ప్రమాదం అంచున మనదేశం.. మెంటల్‌ హెల్త్‌పై జాగ్రత్తలు తీసుకోకపోతే..!

14 May, 2023 09:04 IST|Sakshi

మీరు ఆరోగ్యంగా ఉన్నారా? అని ప్రశ్నిస్తే కొంతమంది తమ ఆరోగ్య సమస్యల గురించి ఏకరువు పెడతారు. మరికొందరు ‘నాకేమండీ, ఏ జబ్బూ లేదు’ అని ధీమాగా చెప్తారు. కానీ ఆరోగ్యంగా ఉండటమంటే జబ్బు లేకపోవడం మాత్రమే కాదు. ఆరోగ్యంగా ఉండటమంటే శారీరకంగా, మానసికంగా, సామాజికంగా క్షేమంగా ఉండటమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. అలాగే మానసిక ఆరోగ్యం లేకుండా శారీరక ఆరోగ్యం ఉండదని హెచ్చరిస్తోంది. 

కానీ మనం శారీరక సమస్యల గురించి మాట్లాడుకున్నంత స్వేచ్ఛగా మానసిక సమస్యలగురించి మాట్లాడుకోం. మానసిక సమస్యల పట్ల సమాజంలో నెలకొన్న అపోహలే అందుకు కారణం. ఒక సైకాలజిస్టునో, సైకియాట్రిస్టునో కలిశారంటే.. పిచ్చి అని ముద్ర వేస్తారేమోననే భయం. ఈ అపోహలను, భయాలను దూరం చేసేందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం ‘మే’నెలను ‘మెంటల్‌ హెల్త్‌ మంత్‌’గా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో మనదేశంలో మానసిక ఆరోగ్యం స్థితిగతులను, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. 

మానసిక ఆరోగ్యం అంటే ఏమిటి? 
మానసిక ఆరోగ్యమంటే ఒక వ్యక్తి సైకలాజికల్‌గా, ఎమోషనల్‌గా  క్షేమంగా ఉండటం. బాలెన్స్‌డ్‌ మైండ్, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవాన్ని కలిగి ఉండటం. ఆలోచనల్లో, ప్రవర్తనలో, భావోద్వేగాల్లో బ్యాలెన్స్‌ కోల్పోయినప్పుడు మానసిక అనారోగ్యం వస్తుంది. దీర్ఘకాలికంగా కొనసాగే తీవ్రమైన ఒత్తిడి, జీవసంబంధ కారకాలు, మాదకద్రవ్యాల దుర్వినియోగం, ప్రతికూల ఆలోచనలు, ఆర్థిక సమస్యలు, ఒంటరితనం, కుటుంబ కలహాలు వంటి సమస్యలు కూడా మానసిక సమస్యలకు కారణమవుతాయి.

దాదాపు 250కి పైగా మానసిక రుగ్మతలు ఉన్నాయి. డిప్రెషన్, యాంగ్జయిటీ, ఫోబియా, ఈటింగ్‌ డిజార్డర్స్, మానసిక ఒత్తిడి సాధారణ మానసిక రుగ్మతలు. స్కిజోఫ్రీనియా, బైపోలార్‌ డిజార్డర్, క్లినికల్‌ డిప్రెషన్, సూసైడల్‌ టెండెన్సీ, పర్సనాలిటీ డిజార్డర్స్‌ అనేవి తీవ్రమైన మానసిక రుగ్మతలు. వీటిలో కొన్నిటికి కౌన్సెలింగ్, సైకోథెరపీ సరిపోగా, మరికొన్నిటికి మందులు అవసరమవుతాయి. కానీ అన్నింటినీ ‘పిచ్చి’ అనే పరిగణించడం వల్ల కనీసం మాట్లాడేందుకు కూడా భయపడుతున్నారు.

అపోహలను ఎలా ఎదుర్కోవాలి?
మానసిక రుగ్మతలను పరిష్కరించుకోవాలంటే ముందుగా వాటి పట్ల ఉన్న అపోహలను ఎదుర్కోవాలి. అందుకోసం మీడియాతో పాటు మనమందరం కృషి చేయాలి. అందుకోసం ఈ కింది సూచనలు ఉపయోగపడతాయి. 

  • మానసిక అనారోగ్యం సర్వసాధారణం. అది మానసిక బలహీనతకు సంకేతం కాదు. గణాంకాలను చూస్తే మీకు ఈ విషయం అర్థమవుతుంది.
  • మానసిక రుగ్మత లక్షణాలు కనిపించగానే ఎవరో ఏదో అనుకుంటారని భయపడకుండా వెంటనే చికిత్స తీసుకోండి.
  • మీరూ, మీ  సమస్య వేర్వేరు. మీ సమస్యతో మిమ్మల్ని ఐడెంటిఫై చేసుకోవద్దు. మీకు ‘బైపోలార్‌ డిజార్డర్‌’ ఉంటే, ‘నేను బైపోలార్‌’ అని కాకుండా ‘నాకు బైపోలార్‌ డిజార్డర్‌’ ఉంది అని చెప్పండి.
  • మానసిక అనారోగ్యం గురించి అవగాహన లేనివారి నుంచి మీకు వివక్ష ఎదురుకావచ్చు. దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. సమస్యను అర్థం చేసుకోలేకపోవడం వారి సమస్యగా పరిగణించండి.
  • మానసిక అనారోగ్యం సిగ్గుపడాల్సిన విషయమేం కాదు. కాబట్టి దాని గురించి మాట్లాడండి. అప్పుడే ప్రజల్లో ఉన్న అపోహలు దూరమవుతాయి.
  • మానసిక అనారోగ్యాల గురించి సరైన వ్యక్తుల నుంచి, సరైన సమాచారాన్ని సేకరించి విస్తృతంగా ప్రచారంలో పెట్టండి. 

మానసిక రుగ్మత లక్షణాలు

  • నిరంతర ప్రతికూల ఆలోచనలు
  • మరణం లేదా ఆత్మహత్య గురించి ఆలోచించడం
  • ఏకాగ్రత లోపం
  • ఎనర్జీ లెవెల్స్‌లో తీవ్ర మార్పులు
  • ఎక్కువగా ఒంటరిగా గడపాలని కోరుకోవడం
  • నియంత్రించలేని ప్రవర్తన, కోపం, విచారం
  • ఎవరికీ వినిపించని శబ్దాలు వినిపించడం, రూపాలు కనిపించడం

ఆత్మహత్యల రాజధానిగా దేశం
మన దేశంలో ప్రతి అయిదుగురిలో ఒకరు ఏదో ఒక రకమైన మానసిక అనారోగ్య లక్షణాలతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో దాదాపు ఆరు నుంచి ఏడు కోట్ల మంది ప్రజలు సాధారణ, తీవ్రమైన మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. ఒక సంవత్సరంలో 2.6 లక్షల ఆత్మహత్య కేసులతో భారతదేశం ప్రపంచ ఆత్మహత్యల రాజధానిగా మారడం బాధాకరమైన విషయం. భారతదేశంలో ప్రతి లక్ష మందికి సగటు ఆత్మహత్యల రేటు 10.9గా ఉందని డబ్ల్యూహెచ్‌ఓ గణాంకాలు చెబుతున్నాయి. 

మానసిక నిపుణుల కొరత
దేశవ్యాప్తంగా కేవలం 43 ప్రభుత్వ మానసిక ఆరోగ్య సంస్థలు ఉన్నాయి. 11,500 మంది సైకియాట్రిస్టులు అవసరంకాగా కేవలం 3800 మాత్రమే అందుబాటులో ఉన్నారు. అంటే నాలుగు లక్షల మందికి ఒక సైకియాట్రిస్ట్‌ మాత్రమే ఉన్నారు. 17,250క్లినికల్‌ సైకాలజిస్టులు అవసరం కాగా కేవలం 900 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. అలాగే సైకియాట్రిక్‌ సోషల్‌ వర్కర్లు, సైకియాట్రిక్‌ నర్సులు, కౌన్సెలింగ్‌ సైకాలజిస్టులు కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు.  - సైకాలజిస్ట్‌ విశేష్‌ 

మరిన్ని వార్తలు