Organic Farming: 34 ఎకరాల భూమిలో ప్రకృతి సేద్యం.. ఆరోగ్యసిరిగా...!

4 Aug, 2022 14:10 IST|Sakshi

ఆరోగ్య సిరి

బాధ్యతల బరువు దించుకున్నాక సామాన్యుల కోసం ఏమైనా చేయగలనా అనుకుంది. సొంత లాభం కొంతమానుకుని నలుగురికి ఉపయోగపడాలని అనుకున్న ఆలోచన ఆమెను వ్యవసాయం దిశగా నడిపించింది. ప్రకృతి సేద్యంతో పదిమందికి చేయూతనిస్తూ తన జీవనాన్ని అర్థవంతంగా మార్చుకుంటోంది ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా రాజంపేట పరిధిలోని కొల్లావారిపల్లెకు చెందిన శవన హైమావతి. ఆరోగ్యసిరిగా అందరిచేత ప్రశంసలు అందుకుంటోంది.

కొడుకు, కూతురు విదేశాలలో స్థిరపడ్డారు. చిన్నకొడుకు చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు. భర్త మరణం తర్వాత ఒంటరి జీవితం ఆమెను వ్యవసాయం వైపు దృష్టి మళ్లించేలా చేసింది. వారసత్వంగా ఉన్న భూమిని తనే స్వయంగా సాగులోకి తీసుకురావాలనుకుంది. విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో తన ద్వారా తన చుట్టూ ఉన్నవారి ఆరోగ్యం బాగుపడాలని కోరుకుంది. పదిహేనేళ్లుగా ప్రకృతిసేద్యంతో పంటసిరులను కురిపిస్తోంది హైమావతి.

ప్రయోగాలతో సేద్యం...
హైమావతి కుటుంబానికి పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న భూమి నలభై ఎకరాలు ఉంది. అందులో మొదట్లో కొద్దిపాటి భూమిని స్వయంగా సేద్యం చేసుకుంటూ, ప్రకృతి సేద్యంపట్ల అవగాహన కల్పించుకుంటూ చిన్న చిన్న ప్రయోగాలు చేస్తూ వచ్చింది.

పదిహేనేళ్లుగా చేస్తున్న ఈ సేంద్రియ వ్యవసాయం ఇప్పుడు 34 ఎకరాలకు విస్తరించింది. సుభాష్‌ పాలేకర్‌ను స్ఫూర్తిగా తీసుకుని సమావేశాలకు హాజరవుతూ, వ్యవసాయానికి సంబంధించిన పుస్తకాలు చదువుతూ ప్రకృతిసేద్యంలో పూర్తి నైపుణ్యం సాధించింది. రసాయనాలు వాడకుండా ఎరువులు మొదలుకొని పురుగు మందుల వరకు అన్నీ సొంతంగా తయారు చేస్తుంది. 

స్వయంగా ఎరువుల తయారీ...
స్కూల్‌ చదువు దగ్గరే ఆగిపోయిన హైమావతి ఇప్పుడు సేంద్రియ వ్యవసాయంలో ఎంతోమందికి సలహాలు ఇచ్చేంతగా ఎదిగింది. ఎరువుల కోసం పాడి ఆవుల పెంపకాన్ని చేపట్టింది. పురుగులు, తెగుళ్లను నివారించేందుకు స్వయంగా మిశ్రమాలను తయారుచేస్తూ చుట్టుపక్కల గ్రామాల రైతులకు అవగాహన కలిగిస్తోంది. ఎండిన ఆకులతో, మగ్గబెట్టిన చెత్తాచెదారం, పండ్లు, కూరగాయల వ్యర్థాలతో ఎరువులు, యూరియా వంటివి తయారు చేస్తూ రసాయనాల వాడకం లేకుండానే అధిక దిగుబడులు సాధిస్తోంది.

నామమాత్రపు ధర...
మామిడి, చెరకు, నిమ్మ, జామ, సపోట, నేరేడు, ఉసిరి, పనస, చీనీ.. పండ్ల తోటల సాగుతోపాటు అన్ని రకాల కూరగాయలు పండిస్తున్నారు. వీటిని తన చుట్టుపక్కల వారికి ఇవ్వడంతో పాటు మిగతా వారికి నామమాత్రపు ధరలతో అందిస్తున్నారు. అందరికీ ఇవ్వగా మిగిలిన ఉత్పత్తులను రాజంపేట పాత బస్‌స్టాండు వద్ద షాపును ఏర్పాటు చేసి, పేదలకు ఉచితంగా అందజేయడంతో పాటు మిగతా ఉత్పత్తులను తక్కువ ధరకు అందిస్తోంది.

అందరి ఆరోగ్యం
ఈ  కంప్యూటర్‌ యుగంలో ఎక్కడ చూసినా కల్తీ సరుకులే. వీటితో ఎంతోమంది అనారోగ్యం బారిన పడటం చూస్తున్నాను. రసాయనాలు లేని సేంద్రియ వ్యవసాయంతో పండించిన ఉత్పత్తులను అందరూ ప్రోత్సహించాలి. అందుకే ఈ పనిని ఎంచుకున్నాను. ఎటువంటి లాభాలూ ఆశించకుండా నా చుట్టూ ఉన్నవారికి సేంద్రియ ఆహారం అందేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను.  – శవన హైమావతి 

పురస్కారాల పంట...
ప్రకృతి సేద్యంలో రాణిస్తున్న హైమావతిని ప్రతి యేటా అవార్డులు వరిస్తున్నాయి. ఈ ఏడాది మహిళా దినోత్సవ సందర్భంగా మాతృభూమి ఫౌండేషన్‌  నుంచి తెలంగాణ గవర్నర్‌ తమిళసై చేతుల మీదుగా హైమావతికి అవార్డును ప్రదానం చేశారు. ప్రకృతి వ్యవసాయంలో ప్రతిది క్షుణ్ణంగా తెలుసుకుంటూ నేడు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్న హైమావతికి అభినందనలు చెబుదామా!- – బసిరెడ్డి వెంకట నాగిరెడ్డి, సాక్షి, అన్నమయ్యజిల్లా
చదవండి: Sagubadi: మూడు చక్రాల బుల్లెట్‌ బండి! లీటర్‌ డీజిల్‌తో ఎకరం దున్నుకోవచ్చు!

మరిన్ని వార్తలు