ఆ పాట మీరు పాడొద్దని బాలూగారితో అన్నాను

27 Sep, 2020 04:18 IST|Sakshi

ఆర్‌.నారాయణమూర్తి

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఘంటసాలగారి తర్వాత ఏయన్నార్, ఎన్టీఆర్‌ సినిమాలకు మళ్లీ ఎవరు పాడతారు? మాధవపెద్ది సత్యం తర్వాత ఎస్వీ రంగారావు, రేలంగి నరసింహారావులకు ఎవరు పాడతారు? పిఠాపురం నాగేశ్వరరావుగారి తర్వాత పద్మనాభం, రాజబాబుగార్లకు ఎవరు పాడతారు? పీబీ శ్రీనివాస్‌గారి తర్వాత కాంతారావుగారు, హరనాథ్‌గారికి ఎవరు పాడతారు? అని అనుకునే దÔ¶ లో ‘నేను పాడతాను’ అంటూ ఆ మహానుభావుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు వచ్చారు. టాలీవుడ్‌లోని అందరికీ పాటలు పాడి శభాష్‌ అనేలా చేశారు. వాళ్లకే కాదు.. నా సినిమాలు ‘అర్ధరాత్రి స్వాతంత్య్రం, ఎర్రసైన్యం, కూలన్న, అన్నదాతా సుఖీభవ’ వంటి ఎన్నో చిత్రాలకు పాడారాయన. రామారావు, కృష్ణగార్లను ఎలా అనుకరిస్తూ పాడారో నన్ను కూడా అలానే అనుకరించి పాడి మెప్పించారాయన. నిజంగా నాలో ఆవహించాడా? అనేలా పాడారు. చాలామంది నేనే పాడాననుకునేవారు. కానీ ఆయనే పాడారు. నా చిత్రవిజయాలకు ఎంతో దోహదం చేశారాయన.

ఒక్క తెలుగు చిత్రసీమలోనే కాదు.. తమిళ చిత్రసీమలో టీఎం సౌందరరాజన్‌గారి తర్వాత ఎంజీఆర్, శివాజీ గణేశన్‌లకు ఎవరు పాడతారు? అంటే ‘నేను పాడతా’నన్నారు ఎస్పీబీ. కన్నడలో శ్రీనివాసరావుగారి తర్వాత రాజ్‌కుమార్‌గారికి ఎవరు పాడతారు? అంటే ‘నేను పాడతా’నన్నారు. దక్షిణాది శ్రోతలనే కాదు.. ఉత్తరాది శ్రోతలను కూడా మెప్పించారాయన. కిషోర్‌ కుమార్, మహమ్మద్‌ రఫీగార్లు పాడే పాటలని బాలూగారు పాడారు. లతా మంగేష్కర్, ఆశా భోంస్లేగార్లతో పోటాపోటీగా పాడి ఒప్పించి, మెప్పించి తెలుగుజాతి గౌరవాన్ని ఎగురవేసిన మహానుభావుడాయన. మహమ్మద్‌ రఫీగారి గొంతులో ఉన్న మార్దవం, మత్తు రెండూ బాలూగారి గొంతులో ఉన్నాయి. ఆయన గ్రేట్‌ సింగరే కాదు.. యాక్టర్‌ కూడా.. మంచి వ్యక్తి కూడా. ‘నారాయణమూర్తిగారు ప్రజల కోసం మంచి సినిమాలు తీస్తున్నారు.. ఆయన వద్ద డబ్బులు తీసుకోవద్దు’ అని బాలూగారు తన పీఏకి చెప్పడం ఆయన మానవీయ కోణం. కానీ నేను మాత్రం డబ్బులు తీసుకోవాలి సార్‌ అని దండం పెడితే  ‘ఎంతో కొంత మీకు నచ్చినంత ఇవ్వండి’ అని తీసుకున్న మహానుభావుడాయన. ‘35ఏళ్లుగా సినిమాలు తీస్తూ నిలబడ్డావు కీపిట్‌ అప్‌’ అంటూ నన్ను ప్రోత్సహించారు. 

నా ‘ఎర్రసైన్యం’ సినిమాకి ‘వందేమాతరం’ శ్రీనివాస్‌ సంగీతం అందించారు. అందులోని ‘పల్లెలెట్లా కదులుతున్నయంటే..’ పాటని నువ్వే పాడు, ‘ఊరు మనదిరా ఈ వాడ మనదిరా..’ పాటని బాలూగారితో పాడిద్దాం అని శ్రీనివాస్‌తో అన్నాను. రెండు పాటలూ ఆయనతోనే పాడిస్తే బాగుంటుందని అన్నాడు. ఎందుకంటే కొత్త సంగీత దర్శకుల చిత్రాల్లో బాలూగారు పాడితే అది ఓ క్రెడిట్‌ కదా. ‘పల్లెలెట్లా కదులుతున్నయంటే..’ పాటని బాలూగారు పాడుతున్నప్పుడు శ్రీనివాస్‌కి నచ్చినట్టు లేదు. అప్పుడు బాలూగారి వద్దకు నేను వెళ్లి ‘సార్‌.. అలా కాదు.. ఇలా పాడితే బాగుంటుందేమో?’ అన్నాను. మూడు నాలుగు సార్లు మార్చడంతో ఆయన నాపై కోప్పడ్డారు. ‘ఏంటి మూర్తి.. ఎన్నిసార్లు పాడాలి ఈ పాట’ అన్నారు. అప్పుడు నేను ఆయనతో ‘ఈ పాట మీరు పాడొద్దండి’ అన్నాను. అయినా కూడా ఆయన ఫీల్‌ కాలేదు. ‘మీరు సినిమా రచయిత.. డైరెక్టర్‌. మీరు ఎలా అంటే అలా?’ అని వెళ్లిపోతుంటే.. ‘ఊరు మనదిరా ఈ వాడ మనదిరా.. పాట మాత్రం మీరే పాడాలి సార్‌’ అంటే ‘తప్పకుండా’ అని పాడి ఊర్రూతలూగించారాయన. అదీ ఆయన గొప్పతనం.. గ్రేట్‌ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు. అలాంటి మహానుభావుడి మరణం తీరనిలోటు.. ముఖ్యంగా నాలాంటివాళ్లకి. ప్రపంచంలో పాట ఉన్నంతకాలం బాలూగారు ఉంటారు.. ఆయన పాటకి నా పాదాభివందనం.  

మరిన్ని వార్తలు