టీ టేస్ట్‌ మారిపోతుందా? బాక్టీరియా వల్లే ఇదంతా..అలా వేడి చేయడం వల్లే

30 Oct, 2023 16:45 IST|Sakshi

పొద్దున లేవగానే ఓ కప్పు గరం చాయ్‌ గొంతు దిగందే పనిలో దిగరు చాలామంది. అది గ్రీన్‌ టీ అయినా లెమన్‌ టీ అయినా సరే ఏదో ఒక టీ గొంతులో పడాల్సిందే. పనిలో అలసిపోయినా, కాస్త సేదదీరాలాన్న ‘‘టీ తాగొద్దాం పద’’ అంటారు స్నేహితులు. ఇలా టీ అనేది దినచర్యలో భాగమైపోయింది. 

టీని ఫ్రెష్‌గా కాచి తాగితేనే మంచిది. పైగా ఫ్రెష్‌ టీ ఫ్లేవరు, రుచే వేరు. చాలామంది ఒకేసారి టీ పెట్టేసుకుని ఫాస్కులో పోసుకుని ఆరారగా తాగుతుంటారు. ఇంకొంతమంది టీ కాచి దాన్ని అలాగే ఉంచి వేడి చేసుకుని తాగుతుంటారు. కానీ అలా టీని మళ్లీ మళ్లీ వేడి చేసుకుని తాగటం మంచిది కాదట.. నాలుగు గంటల కంటే ఎక్కువసేపు ఉంచిన తర్వాత టీని మళ్లీ వేడి చేయడం ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని చెబుతున్నారు నిపుణులు.

కాచి అలా ఉంచేసిన టీలో ఫంగస్‌ ఏర్పడుతుంది. బ్యాక్టీరియా కూడా డెవలప్‌ అవుతుంది. దీంతో రుచి కూడా మారిపోతుంది. కానీ టేస్ట్‌ మారింది ఏంటో అనుకుంటాం గానీ కారణం మాత్రం ఇదే. కాబట్టి టీని వేడి చేసి తాగటం మంచిది కాదు. అదే హెర్బల్‌ టీని అయితే మరోసారి వేడి చేసి తాగకూడదు. అలా వేడి చే చడం వల్ల దాంట్లో ఉండే పోషకాలు, ఖనిజాలు నశించిపోతాయి. అది తాగినా తాగకపోయినా ఒక్కటే.

గ్రీన్‌ టీ అయితే వేడి చేసి తాగటం ఏమాత్రం మంచిది కాదు. టీని ఎక్కువసేపు నిల్వ ఉంచితే టానిన్‌ అధికంగా విడుదల అవుతుంది. ఇది టీని చేదుగా మార్చేస్తుంది. దీంతో అలా వేడి చేసిన టీ తాగితే కడుపు నొప్పి వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాదు అతిసారానికి దాని తీయవచ్చు. కడుపు ఉబ్బరం, వికారం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. అంతేకాదు ఇలా టీని మళ్లీ మళ్లీ వేడి చేసి తాగితే మనకు తెలియకుండానే అనారోగ్య సమస్యలు వస్తాయి.

కాబట్టి టీ తాగాలనుకుంటే ఎప్పటికప్పుడు తయారు చేసుకుని తాగితే మంచిది. రుచికి రుచి ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యమూ బాగుంటుంది. ఆరోగ్యం కోసమో ఉల్లాసం కోసమో టీ తాగాలనుకున్నప్పుడు మరిగి పోయి ఉన్న టీ తాగడం వల్ల ఉత్సాహం మాటెలా ఉన్నా, ఉన్న ఆరోగ్యం దెబ్బ తినడం ఖాయం. అటువంటి చెడు ఫలితాలు పడకుండా ఉండాలంటే ఫ్రెష్‌ టీ తాగడం మేలు.

మరిన్ని వార్తలు