-

గురు వాక్యస్య... !!!

27 Nov, 2023 06:31 IST|Sakshi

వాగ్గేయకార వైభవం

వాగ్గేయకారులలో గమనించవలసిన ఒక గొప్ప లక్షణం– వారిలోని గురుభక్తిని. అది లేకుండా సనాతన ధర్మంలో ఏ వ్యక్తీ పరిఢవిల్లలేదు. పుస్తకజ్ఞానం ఎంత ఉన్నా గురుముఖతః నేర్చుకున్నదేదో అది మాత్రమే అభ్యున్నతికి కారణమవుతుంది. ‘శ్రద్థ’ అని మనకు ఒక మాట ఉంది. శ్రద్ధావాన్‌ లభతే జ్ఞానం– అంటారు గీతాచార్యులు. ఆ శ్రద్ధ ఎవరికి ఉన్నదో వారికి మాత్రమే జ్ఞానం కలుగుతుంది–అని. శ్రద్ధ అన్న మాటకు శంకరభగవత్పాదులు వ్యాఖ్యానం చేస్తూ.. ‘‘శాస్త్రస్య గురువాక్యస్య సత్య బుద్ధ్యవధారణమ్‌’ సాశ్రద్ధా కథితా సద్భిర్యాయా వస్తూపలభ్యతే’’.. అంటారు.

శాస్త్రం చెప్పిన విషయం తిరుగులేని సత్యం... అన్న నమ్మకం ఉండాలి. కలడుకలండనెడువాడు కలడోలేడో...’ అన్న అనుమానం దగ్గరే ఉండిపోకుండా ‘భగవంతుడు ఉన్నాడు. శాస్త్రం చెప్పిన విషయం పరమ సత్యం..అని నమ్మాలి. ఆ పైన గురువాక్యస్య.. అంటే గురువుగారి నోటివెంట ఏది వచ్చిందో అది సత్యం. గురువుగారి నోటి వెంట వచ్చినది సత్యమయ్యేట్లు చూడవలసిన కర్తవ్యం భగవంతుడు తీసుకుంటాడు. అందుకే యోగివాక్కు అంటారు.

యోగి వాక్కు అంటే – గురువుగారు సత్యం చెప్పారు.. అని కాదు .. గురువుగారు చెప్పినది సత్యం... అని అన్వయం చేసుకోవాలి. అంటే అంత తిరుగులేని విశ్వాసం ఉండాలి. అందుకే గురు విషయంలో స్థాన శుశ్రూష అంటారు. మనం ఉంటున్న ఇంటిని, మనం కొలిచే దేవుడు ఉండే దేవాలయాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో అలా గురువుగారుండే ప్రదేశాన్ని కూడా శిష్యులు శుభ్రం చేస్తూ గురువుగారికి సౌకర్యంగా ఉండేటట్లు చూస్తుంటారు.

ఈ కంటితో చూడలేని పరబ్రహ్మం సశరీరంతో... అంటే మనలాగా కాళ్ళూచేతులతో, ఇతరత్రా మనలాగే నడిచివెడితే అదే గురువు. ‘గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్మైశ్రీగురువేనమః’–అని. గురువే బ్రహ్మ. గురువు మనలోని జ్ఞానజ్యోతిని వెలిగిస్తాడు. అందుకని సృష్టికర్త. గురుర్విష్ణుః..అంటే శ్రీమహావిష్ణువు స్థితికారుడై ఏ విధంగా ఈ సృష్టినంతటినీ నిలబెడుతున్నాడో అలా జ్ఞానాన్ని, భక్తిని పతనం కాకుండా గురువు కాపాడుతుంటాడు. అందుకని విష్ణువు. గురుర్దేవో మహేశ్వరః.. మహేశ్వరుడు ఎలా లయకారుడో అట్లా అజ్ఞానాన్ని గురువు లయం చేసి జ్ఞానాన్ని ఇచ్చి నిలబెడుతుంటాడు. అందుకే గురువు పరబ్రహ్మము. అటువంటి గురువుకు... తస్మైశ్రీగురవేనమః. ... నమస్కరించుచున్నాను.

ఈ లోకంలో గురువుగారికి ప్రత్యుపకారం చేయడం కానీ, గురువుగారిని సత్కరించడం కానీ, గురువుగారికి మనం పదేపదే కృతజ్ఞతలు చెప్పడం కానీ సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి గురువు విషయంలో కృతజ్ఞత గా చెయ్యగలిగినది ఒక్కటే– రెండు చేతులు కలిపి జోడించి శిరస్సు తాటించి నమస్కరించడం మాత్రమే. అది గురువుపట్ల చెదరిపోని నమ్మకంతో చేయాలి.. అది వాగ్గేయకారులందరూ చేశారు. కాబట్టే మహాత్ములయ్యారు.

మరిన్ని వార్తలు