Science Facts: మోచేతికి ఏదైనా తగిలితే అందుకే షాక్‌ కొట్టినట్టు ‘జిల్‌’ మంటుంది..!

22 Nov, 2021 12:45 IST|Sakshi

Cubital Tunnel Syndrome: వాస్తవంగా చెప్పాలంటే ఈ సమస్య మనందరికీ తెలిసిందే. చిన్నతనంలో మనమందరమూ అనుభవించిందే. మన తోటి సావాసగాళ్లలో ఉండే ఏ చిలిపి పిల్లలో, లేదా అనుకోకుండా ఎవరైనా ఇతరులో మన మోచేతి దగ్గర ఉండే బొడిపెలాంటి ఎముకను ఠక్కున తాకినప్పుడు క్షణకాలం పాటు మోచేతి నుంచి అరచేతివరకూ ‘జిల్లు’మంటుంది. ముంజేయంతా స్పర్శ కోల్పోయినట్లుగా అవుతుంది. కాసేపటి తర్వాత అదే సర్దుకుని మామూలవుతుంది. అలా కాసేపు మనల్ని అల్లాడించే తిమ్మిరిలాంటి ఈ నొప్పి/బాధకు ‘ఫన్నీ బోన్‌ పెయిన్‌’ అన్న పేరుందని మనలో చాలామందికి తెలియదు.

ఎందుకీ సమస్య?
మోచేతి దగ్గర బొడిపెలా ఉన్న ఎముక పక్కనుంచి ఓ నరం వెళ్తుంటుంది. అది మెదడు నుంచి మొదలై మోచేతి ఎముక దగ్గరనుంచి చేతి వేళ్లలోకి వెళ్లే  సర్వైకల్‌ నరాల్లో ఒకటైన అల్నార్‌ నర్వ్‌ అనే నరం. అకస్మాత్తుగా అక్కడ దెబ్బ తగలగానే ఠక్కున మెదడు సిగ్నళ్లు మోచేతి నుంచి అరచేతిలోకి పాకడం వల్ల ఈ ‘ఫన్నీ బోన్‌ పెయిన్‌’ కనిపిస్తుంది. అందరిలోనూ క్షణకాలం పాటు ఉన్నప్పటికీ కొందరిలో ఇది దీర్ఘకాలిక సమస్యగా మారుతుంది. అంటే వాళ్లలో ఇదే తరహా నొప్పి/తిమ్మిరి/స్పర్శ లేకపోవడం అన్న కండిషన్‌ అదేపనిగా కొనసాగుతుంది. ఇలా జరగడానికి కారణం క్షణకాలం పాటు కాకుండా అక్కడి నరం పూర్తిగా నొక్కుకుపోవడమే. 

కారణాలు...
ఇలా జరగడానికి చాలా కారణాలే ఉంటాయి. ఉదాహరణకు తమ పనుల్లో భాగంగా అదేపనిగా మోచేతిని బల్లమీద ఎప్పుడూ అనించి ఉంచడమూ లేదా నిద్రపోయే సమయంలో ముంజేతిని మడతేసి, దాన్నే తలగడలా భావిస్తూ తల బరువును పూర్తిగా దానిపైనే మోపి నిద్రపోతూ ఉండటం కొందరికి అలవాటు. ఇలా చేసేవాళ్లలో ‘అల్నార్‌’నరం నొక్కుకుపోతుంది. దాంతో మనమంతా చిన్నప్పుడు తాత్కాలికంగా అనుభవించిన బాధ అదేపనిగా వస్తూనే ఉంటుంది. 

తగ్గేదెలా?
మోచేతులు మడత వేయకుండా జాగ్రత్తలు తీసుకుంటే కొందరిలో ఈ సమస్య దానంతట అదే తగ్గుతుంది. ఇక మరికొందరిలో బ్రేసెస్, స్ల్పింట్స్‌ వంటి ఉపకరణాల సహాయంతో నరంపై బరువు పడకుండా చూడటంతో పాటు కొన్ని రకాల వ్యాయామాలతో నొప్పి తగ్గుతుంది. ఇలాంటి సాధారణ పెయిన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రక్రియలు పనిచేయనప్పుడు కొందరిలో  శస్త్రచికిత్స చేసి ‘అల్నార్‌ నర్వ్‌’పై పడే ఒత్తిడిని తొలగించాల్సి వస్తుంది. అయితే ఇలాంటి సర్జరీ చాలా అరుదుగా, చాలా తక్కువ మందికే అవసరమవుతుంది.  

చదవండి: Worlds Most Dangerous Foods: అత్యంత విషపూరితమైన వంట​కాలు.. ప్రాణాలను పణంగా పెట్టి మరీ తింటారట!!

మరిన్ని వార్తలు