మళ్లీ అధికారమిస్తే ఉచిత విద్య

29 Oct, 2023 05:11 IST|Sakshi

ఛత్తీస్‌గఢ్‌లో రాహుల్‌ గాంధీ హామీ

రాయ్‌పూర్‌: కాంగ్రెస్‌కు మరోసారి అధికారమిస్తే పాఠశాల, కళాశాల విద్యను ఉచితంగా అందజేస్తామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రకటించారు. తునికాకు సేకరించే వారికి ఏడాదికి రూ.4 వేలు అందజేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. గిరిజన ప్రాబల్య బస్తర్‌ ప్రాంతంలోని కాంకేర్‌ జిల్లా భానుప్రతాప్‌పూర్‌ నియోజకవర్గంలో శనివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ‘కాంగ్రెస్‌ పార్టీని మళ్లీ గెలిపిస్తే మీ కోసం మేం పెద్ద నిర్ణయం తీసుకుంటాం.

కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉచిత విద్యను అందిస్తాం. ఒక్క పైసా కూడా చెల్లించనవసరం లేకుండా చదివిస్తాం’ అని రాహుల్‌ చెప్పారు. తునికాకులు సేకరించే వారికి  ఏడాదికి రూ.4 వేలు అందజేస్తామన్నారు.  కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేపడుతుందని స్పష్టం చేశారు. ఎప్పుడూ ఓబీసీల (ఇతర వెనుకబడిన కులాలు) గురించి మాట్లాడే ప్రధాని మోదీ, కులగణన అంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.

బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఇద్దరు, ముగ్గురు పారిశ్రామిక వేత్తల లబ్ధి కోసమే పనిచేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ రైతులు, దళితులు, కారి్మకులు, ఆదివాసీల కోసం పనిచేస్తుందని హామీ ఇచ్చారు.  ఆదివాసీలను బీజేపీ వనవాసీలుగా పేర్కొనడంపై  అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ఆదివాసీల చరిత్ర, భాష, సంస్కృతిపై జరుగుతున్న దాడిగా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు