Terrace Garde: చక్కనింట.. మిద్దె పంట .. ఆదాయం.. ఆరోగ్యం

14 Jul, 2022 15:19 IST|Sakshi

ఆమె అందరిలా కాలక్షేపం చేయలేదు. తన అభిరుచిని ఆచరణలో పెట్టింది. రోజుకు రెండు గంటల పాటు శ్రమించి తక్కువ స్థలంలోనే మినీ క్షేత్రాన్ని ఏర్పాటు చేసింది. ఆ క్షేత్రానికి తన ఇంటి మేడతో పాటు ఆవరణను ఎంచుకుంది. వివిధ రకాల పాదు జాతులతో పాటు, కూరగాయలు, ఆకు కూరలు,  మినీ ప్లాంట్,  ఫల వృక్షాలు విజయవంతంగా సాగు చేసి ఔరా అని పించుకుంటున్నారు.. పీఎంపాలేనికి చెందిన రాధారాణి అగర్వాల్‌. - పీఎంపాలెం/విశాఖపట్నం

రసాయనం...కాదు సేంద్రియం 
స్థానిక హౌసింగ్‌ బోర్డు కాలనీలోని రాధారాణి ఇంటి మేడతో పాటు పెరట్లో రసాయన ఎరువుల జోలికి వెళ్లకుండా కూరగాయలు సాగుచేసి తమ కుటుంబ అవసరాలకు సరిపడా దిగుబడులు సాధిస్తున్నారు. చుట్టు పక్కల వారికి, బంధువులకు మిగులు కూరగాయలు పంచి వారి ఆదరాభిమానాలు చూరగొంటున్నారు. 

కూరలు...మనసు తీరా... 
టమాటా,బీరకాయ,నేతి బీరకాయ, దొండకాయ, దోసకాయ, పొట్లకాయ, ఆలీవ్‌ బీన్స్, క్యాబేజీ, నీలం క్యాబేజీ, చిలగడ, కంద మొదలైన దుంప జాతులు సాగు చేస్తున్నారు. మంచిదిగుబడులు సాధిస్తున్నారు. 

కనుల ‘పండు’వ.. 
జామ, బొప్పాయి,దానిమ్మ, స్టార్‌ ఫ్రూట్, డ్రాగాన్‌ ఫ్రూట్, అంజీరా, అరటి,స్వీట్‌ లెమన్,సీతాఫలం, సపోటా వంటి పండ్లజాతి మొక్కలు ఆహ్లాదంగా కనిపిస్తాయి.

 

ఆకు కూరలు 
మెంతికూర, తోట కూర,పాలకూర, బచ్చలి కూర, గోంగూర, పుదీనా, కొత్తి మీర , కరివేపాకు సాగు చేస్తున్నారు.  

పూల గుబాలింపు 
అలాగే సువాసన వెదజల్లే మల్లె ,సన్నజాజి, చామంతి, విరజాజి, మాలతీ, గులాబీ తదితర పూల మొక్కలు కూడా పెంచుతున్నారు. స్థలం తక్కువగా ఉండడంతో చిన్న చిన్న కుండీల్లోనే ఇన్ని రకాలు సాగు చేసి ఔరా అనిపించుకుంటున్నారు.  వీటి పెంపకం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని.. ఆశించిన దాని కంటే ఎక్కువ దిగుబడులు సాధిస్తున్నామని చెబుతున్నారు. ఎలాంటి రసాయనాలు వాడమన్నారు. ఖర్చు తక్కువని ఊహించని ఫలితం ఉంటుందని చెప్పారు. 

ఆదాయం..ఆరోగ్యం 
ప్రస్తుత పరిస్థితుల్లో మధ్య తరగతి వారు రోజు వారీ కూరగాయల ఖర్చుల నుంచి బయటపడాలంటే ఉన్న పెరడు.. డాబాలపై కూరగాయలు సాగు చేయాలి. దీని వల్ల తాజా కూరగాయాలు లభించడంతో పాటు డబ్బులు మిగులుతాయి. తాజా కూరగాయాలతో చేసే ఆహారం తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. చిన్నపాటి శ్రమ కృషి ఉంటే పెరటి కూరగాయల పెంపకం అంత కష్టం ఏమీ కాదు. అవసరాలకు మించి పండిన కూరగాయలు, ఆకుకూరలు స్నేహితులకు. బంధువులకు ఇస్తాం. ఇందులో మంచి సంతృప్తి ఉంది. 
– రాధారాణి అగర్వాల్, పీఎంపాలెం.

మరిన్ని వార్తలు