ఆ నిర్ణయమే సవితని విజేతగా నిలబెట్టింది

14 Feb, 2021 01:04 IST|Sakshi

ఆది లక్ష్మి, ధన లక్ష్మి, ధాన్య లక్ష్మి, ధైర్య లక్ష్మి, సంతాన లక్ష్మి, విద్యా లక్ష్మి, గజలక్ష్మి, విజయలక్ష్మి... మనకు తెలిసిన అష్ట లక్ష్ములు. వీరి జాబితాలో చేర్చాల్సిన మరో లక్ష్మి కథ ఇది. ఆ లక్ష్మి పేరు శ్రమలక్ష్మి.

ఆమె నలభై ఏళ్ల గృహిణి. పేరు సవిత లబాడే. ఊరు నాసిక్‌. చదివింది ఎనిమిదో తరగతి. ఇద్దరు పిల్లలు. భర్త ఆత్మారామ్‌ చిన్న రైతు. వాళ్లకున్నది రెండున్నర ఎకరాల పొలం. వ్యవసాయం చేస్తూ కుటుంబ బాధ్యత మొత్తం భర్త స్వయంగా చూసుకునేవాడు. ఇల్లు చక్కబెట్టుకోవడం, పిల్లల్ని పెంచుకోవడం తప్ప మరేమీ తెలియని ఇల్లాలామె. విధి వక్రించింది. భర్త గుండెపోటుతో మరణించాడు. అతడు చేసిన అప్పులన్నీ అతడు పోయిన తర్వాత బయటపడ్డాయి. భర్త పోయిన నెల రోజులకే కో ఆపరేటివ్‌ బ్యాంకుల వాళ్లు తలుపుకొట్టారు. అయోమయం నుంచి తేరుకునే లోపే ఇంటి గోడకు నోటీస్‌ అంటించారు. ఆ తర్వాత ఏడాది లోపు ఒక్కటొక్కటిగా అప్పుల లెక్కలన్నీ వరుస కట్టాయి. అంతా చూస్తే ఏడు లక్షల రూపాయలు. అప్పుకు వడ్డీ రోజురోజుకూ పెరిగిపోతోంది. భర్త పోయిన దుఃఖం ఒక కంట్లో నీరై కారుతోంది. అతడు చేసిన అప్పులు కన్నీళ్లుగా మరో కంట్లో ఉబికి వస్తున్నాయి. ఆ క్షణంలో ఆమె తీసుకున్న నిర్ణయం ఆమెను నేడు విజేతగా నిలబెట్టింది.

బలి తీసుకున్న ద్రాక్ష తీగ
సవిత భర్త పొలంలో ద్రాక్షతోటను పెంచేవాడు. ద్రాక్ష సాగు ఎలాగో ఆమెకు ఏ మాత్రం తెలియదు. పైగా భర్తను బలి తీసుకున్న ద్రాక్ష తీగను జీవితంలో తాక కూడదనుకుంది. దాంతో పొలంలో కూరగాయల సాగు చేయడానికి సిద్ధమైంది. అది మంచి లాభాల్నే ఇచ్చింది. నెలకు పదివేలు... ఇద్దరు పిల్లలతో బతకడానికైతే సరిపోతాయి. అయితే అప్పులు తీర్చేదెలా? ఇంకా ఏదో చేయాలి. అప్పుల నుంచి బయటపడితే, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచించవచ్చు అనుకుంది. తాను ఇష్టంగా ధరించే బంగారు దండను అమ్మేసి పెద్ద అప్పులు తీర్చింది. కూరగాయలతోపాటు సోయాబీన్, గోధుమ పంటలు వేసి బతుకు బండిని లాగుతోంది. ఒక స్నేహితురాలి సలహాతో సవిత మసాలా దినుసుల తయారీకి సిద్ధమైంది. మెషీన్‌ కొనాలంటే డబ్బు కావాలి. పొలం మీద వచ్చిన డబ్బు కొంత చేతిలో ఉంది. మిగిలిన బంగారం కూడా అమ్మేసి 65 వేలకు మెషీన్‌ కొన్నది. నిజానికి అది ఒక సాహసమే. అయితే ఆ ప్రయత్నం ఆమెను పరీక్ష పెట్టలేదు. మసాలా పొడుల తయారీ విజయవంతంగా నడిచింది.

ఆమె కుటీర పరిశ్రమ 2015 నాటికి నెలకు అరవై వేల సంపాదనకు చేరింది. ఈ లోపు పొలంలో మరో ప్రయోగం... చెరకు పంటకు పని తక్కువ, ఏడాది కి రెండుసార్లు పంట వస్తుంది. కష్టాల కడలిని ఈదుతున్న సవితను చెరకు పంట కూడా అర్థం చేసుకున్నట్లుంది. ఒక సీజన్‌కి యాభై వేల రాబడి తో తీపిని పంచింది. మసాలా పరిశ్రమ పని ఫిబ్రవరి నుంచి జూలై వరకే ఉంటుంది. పొలం మీద రాబడి కూడా సీజన్‌లోనే వస్తుంది. అలా కాకుండా ప్రతి నెలా డబ్బు కనిపిస్తే తప్ప జీవితం గాడిన పడదనుకుందామె. దాంతో జనరల్‌ స్టోర్‌ ప్రారంభించింది. ఇప్పుడు సవిత పంట మీద, మసాలా పొడుల పరిశ్రమ, జనరల్‌ స్టోర్‌ అన్నింటి మీద సరాసరిన నెలకు లక్ష రూపాయల ఆదాయాన్ని చూస్తోంది. ఉదయం ఐదింటి నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు పడుతున్న శ్రమకు దక్కుతున్న ప్రతిఫలం అది. ఆమె కొడుకు ఎలక్ట్రానిక్స్‌లో కోర్సు చేస్తున్నాడు. కూతురు పోలీస్‌ సర్వీస్‌లో చేరడానికి శిక్షణ తీసుకుంటోంది.

స్వశక్తితో జీవించాలి
‘‘మసాలా పొడి మెషీన్‌ నడిపేటప్పుడు కళ్లలో పడుతుంది, ఒంటి మీద పడి చర్మం మండుతుంది. ఆ మంటలకు భయపడి మెషీన్‌ని అమ్మేద్దాం అని కూడా అనిపించింది. నేను ఎదుర్కొన్న బాధలతో పోలిస్తే ఇవి పెద్దవి కాదని మనసు గట్టి చేసుకున్నాను. జీవితం నుంచి నేను నేర్చుకున్న పాఠం ఒక్కటే. ఆడవాళ్లు సున్నితంగా, శ్రమ లేకుండా హాయిగా జీవించేయాలనుకోకూడదు. స్వశక్తితో జీవించాలి. కష్టాలెదురైనప్పుడు నిశ్శబ్దంగా ఎదుర్కొనే ఆత్మస్థయిర్యాన్ని కలిగి ఉండాలి’’ అంటోంది సవిత.

మరిన్ని వార్తలు