇంకొద్ది సేపు చూడాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ ఆ దృశ్యం ఆహ్లాదంగా అనిపించక ముందుకు సాగిపోయాం. ఇక్కడ ముందుకు సాగిపోవడం అంటే బయలుదేరిన ప్రదేశం వైపుగా అన్నమాట. పడవ దిగేటప్పటికి రెస్టారెంట్‌లో వంట సిద్ధంగా ఉంది. రివర్‌ సఫారీకి బయలుదేరేటప్పుడే ఫుడ్‌ ఆర్డర్‌ తీసుకున్నారు. రకరకాల కూరగాలయలను కొబ్బరి పాలతో ఉడికించిన కూరలతో మంచి భోజనం పెట్టారు. చేపల కూర కూడా రుచిగా ఉంది.

ఫాలింగ్‌ డౌన్‌ ఫాలింగ్‌ డౌన్‌...
మాన్‌గ్రోవ్‌ బారుల మధ్య నదిలో విహారం అద్భుతంగా ఉంటుంది. చెట్లు ఒక్కో చోట నదిని ఇరుకు చేస్తాయి. గుహలోకి వెళ్లినట్లు పడవ కొమ్మల మధ్య దూరి పోతుంది. నది మీద ఇనుప వంతెనలుంటాయి. వాటి దగ్గరకు వచ్చినప్పుడు దేహాన్ని బాగా వంచి పడవలో ఒదిగి కూర్చోవడం, చిన్నపిల్లల్లాగ భయంభయంగా వంతెన వెళ్లిపోయిన తరవాత పైకి లేవడం, ఫాలింగ్‌ డౌన్‌ ఫాలింగ్‌ డౌన్‌... లండన్‌ బ్రిడ్జి ఫాలింగ్‌ డౌన్‌ అని పాడుకున్నట్లే... ఈ రివర్‌ సఫారీలో ‘కమింగ్‌ సూన్‌ కమింగ్‌ సూన్‌ వన్‌మోర్‌ బ్రిడ్జ్‌ ఈజ్‌ కమింగ్‌ సూన్‌’ అని పాడుకుంటూ పడవలో దాక్కోవడం... పర్యాటకులను చిన్న పిల్లలను చేస్తుంది.
– వాకా మంజులారెడ్డి

(చదవండి: పర్యాటకుల స్వర్గధామం కోనసీమ, ఆతిథ్యం నుంచి ఆత్మీయత వరకు..)

మరిన్ని వార్తలు