రోజూ ఒక కప్పు 'టీ' తాగితే.. మధుమేహం ఉండదు! పరిశోధనల్లో షాకింగ్‌ విషయాలు

9 Nov, 2023 11:52 IST|Sakshi

ప్రస్తుత రోజుల్లో మధుమేహం చాలా సర్వసాధారణమైపోయింది. ప్రతి ఇంటిలోనూ ఒకరో ఇద్దరో డయాబెటిస్‌ పేషెంట్లు ఉంటున్నారు. దీర్ఘకాలిక వ్యాధే తప్ప తగ్గేది కాదు. షుగర్‌కి సంబంధించినవి దూరంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకుని అదుపులో పెట్టుకోవడం తప్ప మరో మార్గం లేదు. అలాంటి డయాబెటిస్‌ వ్యాధి ఓ కప్పు టీతో క్యూరో అవుతోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఆయా పరిశోధనల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కప్పు టీతో ఎలా సాధ్యం? అని ఆశ్చర్యపోవడమే గాక ఒక్కసారిగా ఈ విషయం చాలా హాట్‌టాపిక్‌గా మారిపోయింది. ఇంతకీ ఆ టీ ఏంటి? ఎలా గ్లూకోజ్‌ స్థాయిలను తగ్గిస్తుంది తెలుసుకుందాం!.

చైనాలో ప్రత్యేకంగా తయారు చేసే..పులియబెట్టిన టీ మధుమేహాన్ని అదుపులో ఉంచుతోందని చైనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది ఇతర టీల అన్నింటిలో విభిన్నంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఒక్కసారిగా శాస్త్రవేత్తల్లో ఈ అంశం ఓ నూతన ఉత్తేజాన్ని ఇచ్చి పలు అధ్యయనాలకు పురిగొల్పింది. ఇది ఎంత వరకు నిజం? అనే దిశగా ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌ విశ్వవిద్యాలయం, చైనాల సౌత్‌ ఈస్ట్‌ యూనివర్సిటీ పరిశోధకులు కలిసి సంయుక్తంగా  పరిశోధనలు నిర్వహించేందుకు దారితీసింది. వారు నిర్వహించిన అధ్యయనంలో పలు షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందుకోసం చైనాలో వివిధ ప్రాంతాల్లో నివశిస్తున్న దాదాపు రెండు వేల మందిపై పరిశోధనలు నిర్వహించారు.

వారిలో డయాబెటిస్‌ లేనివారు, డయాబెటిస్‌ ఉన్న వ్యక్తుల ఉన్నారు. ఐతే వారి ఆహారపు అలవాట్లను తెలుసుకుని మరీ ఈ పరిశోధనలు నిర్వహించారు. ఈ టీ తాగిని వారి యూరిన్‌లో గ్యూకోజ్‌ స్థాయిలు పరీక్షించగా తక్కువగా ఉండటమే కాకుండా కొందరికి ఫీల్టర్‌ అయ్యి యూరిన్‌ నుంచి గ్లూకోజ్‌ వెళ్లడం లేదని గమనించారు. నిజానికి టీ తాగితే మూత్రంలో గ్లూకోజ్‌ స్థాయిలు పెరుగుతాయి. కానీ ఈ డార్క్‌టీ మాత్రం అందుకు విభిన్నంగా ఉంది. ఈ టీని సేవించని వారితో పోలిస్తే ఆయా వ్యక్తుల్లో ప్రీ డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం సుమారు 15% తగ్గగా, టైప్‌2 మధుమేహం వచ్చే అవకాశం దాదాపు 28% తగ్గిందన్నారు.

ఈ మేరకు అడిలైడ్‌ యూనివర్సిటీ పరిశోధకుడు డాక్టర్‌ టోంగ్జి మాట్లాడుతూ..ఈ టీపై నిర్వహించిన పరిశోధనలు ఆశ్చర్యకరమైన రీతీలో ఫలితాలిచ్చాయన్నారు. ఈ టీ రక్తంలోని చక్కెర స్థాయిలను మెరుగ్గా నియంత్రించిందన్నారు. బహుశ ఆ టీ తయరీలో ఉపయోగించే కిణ్వన ప్రక్రియ ఇంత మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఇవ్వడానికి ప్రధాన కారణం అయ్యి ఉండొచ్చన్నారు. చైనాలో ఉన్న ఆరు ప్రధాన రకాల టీల్లో ఈ డార్క్‌ టీ చాలా ప్రత్యేకమైనదని అన్నారు. ఇందులో ప్రధానంగా సూక్ష్మజీవుల కిణ్వన ప్రక్రియ ఉంటుంది. అదే ఆరోగ్యానికి మంచి ఔషధంగా పనిచేస్తుందని చెప్పారు.

ఈ టీలో ఉన్న శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఇన్సూలిన్‌ తీరును మెరుగుపరిచి గట్‌ మైక్రోబయోమ్‌ను ప్రోత్సహిస్తుందన్నారు. శరీరంలో సోడియం, గ్లూకోజ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ప్రోటీన్‌(ఎస్‌జీఎల్‌టీ)-2 ఇన్హిబిటర్స్‌ ప్రభావాన్ని తగ్గిస్తుంది. తత్ఫలితంగా మూత్రపిండాలు మరింతగా గ్లూకోజ్‌ను విసర్జించేలా చేయడంతో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే గుండె, మూత్రపిండాల తీరును కూడా మెరుగ్గా ఉంచుతుంది ఈ డార్క్‌ టీ. మన పాత కాల సంప్రదాయ పానీయమైన డార్క్‌​ టీ గొప్పతనాన్ని ఈ అధ్యయనాలు వెల్లడించాయన్నారు. ప్రజలు ప్రతిరోజు డార్క్‌ టీ తీసుకోవడం వల్ల తమ ఆరోగ్యాన్ని సులభంగా మెరుగుపరుచుకోవడమే గాక శరీరంలో చక్కెర  స్థాయిలను నియంత్రించుకోగలుగుతారని నమ్మకంగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

(చదవండి: ఆపరేషన్‌ బ్యూటీ! అందం కోసం తీసుకునే ఇంజక్షన్‌లు మంచివేనా!)

మరిన్ని వార్తలు