మాటల కశ్మీరం.. సమానియా

20 Aug, 2021 00:51 IST|Sakshi

సరిహద్దు సమస్యలు, అంతర్గత అల్లరు,్ల మరోపక్క ఉగ్రమూకల దాడులతో అట్టుడికే కశ్మీర్‌... ఆర్టికల్‌ 370 రద్దు చేసిన తరువాత మిగతా రాష్ట్రాల్లాగే పరిస్థితులు క్రమంగా మారుతుండడంతో..అక్కడి యువత సరికొత్త ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఇటువంటి అవకాశాన్ని తన తెలివితేటలు, నైపుణ్యంతో అందుకున్న ఆర్‌జే సమానియా.. ఉత్తర కశ్మీర్‌లో తొలి మహిళా ఆర్‌జేగా నిలిచింది.  

19 ఏళ్ల సమానియా బారముల్ల ఓల్డ్‌ టౌన్‌కు చెందిన అమ్మాయి. సమానియా భట్‌ రోజూ తండ్రి పక్కన కూర్చుని ప్రపంచవ్యాప్తంగా జరిగే విషయాలను ఆయనతో చర్చిస్తూ అప్‌డేటెడ్‌గా ఉండేది. ఉదయాన్నే వచ్చే వార్తాపత్రికలను చదువుతూ, టీవీల్లో వచ్చే వార్తలను శ్రద్ధగా వినడం ఆమెకు ఒక అలవాటుగా ఉండేది. ఆ అలవాటే నేడు సమానియాను ఉత్తర కశ్మీర్‌లో తొలి రేడీయో జాకీగా మార్చింది. తన సుమధుర వాక్‌ చాతుర్యంతో శ్రోతల్ని ఆకట్టుకొంటూ నేటి యువతరానికి ప్రేరణగా నిలుస్తోంది.

మాస్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ వీడియో ప్రొడక్షన్‌లో డిగ్రీ చదివింది. జర్నలిస్టు కావాలన్న కలతో డిగ్రీలో మాస్‌ కమ్యునికేషన్‌ పాఠాలు చాలా శ్రద్ధగా నేర్చుకునేది. డిగ్రీ సెకండ్‌ ఇయర్‌లో ఉండగానే స్థానిక న్యూస్‌ పేపర్‌ లలో కూడా పనిచేసేది. ఆ ఆసక్తితోనే డిగ్రీ పూర్తయ్యాక జర్నలిజంలో మాస్టర్స్‌ డిగ్రీ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలో పీజీ ఎంట్రన్స్‌ కోసం సన్నద్ధమవుతూ స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసింది. స్కాలర్‌షిప్‌ మంజూరు అయినప్పటికీ, కరోనా సెకండ్‌ వేవ్‌ వల్ల చేతికి రాకుండానే స్కాలర్‌షిప్‌ వెనక్కి వెళ్లింది. ఇది సమానియాకు కాస్త బాధ కలిగించినప్పటికీ నిరుత్సాహ పడకుండా ముందుకు సాగింది.

ఆర్‌జేగా...
స్కాలర్‌షిప్‌ రాలేదన్న బాధలో ఉన్న సమానియాకు మజ్‌బగ్‌లో ఉన్న కశ్మీర్‌ రేడియో ఛినార్‌–ఎఫ్‌ఎమ్‌:90.4 రేడియో జాకీలకోసం దరఖాస్తుల ఆహ్వాన ప్రకటన కనిపించింది. అది చూసి వెంటనే రేడియో జాకీ (ఆర్‌జే) పోస్టుకు దరఖాస్తు చేసుకుంది. ఈ పోస్టుకోసం కశ్మీర్‌లోని వివిధ జిల్లాల నుంచి 250 మంది పోటీపడ్డారు. పోటీ ఎక్కువగా ఉండడంతో నాలుగైదు రౌండ్ల ఇంటర్వ్యూ తర్వాత సమానియా ఆర్‌జేగా సెలెక్ట్‌ అయ్యింది. కాగా రేడియో స్టేషన్‌ నలుగుర్ని మాత్రమే ఎంపిక చేయగా.. సమానియా మాత్రమే మహిళా ఆర్‌జేగా సెలెక్ట్‌ అయ్యింది.

ఆకట్టుకునే వాక్‌చాతుర్యంతో శ్రోతలలో పాజిటివ్‌ ఎనర్జీని నింపుతూ తనవైపు తిప్పుకుంటుంది. ‘హల్లా బోల్‌ విత్‌ ఆర్‌జే సమానియా’ షో చేస్తూ శోతల అభిమానం చూరగొనడం, ఈ షోకు మంచి స్పందన లభించడంతో తొలుత మ«ధ్యాహ్నం 12గంటల నుంచి 3 గంటల వరకు ఉన్న షో సమయాన్ని, మ«ధ్యాహ్నం 3 గంటల నుంచి ఆరుగంటల వరకు ప్రసారం చేస్తున్నారు. ప్రేర ణాత్మక మాటలు చెప్పడమేగాక ఆయా రంగాల్లో ఉన్నతస్థాయికి ఎదిగిన యువతీ యువకులను అతిథులుగా పిలిచి క్రియేటివ్‌గా ఇంటర్వ్యూలు కూడా చేస్తోంది. ఆత్మీయ స్వరం, సానుకూల మాటలతో సమానియా రేడియో జాకీగా దూసుకుపోతోంది.   

‘‘నేను ఆర్‌జే అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. ప్రింట్‌ మీడియాలో పనిచేస్తున్నప్పుడు టీచర్లు, స్నేహితులు ‘నువ్వు రేడియో జర్నలిజానికి బాగా పనికొస్తావు’ అని ప్రోత్సహించేవారు. అయితే నేను ఎప్పుడు ఆ దిశగా ప్రయత్నించలేదు. కానీ రేడియో స్టేషన్‌ చినార్‌ ప్రకటన నాలో ఆశలు రేపింది. అందరితో పోటీపడి ఆర్‌జేగా సెలెక్ట్‌ అయ్యాను. నైపుణ్యం కలిగిన కశ్మీర్‌ యువతను మేల్కొల్పడమే మా ముఖ్య ఉద్దేశ్యం. యువతలోని శక్తిసామర్థ్యాలను తట్టిలేపి, వారిలోని ప్రతిభా పాటవాలను ప్రపంచానికి చూపించడమే’’ అని సమానియా చెప్పింది.
 

మరిన్ని వార్తలు