చెవి రింగులతో ర్యాష్‌ వస్తోందా? 

23 Mar, 2021 23:13 IST|Sakshi

కొందరికి చెవి రింగులు లేదా దుద్దుల కారణంగా చెవి ప్రాంతం ఎర్రబడటం, ర్యాష్‌ రావడం జరుగుతుండవచ్చు. సాధారణంగా చాలావరకు కృత్రిమ ఆభరణాలలో నికెల్‌ అనే లోహం ఉంటుంది. దీనివల్ల ర్యాషెస్‌ వస్తాయి. ఇలాంటివి ఆభరణాల కారణంగా కొందరిలో  చెవి వద్ద కాస్తంత దురద, చెవి రంధ్రం వద్ద ఎర్రబారడం వంటి లక్షణాలూ కనిపిస్తుంటాయి. ఈ దశలో దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఆ తర్వాత అక్కడి గాయం రేగిపోయి, రక్తస్రావం కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్యను వైద్యపరిభాషలో ‘అలర్జిక్‌ కాంటాక్ట్‌ డర్మటైటిస్‌ టు నికెల్‌’ అంటారు. ఈ సమస్య ఉన్నవారు ఈ కింది సూచనలు పాటించడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. 

ఇలాంటివారు నికెల్‌తో చేసిన కృత్రిమ ఆభరణాలు, రింగులు, దిద్దులు ధరించడం సరికాదు. వీరు మొమెటజోన్‌ ఉన్న ఫ్యూసిడిక్‌ యాసిడ్‌ లాంటి కాస్త తక్కువ పాళ్లు కార్టికోస్టెరాయిడ్‌ కలిసి ఉన్న యాంటీబయాటిక్‌ కాంబినేషన్‌తో లభించే క్రీములను గాయం ఉన్నచోట రోజుకు రెండు సార్లు చొప్పున కనీసం 10 రోజులు రాయండి. ఇలాంటి క్రీములను సాధారణంగా డర్మటాలజిస్ట్‌ ల సూచనలతో వాడటమే మంచిది.  

మరిన్ని వార్తలు