Biodiversity: బయోడైవర్సిటీని రక్షించడంలో సోషల్‌మీడియాది కీలక పాత్ర

20 Nov, 2023 15:56 IST|Sakshi

ప్రస్తుతం సోషల్‌ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. గంటగంటకూ అప్‌డేట్స్‌ చూసుకునేవారు చాలామందే ఉన్నారు. స్మార్ట్‌ఫోన్‌లో ఫేస్‌బుక్, వాట్సప్, లింక్డిన్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌ అంటూ పలు ప్లాట్‌ఫార్మ్స్‌ ద్వారా మనిషి జీవితం పెనవేసుకొని పోయిందంటే ఆశ్చర్యం లేదు. అయితే జీవవైవిధ్యం(బయోడైవర్సిటీ)ని రక్షించడంలో సోషల్‌ మీడియాది ప్రముఖ పాత్ర ఉందని తాజా అధ్యయనంలో తేలింది. 

పకృతిలో జీవుల మధ్య సహజంగా కనిపించే భిన్నత్వాన్ని / ఓ భౌగోళిక ప్రాంతంలోని భిన్నజాతుల సముదాయాన్ని జీవవైవిధ్యం (Biodiversity) అంటారు. పెరుగుతున్న జనాభా, వనరులను మితిమీరంగా వాడటం వల్ల జీవవైవిద్య పరిరక్షణ సంక్లిష్టం మారుతోంది. చెట్లు నరికివేయడం,ఇష్టారాజ్యంగా పరిశ్రమల ఏర్పాటు వంటివి జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా భూమిపై ఉన్న కోట్లాది జీవరాశులు అంతరించే ప్రమాదం ఉంది. అయితే బయోడైవర్సిటినీ రక్షించడంలో సోషల్‌ మీడియా పాత్ర కీలకమని యూనివర్శిటీ ఆఫ్ క్వీన్స్‌లాండ్ స్కూల్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ జరిపిన అధ్యయనంలో తేలింది.

డాక్టర్‌ చౌదరి ఆధ్వర్యంలో జరిపిన అధ్యయనం ప్రకారం.. సోషల్‌ మీడియా అన్నది శాస్త్రీయ పరిశోధన, పరిరక్షణ ప్రయత్నాలకు శక్తివంతమైన సాధనంగా మారింది. ఉదాహరణకు బంగ్లాదేశ్‌లో గొప్ప వన్యప్రాణుల వారసత్వం ఉన్నప్పటికీ, కేవలం 4.6 శాతం మాత్రమే అధికారికంగా రక్షిత ప్రాంతంగా గుర్తించబడిందని తేలింది. బంగ్లాదేశ్‌లో పనిచేస్తున్న ఫేస్‌బుక్‌ నేచర్‌ ఫోటోగ్రఫీ గ్రూపులను పరిశీలించగా అక్కడ అనేక పక్షులు, కీటకాలు సహా మొత్తం 44,000 జీవరాశులు ఉన్నట్లు వారు కనుగొన్నారు. వీటిలో 288 జీవరాశులు అంతరించే ప్రమాదం ఉన్నట్లు సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌ అందించిన డేటా ప్రకారం తెలిసిందని డా. చౌదరి పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్ననేచర్‌ ఫోటోగ్రాఫర్‌లు దక్షిణాసియాలో జీవవైవిధ్య పరిరక్షణ మ్యాపింగ్‌ను మెరుగుపరచడంలో సహాయపడుతున్నారు. బంగ్లాదేశ్‌లో అంతరించిపోతున్న వందలాది జాతుల పంపిణీ డేటాను మేము కోల్పోతున్నాము. ఈ క్రమంలో సోషల్‌ మీడియా అందించిన డేటా మాకు సహాయపడింది. బయోడైవర్సిటీ పరిరక్షణలో కీలకమైన సమాచార అంతరాలను తగ్గించడానికి సోషల్ మీడియా కీలకంగా మారింది. ప్రత్యేకించి పర్యవేక్షణ లేని ప్రాంతాలలో ఫేస్‌బుక్‌ వంటి మీడియా ప్లాట్‌ఫామ్‌లు శాస్త్రీయ ప్రయత్నాలకు అర్థవంతంగా సహకరించేలా చేస్తాయి. 

ఆస్ట్రేలియాలో, తెగులు జాతుల కదలికలను ట్రాక్ చేయడంలో సోషల్ మీడియా కూడా కీలక పాత్ర పోషించింది అని డాక్టర్ చౌదరి వెల్లడించారు.బయోడైవర్సిటీ పరిశోధనపై సోషల్ మీడియా ప్రభావం దక్షిణాసియాకు మించి విస్తరించింది. టానీకోస్టర్‌ అని పిలవబడే దక్షిణాసియాకు చెందిన సీతాకోకచిలుక 2012లో ఆస్ట్రేలియాలో ప్రవేశించింది. దీని వలస విధానాన్ని అర్థం చేసుకోవడానికి పరిశోధన బృందం ఫేస్‌బుక్‌ని ఆశ్రయించడం విశేషం. సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్‌లు తప్పుడు సమాచారాన్ని, వ్యవసాన్ని పెంపొందిస్తాయని చెడు ప్రచారం ఉంది. కానీ జీవవైవిధ్యాన్ని రక్షించడంలో సోషల్‌మీడియా పాత్ర కీలకమని తాజా అధ్యయనంలో తేలింది. 


 

మరిన్ని వార్తలు