International Tea Day: అమ్మా... టీ పెట్టనా...

21 May, 2021 06:37 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఉదయం టీ, సాయంత్రం టీ, నాన్న స్నేహితులు వస్తే టీ, బంధువులు వస్తే టీ, రంగు, రుచి, చిక్కదనం టీలో ఉంటే కుటుంబ బంధాలలో కూడా చిక్కదనం వస్తుంది. టీ సమయాలు కుటుంబ సమయాలే. టీ అంగళ్లు మేలిమి మీటింగ్‌ పాయింట్లే. ‘నేడు అంతర్జాతీయ టీ దినోత్సవం’. ఏమిచ్చి టీ రుణం తీర్చుకోగలం?

కాఫీకి కొన్ని మర్యాదలుంటాయి. ఫిల్టర్‌ కాఫీ అనీ ఇన్‌స్టంట్‌ కాఫీ అని ఫలానా కాఫీ గింజలనీ ఇంకేదో ఇంకేదో అనీ. టీకి ఇవన్నీ ఉండవు. కొన్ని పాలు కొన్ని నీళ్లు రెండు స్పూన్ల టీ పౌడర్, మూడు చెంచాల చక్కెర... టీ రెడీ. ‘ఏ కులమూ నీదంటే ప్రతి కులమూ నాదండీ’ అని పాడేది టీ ఒక్కటే. మహరాజులూ తాగుతారు. నిరుపేదా తాగుతాడు. ఇంట్లో అమ్మ ఏదైనా చెప్పాలన్నా, చెప్పుకోవాలన్నా కాసింత టీ పడేసి వాటిని కప్పుల్లో పోసుకొని వస్తే వినడానికి అందరూ రెడీ.

కూల్‌డ్రింకులు, స్వీట్‌ హాట్‌ రెడీగా ఏ మధ్యతరగతి ఇంట్లో ఉంటుంది చెప్పండి? కాని టీ పౌడర్‌ గ్యారంటీగా ఉంటుంది. సమయానికి పాలు లేకపోతే పొరుగింట్లో దొరకవా ఏంటి? ఇంటికి స్నేహితులొచ్చినా, బంధువులొచ్చినా క్షణాల్లో టీ రెడీ. ఇంటి మర్యాదను కాపాడే పానీయం అది. ఇంటి బడ్జెట్‌ను కాపాడే పానీయం కూడా.

ఉదయాన్నే లేచి నాన్న బయటకు వెళ్లి ఓ రౌండ్‌ టీ తాగి వచ్చినా రెండిడ్లీ అమ్మ చేసినవి తిన్నాక అమ్మ పెట్టే టీ తాగుతూ ఆఫీసుకో పనికో రెడీ అవడం బాగుంటుంది. ఆ టీ తాగే సమయం లో అమ్మ ఏ బడ్జెట్‌ ప్రతిపాదన చేసినా ఓకే అయిపోతుంది. పిల్లలను నిద్ర లేపడానికి చాలా ఇళ్లల్లో టీ ఒక ఆయుధం. బెడ్‌ టీ తాగే ఇళ్లు కొన్ని. ‘బ్రెష్‌ టీ’ తాగే ఇళ్లు కొన్ని. పరీక్షల వేళ పిల్లలకు ఫ్లాస్కు లో టీ పోసి సిద్ధం చేయడం సగటు తల్లిదండ్రుల కనీస బాధ్యత. ‘ఇతర పానీయాలు’ తాగే స్నేహితులకు దూరం ఉండమని చెప్పే తల్లిదండ్రులు టీ తాగే స్నేహితులతో తిరిగితే మాత్రం సంతోషిస్తారు. టీ బంకు ప్రపంచ జ్ఞానాన్ని కూడా ప్రోత్సహిస్తారు. అక్క పెళ్లిచూపులు, వదినకు అన్నయ్యతో పేచీలు, పక్కింటి వారితో పార్కింగ్‌ ఇష్యూ, చెల్లెలికి సంగీతం టీచరు ఫైనలైజేషను... ఏ పని అయినా టీతోనే కదా ముగుస్తుంది. ఇంటికి ప్లంబర్‌ వచ్చినా, ఎలక్ట్రీషియన్‌ వచ్చినా, పెయింటర్‌ వచ్చినా అమ్మ వారికో టీ చేసిచ్చి పని చక్కగా చేయిస్తుంది కదా.

ఒకప్పుడు టీతో పాటు సాసర్‌ ఇవ్వడం మర్యాదగా ఉండేది. ఇప్పుడు కప్పు సాసర్‌ను వదిలించుకుంది. ఒకప్పుడు టీ నేరుగా తెచ్చిపెట్టడం మర్యాదగా ఉండేది. ఇప్పుడు ‘మీకు చక్కర వేయాలా వద్దా’ అని ప్రత్యేకంగా అడగాల్సి వస్తోంది. కొందరు యాలకుల టీ అడుగుతారు. కొందరు అల్లం దంచి కొట్టమంటారు. గ్రీన్‌ టీ తాగే ఆరోగ్యధీరులు కొందరు. లెమన్‌ టీ కొందరి ప్రిఫరెన్స్‌. ఎన్ని పేర్లు పెట్టినా నలుగురు కూడితే స్టౌ మీదకు ఎక్కాల్సిన పానీయం టీనే కదా.

ఇవాళ అంతర్జాతీయ టీ దినోత్సవం. ‘అమ్మా... టీ పెట్టవా’ అని సంవత్సరమంతా అడిగి ఆమె చేతి మీద తాగడం కాదు. ‘అమ్మా... టీ పెట్టనా’ అని ఇవాళ టీ పెట్టి ఆమెకు కప్పు ఇచ్చి పక్కన కూచోండి. కొలత కావాలా? నలుగురు మనుషులకు టీ చేయాలంటే మూడు కప్పుల పాలు, ఒకటిన్నర కప్పుల నీళ్లు, మూడు ఫుల్‌ చెంచాల టీ పొడి, మూడు ఫుల్‌ చెంచాల చక్కెర. అంతే. టీ రెడీ.
ఎంజాయ్‌ టీ.

– సాక్షి ఫ్యామిలీ

మరిన్ని వార్తలు