ఐదోతరగతి ఆథర్‌ ‘శౌర్య’

8 Apr, 2021 10:09 IST|Sakshi

స్పేస్‌ మాఫియా ఆన్‌ ది లూస్‌

గతేడాది లాక్‌డౌన్‌ .. రకరకాల కష్టాలతోపాటూ మరెన్నో జ్ఞాపకాలనూ మిగిల్చింది. ఈ సమయంలో చాలామంది తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే.. మరికొందరు తమలో దాగున్న ప్రతిభాపాటవాలను గుర్తించి వాటిని సానబెట్టుకున్నారు. అయితే శౌర్య మిశ్రా మాత్రం మనందరికంటే కాస్త భిన్నంగా.. తనకొచ్చిన ఆలోచనలకు అక్షర రూపం ఇచ్చాడు. బీహార్‌లో పుట్టి పెరిగిన 11ఏళ్ల శౌర్య అహ్మదాబాద్‌ ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్లో ఐదోతరగతి చదువుతున్నాడు. గతేడాది కరోనా వల్ల లాక్‌డౌన్‌ విధించడంతో ఎక్కడివారు అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి. స్కూలు మూసివేయడంతో శౌర్యకు బాగా బోర్‌ కొట్టేది. దీంతో తనకిష్టమైన స్పేస్‌బుక్స్, జర్నల్స్‌ చదవడంతోబాటు స్పేస్‌కు సంబంధించిన డాక్యుమెంటరీస్, చానల్స్‌ చూసేవాడు. స్పేస్‌కు సంబంధించిన అనేక అంశాల గురించి కాస్త దీర్ఘంగా ఆలోచించేవాడు. తన ఊహలన్నింటిని రాస్తూ రాస్తూ ఏకంగా 86 పేజీల బుక్‌ను రాశాడు. ‘స్పేస్‌ మాఫియా ఆన్‌  ది లూస్‌’ పేరిట పుస్తకాన్ని ప్రచురించాడు. 

‘‘స్కూళ్లు మూసివేయడంతో రోజూ క్లాస్‌లు జరిగేవి కాదు. అప్పుడు నాకు బోర్‌ కొట్టేది. ఇంకా ఫ్రెండ్స్‌తో ఆడుకోవడానికి కూడా కుదరకపోవడంతో ఏదో కోల్పోయిన ఫీలింగ్‌ కలిగేది. అప్పుడు నాకు ఎంతో ఇష్టమైన స్పేస్‌ గురించి రకరకాలుగా ఆలోచనలు వస్తుండేవి. ఆ సమయంలోనే మా అమ్మ నన్ను ప్రోత్సహిస్తూ తన పాత సెల్‌ఫోన్‌  ఒకటి నాకు ఇచ్చింది. దాంతో నేను నాకు వస్తున్న కొత్త కొత్త ఆలోచనలు, ఊహలను దాని మీద రాస్తూ ఉండేవాడిని. అవన్ని ఒక బుక్‌గా తయారయ్యాయి. ఈ బుక్‌ రాయడం నా తొలి అనుభవం. ముఖ్యంగా ఈ బుక్‌లో స్పేస్, ఎడ్వెంచర్స్, ప్లానెట్‌ దొంగతనాలు వంటి అబ్బురపరిచే అంశాలు అనేకం ఉన్నాయి.

భవిష్యత్‌లో నేను ఆస్ట్రోనాట్‌ అవ్వాలనుకుంటున్నాను. ఇందుకోసం కష్టపడి చదవడంతోపాటు నా ఊహాశక్తిని, సృజనాత్మకతను పెంపొందించుకుంటున్నాను’’ అని శౌర్య చెప్పాడు. కాగా శౌర్య 2014లో స్టోరీ టెల్లింగ్‌ పోటీలో పాల్గొని సర్టిఫికెట్‌ను, 2018లో నేషనల్‌ రుబిక్స్‌ క్యూబ్‌ చాంపియ షిప్‌లో గోల్డ్‌ మెడల్‌ నూ గెలుచుకున్నాడు. ఎంతో చురుకుగా ఉండే శౌర్యకు పేపర్, డిజిటల్‌ గ్యాడ్జెట్స్‌ మీద మంచి స్కెచ్‌లు గీయగల నైపుణ్యం కూడా ఉంది. ఈ విషయం గుజరాత్‌ సీఎం విజయ్‌ రుపానీకి తెలియడంతో శౌర్య ప్రతిభాపాటవాలను ఆయన అభినందిస్తూ లేఖ రాశారు. ‘‘లాక్‌డౌన్‌  కాలాన్ని చాలా బాగా ఉపయోగించుకున్నావు. చాలా ధైర్యంగా స్పేస్‌ ఎచీవ్‌మెంట్స్‌ కూడా ప్రస్తావించావు. అంతటి విపత్కర పరిస్థితులోన్లూ నీలో దాగున్న నైపుణ్యాన్ని వెలికి తీశావు’’ అని రుపానీ మెచ్చుకున్నారు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు