-

స్కాట్లాండ్‌ ఓకే చెప్పింది

26 Nov, 2020 05:36 IST|Sakshi
ఉచిత ప్యాడ్స్‌ చట్టం కోసం ప్రదర్శన జరుపుతున్న మోనికా లెనన్‌ (ఫైల్‌ ఫొటో) ; ‘పీరియడ్‌ పావర్టీ’ ఉద్యమకారిణి, ఎంపీ మోనికా లెనన్‌.

పీరియడ్‌ పావర్టీ బిల్లు

ప్రపంచంలోనే తొలిసారి ఇలాంటి ఒక చట్టం తెచ్చిన ఘనతను స్కాట్లాండ్‌ దక్కించుకుంది. బిల్లు చట్టం కాగానే దేశవ్యాప్తంగా మహిళలకు శానిటరీ ప్యాడ్స్‌ ఉచితంగా లభిస్తాయి.

ఉచిత విద్యకు, ఉచిత ఆరోగ్య భద్రతకు బిల్లు తెచ్చినంత సులభంగా ఉండదు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్‌ను పంపిణీ చేసే బిల్లుకు ఆమోదం లభించడం. ‘అవసరమా?’ అనే ప్రశ్న మొదటే పురుషుల నుంచి వస్తుంది. ఆ తర్వాత ప్రతిపక్షం నుంచి వస్తుంది. తిండికి లేదా? పెడదాం. చదువుకోవాలని ఉందా? చదివిద్దాం. అనారోగ్యం వస్తే వైద్య ఖర్చులకు డబ్బుల్లేవా? ఉచితంగా వైద్యం చేయిద్దాం. కానీ ఇదేంటి! శానిటరీ న్యాప్‌కిన్‌లను, టాంపన్‌లను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడం.. అని రెండేళ్లుగా ‘పీరియడ్‌ ప్రాడక్ట్స్‌ (ఫ్రీ ప్రొవిజన్‌) చట్టం’ బిల్లుకు స్కాట్లాండ్‌ పార్లమెంటులో విపక్ష సభ్యులు అభ్యంతరం చెబుతూ వస్తున్నారు.

అనుకూలంగా ఓటేయకుండా బిల్లును ఆపుతున్నారు. ఎట్టకేలకు.. ఏడాదికి కనీసం 86 కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని ప్రభుత్వంపై మోపే ‘పీరియడ్‌ పావర్టీ బిల్లు’కు మంగళవారం నాడు ఏకగ్రీవ ఆమోదం లభించింది. దాంతో ప్రపంచంలోనే తొలిసారి ఇలాంటి ఒక చట్టం తెచ్చిన ఘనతను స్కాట్లాండ్‌ దక్కించుకుంది. అన్ని పేదరికాల మాదిరిగానే ప్యాడ్స్‌ని కొనలేని పేదరికం కూడా ఉంటుందని అంటూ ఈ బిల్లుకు ఊపిరిపోసి, బిల్లు సాధనకు ఉద్యమరూపం తెచ్చి, సభ ఆమోదం పొందగలిగేవరకు ఆవిశ్రాంతంగా పోరాటం జరిపిన మోనికా లెనన్‌ (39) ఇప్పుడు ఆ దేశంలోని మహిళల మన్ననలను పొందుతున్నారు. బిల్లు ముసాయిదాలో పలుమార్లు కనిపించే ‘పీరియడ్‌ పావర్టీ’ అనే మాటను కూడా తనే సృష్టించిన మోనికా 2016 నుంచీ స్కాటిష్‌ లేబర్‌ పార్టీ ఎంపీగా ఉన్నారు.

ఆమె స్త్రీవాది, శాకాహారి. బిల్లు చట్టం రూపం ధరించగానే దేశవ్యాప్తంగా కమ్యూనిటీ సెంటర్‌లు, విద్యాసంస్థలు, యూత్‌ క్లబ్బులు, ఫార్మసీ దుకాణాలన్నింటిలోనూ మహిళలకు శానిటరీ న్యాప్‌కిన్స్, టాంపన్‌లు ఉచితంగా అందుబాటులోకి వస్తాయి. ‘‘ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయడాన్ని గర్వంగా భావిస్తున్నాను’’ అని స్కాట్లాండ్‌ మహిళా ప్రధాని (ఫస్ట్‌ మినిస్టర్‌ అంటారు) నికోలా స్టురియన్‌ ట్వీట్‌ చేస్తూ, ‘మహిళలకు, బాలికలకు అవసరమైన ఒక ముఖ్యమైన ప్రభుత్వ విధానంగా’ ఈ చట్టాన్ని అభివర్ణించారు. అరకోటికి పైగా జనాభా వున్న స్కాట్లాండ్‌ యు.కె. కిందికి వస్తుంది. ‘ప్లాన్‌ ఇంటర్నేషనల్‌ యుకె’ అనే సంస్థ 2017 లో జరిపిన ఒక సర్వేలో యు.కె.లోని ప్రతి 10 మంది బాలికల్లో ఒకరు ప్యాడ్స్‌ కొనే స్థితిలో లేనివారే. అంతేకాదు, యు.కె.లో 14–21 ఏళ్ల మధ్య వయసులో ఉన్న బాలికల్లో సగం మంది ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్యాడ్స్‌ కొనలేకపోతున్నవారే.
 

మరిన్ని వార్తలు