కనెక్ట్‌ అయ్యారు

2 Sep, 2020 01:25 IST|Sakshi

ప్రణబ్‌ హిందీ సినిమాలు చూడరు... ‘పీకూ’ చిత్రం మాత్రం ఇష్టంగా చూశారు. దీపికలో కూతుర్ని చూసుకున్నారు. అసలు ఆయన జీవితంలోని ప్రతి దశా.. ఒక స్త్రీమూర్తితో కనెక్ట్‌ అయి ఉన్నదే. అమ్మ రాజ్యలక్ష్మి, అక్క అన్నపూర్ణ.. భార్య సువ్రా, కూతురు శర్మిష్ట.. రాజకీయాల్లో శ్రీమతి ఇందిరాగాంధీ.. ప్రణబ్‌ని నడిపించారు.. మహిళా సాధికారవాదిగా మలిచారు. 

ఆడపిల్లను చదివిస్తే ఇంటికి వెలుగు అవుతుంది అనేవారు ప్రణబ్‌ ముఖర్జీ. ఆయనే అంటుండే ఇంకో మాట.. మహిళలు రాజకీయాల్లో వస్తే ఆ వెలుగులో సమాజం అభివృద్ధి అక్షరాలు దిద్దుకుంటుందని. ఇకనమిక్స్‌ పండిట్‌ ఆయన. మాటలు మరీ ఇంత సుకుమారంగా ఉండవు. ఉద్దేశం మాత్రం స్త్రీలకు.. నడిపించే సామర్థ్యం ఉందనే. ఎలా తెలుసు? ఆయనా ఒక మహిళ చూపిన దారిలోనే నడిచారు కనుక. ఒక మహిళ కాదు.. కొంతమంది. రాజకీయాల్లోకి వచ్చాక ప్రణబ్‌కు దారి చూపిన మహిళ శ్రీమతి  ఇందిరాగాంధీ. చాలా నేర్పించారు ఆమె ఈయనకు. ఒక్క ఇంగ్లిష్, హిందీ మాత్రం నేర్పించలేకపోయారు. అవి రెండూ ప్రణబ్‌కు రావని కాదు. వినసొంపుగా మాట్లాడ్డం సాధన చేయమనేవారు. ముఖ్యంగా ఇంగ్లిష్‌ను! ‘ఉచ్చారణను ఇంప్రూవ్‌ చేసుకోవయ్యా..’ అని ఆమె అంటే.. ‘సర్కిల్‌ నుంచి స్క్వేర్‌ను తయారు చేయాలని ప్రయత్నించకండి మేడమ్‌’ అని ఈయన నవ్వేవారు.

ఇక పార్లమెంట్‌ చర్చా సమావేశాల్లోనైతే కొన్నిసార్లు శ్రీమతి గాంధీనే ప్రణబ్‌ మీదుగా గట్టెక్కేవాళ్లు. 1983లో లోక్‌సభలో చరణ్‌సింగ్‌ ఏవో కాగితాలు గాల్లోకి ఝుళిపిస్తూ.. ‘చూడండి. బడ్జెట్‌ ప్రసంగ పత్రాలివి. ప్రసంగానికంటే ముందు ఐ.ఎం.ఎఫ్‌.కి లీక్‌ అయ్యాయి’ అని ‘ఉమామహేశ్వరస్య ఉగ్రరూపస్య’ అయ్యాడు. శ్రీమతి గాంధీ ప్రధాని. అదెలా జరిగిందో ఆమెకు అర్థం కాలేదు. ఆర్థికమంత్రి ప్రణబ్‌ కోసం చూశారు. చరణ్‌కి సమాధానం ఇవ్వాలి కదా. ఆ సమయంలో ప్రణబ్‌ రాజ్యసభలో ఉన్నారు. వెంటనే పిలిపించారు. ఆయన వచ్చేసరికి కూడా చరణ్‌ ఆగ్రహంతో ఊగిపోతూనే ఉన్నారు. ఆయన్ని మరికొంత సేపు మాట్లాడనిచ్చి.. అప్పుడు చెప్పారు ప్రణబ్‌.. ‘డేటు చూడండి. అవి గత ఏడాది నేను సమర్పించిన బడ్జెట్‌ ప్రసంగ పత్రాలు’అని! కాంగ్రెస్‌ బెంచీలు భళ్లున నవ్వాయి. శ్రీమతి గాంధీకి గొప్ప ఉపశమనం లభించింది. 

ప్రణబ్‌ ముఖర్జీ.. శ్రీమతి గాంధీకి సహచరులు మాత్రమే కాదు. సన్నిహితులు కూడా. కోపం వస్తే తిట్టేంత చనువుంది ఆమెకు. 1980 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె వద్దంటున్నా కూడా పోటీ చేశారు ప్రణబ్‌. ఘోరంగా ఓడిపోయారు. శ్రీమతి గాంధీకి పట్టలేనంత కోపం వచ్చింది. వెంటనే కోల్‌కతా ఫోన్‌ చేశారు. ‘నువ్వు ఓడిపోతావని ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆఖరికి గీతకు కూడా. కానీ నువ్వు వినలేదు. నాకు చిక్కులు తెచ్చిపెట్టావు’ అన్నారు. (ప్రణబ్‌ భార్య సువ్రా. శ్రీమతి గాంధీ, మరికొందరు స్నేహితులు ఆమెను గీత అని పిలిచేవారు). ప్రణబ్‌ మౌనంగా ఉన్నారు. రెండు రోజుల తర్వాత ఆయనకు ఇంకో కాల్‌ వచ్చింది. సంజయ్‌ గాంధీ! ‘‘మమ్మీ.. మీ మీద చాలా కోపంగా ఉన్నారు.
గురుతుల్యులు శ్రీమతి గాంధీ

మీరు లేకుండా కేబినెట్‌ ఏమిటి అని కూడా అంటున్నారు. విమానంలో రేపటి కల్లా ఢిల్లీలో ఉండండి’’ అని చెప్పారు సంజయ్‌. ప్రణబ్‌ మీద శ్రీమతి గాంధీ నమ్మకం అంతటిది! ఆమె పట్ల ప్రణబ్‌ గమనింపు కూడా అంతలానే ఉండేది. బ్రిటన్‌ ప్రధాని మార్గరెట్‌ థాచర్‌ మొదటిసారి కలిసినప్పుడు శ్రీమతి గాంధీ ఏం తిన్నారో కూడా ఆయనకు గుర్తుంటుంది. రెస్పెక్ట్‌ విత్‌ కేరింగ్‌ అనుకోవాలి. భార్య సహా ప్రతి మహిళను ఆయన గౌరవంగా చూస్తారు. సఫ్దర్‌జంగ్‌ రోడ్డులో ప్రధాని వాజపేయి, ప్రణబ్‌ ముఖర్జీ ఇరుగు పొరుగుగా ఉన్నప్పుడు వాజపేయి దత్తపుత్రిక నమిత పెళ్లి కుదిరింది. పెళ్లి పనులన్నీ వాజపేయి అభ్యర్థనపై ప్రణబ్‌ భార్యే దగ్గరుండి మరీ చూసుకున్నారు. ఆ పనుల్లో భార్యకు సహాయంగా ఉన్నారు ప్రణబ్‌!

ప్రణబ్‌ తన జీవితంలో తొలిసారి చూసిన హిందీ సినిమా ‘రంగ్‌ దే బసంతి’. అది కూడా ఆయన చూడాలన్న ఆసక్తి కొద్దీ ఏం చూడలేదు. సెన్సార్‌ బోర్డు చీఫ్‌ షర్మిల ఠాగోర్‌ వచ్చి అడిగితే బలవంతంగా సరేనన్నారు. ఆమె ఎందుకు చూడమని అడిగారంటే.. అందులో భారత రక్షణ శాఖ మంత్రిపై ప్రతీకారం తీర్చుకునే కథాపరమైన అనివార్యత ఏదో ఉంది. ముందే చూపిస్తే తర్వాత తిట్లు పడవు కదా అని షర్మిల ఆలోచన. అప్పుడు మన రక్షణ శాఖ మంత్రి ప్రణబ్‌ ముఖర్జీనే. సినిమాను మహదేవ్‌ రోడ్డులోని ఓ థియేటర్‌లో ఆయన కోసం ప్రదర్శించి చూపించారు.

సినిమా మధ్యలోనే బయటికి వచ్చేశారు ప్రణబ్‌. షర్మిల బిక్కుబిక్కుమంటూ నిలబడ్డారు. ప్రణబ్‌ ఆమె వైపు చూసి, ‘దేశాన్ని కాపాడ్డం నా పని. సినిమాలకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడం కాదు’ అని నిష్క్రమించారు. హాయిగా ఊపిరి పీల్చుకున్నారు షర్మిల. ‘రంగ్‌ దే బసంతి’ తర్వాత బహుశా ప్రణబ్‌ చూసిన రెండో హిందీ సినిమా ‘పీకూ’ అయుండొచ్చు. రాష్ట్రపతి భవన్‌లో వేసిన షోలో అడ్వాణీ తో కలిసి ఆ సినిమా చూశారు. వృద్ధుడైన తండ్రి, ఆయన కూతురు మధ్య ఉండే అనుబంధం ఆ సినిమా. నాయకులిద్దరూ కనెక్ట్‌ అయ్యారు. ఇద్దరికీ కూతుళ్లున్నారు మరి. 

ఒక విధంగా ప్రణబ్‌ది మహిళల వల్ల రూపు దిద్దుకున్న జీవితం. ఇంట్లో.. తల్లి రాజ్యలక్ష్మి, అక్క అన్నపూర్ణ, భార్య సువ్రా, కూతురు శర్మిష్ట, రాజకీయాల్లో శ్రీమతి గాంధీ. అందుకే కావచ్చు ఆయనలో ఒక మహిళా సంక్షేమ, సాధికార, హక్కుల పరిరక్షణ యోధుడు కనిపిస్తాడు. భారత సైన్యంలో యుద్ధ విధుల్లోకి మహిళల ప్రవేశం ఆయన చొరవ కారణంగానే సాధ్యమయింది. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు గట్టి మద్దతు ఇచ్చిన వారిలో ఆయన ప్రథములు.

మహిళల కోసం చట్టాలు చేసి ఊరుకుంటే సరిపోదని, చిత్తశుద్ధితో వాటిని అమలు పరచాలని ఆయన అంటుండేవారు. రాష్ట్రపతిగా 2012–17 మధ్య, ఇతర హోదాలలో అంతకుముందు, ఆ తర్వాత మహిళాభ్యున్నతికి, అభివృద్ధికి అనేక ప్రయత్నాలు చేశారు. సూచనలు ఇస్తూ వచ్చారు. చివరిసారి ఆయన మహిళల గురించి మాట్లాడింది.. గత ఏడాది ఆగస్టులో ఢిల్లీలో జరిగిన ‘బేటీ పఢావో అభియాన్‌’ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా. ‘ఆడపిల్లను చదివిస్తే ఇంటికి వెలుగు అవుతుంది’ అని అక్కడే ఆయన మరోసారి జాతి ప్రజలకు గుర్తు చేశారు.
కూతురు శర్మిష్ఠ

మరిన్ని వార్తలు