వెరీ స్పెషల్‌ స్టేషన్‌.. ఓ భాగం గుజరాత్‌లో మరో భాగం మహారాష్ట్రలో..!

16 May, 2022 08:58 IST|Sakshi

క్రాస్‌ బార్డర్‌

గుజరాత్‌ సరిహద్దుల్లోని నవాపూర్‌ రైల్వేస్టేషన్‌ సందర్శనకు చాలామంది వస్తుంటారు. రైల్వేస్టేషన్‌కి సందర్శకులు ప్రత్యేకంగా రావడం ఏమిటో? అనే కదా మీ డౌటనుమానం? దేశంలోనే ఇదో ప్రత్యేకమైన రైల్వేస్టేషన్‌. ఈ స్టేషన్‌ సగభాగం గుజరాత్‌ రాష్ట్రంలో మరో సగభాగం మహారాష్ట్రలో ఉంటుంది. అందుకే ఈ స్టేషన్‌కు రావడానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పోటెత్తుతుంటారు. ప్రయాణం చేయడానికి కాదు, ఫొటోలు తీసుకోవడానికి. 

ఈ స్టేషన్‌కు రైలు వచ్చినప్పుడు ఇంజిన్‌ ఒక రాష్ట్రంలో బోగీలు మరో రాష్ట్రంలో ఉంటాయి. ఒకవేళ రైలు గుజరాత్‌ నుంచి వస్తుంటే.. ఇంజిన్‌ మహారాష్ట్రలో, బోగీలు గుజరాత్‌లో ఉంటాయి. అదే మహారాష్ట్ర నుంచి గుజరాత్‌ వెళ్తున్న రైలు ఆగితే.. ఇంజిన్‌ గుజరాత్‌లో, బోగీలు మహారాష్ట్రలో ఆగుతాయి. అందుకే ఇక్కడికి వచ్చే సందర్శకులకు ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది.

మహారాష్ట్రలో నిలబడి గుజరాత్‌లో ఉన్న కౌంటర్‌ దగ్గర టికెట్లు కొనుక్కుంటారు. ఇక్కడ బెంచీలు కూడా రెండు రాష్ట్రాల పేర్లను (ఒకవైపు గుజరాత్‌ అని మరోవైపు మహారాష్ట్ర అని) సూచిస్తుంటాయి. గుజరాత్, మహారాష్ట్రల సరిహద్దు రేఖను ప్లాట్‌ఫామ్‌ మీద చూడొచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌లో ఉండే ఒక బెం^Œ  పైన సరిగ్గా సగానికి లైన్‌ గీసి.. ఉంటుంది. సగభాగం గుజరాత్‌లో సగభాగం మహారాష్ట్రలో ఉంటుంది.

దాంతో ఈ బెంచ్‌పై కూర్చుని చాలామంది సెల్ఫీలు దిగుతారు. ఇక ఈ రైల్వేస్టేషన్‌ను నిర్వాహకులు చాలా శుభ్రంగా ఉంచుతారు. ఈ స్టేషన్‌కి మరో ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే రెండు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌లు. ఒకటి గుజరాత్‌ ప్రయాణికుల కోసం, మరొకటి మహారాష్ట్ర ప్రయాణికుల కోసం. రెండు రాష్ట్రాల ప్రజల కోసం రెండు ప్రత్యేకమైన బ్రిడ్జ్‌లు మరెక్కడా లేవు. భలే ఉంది కదూ.. అటువైపుగా వెళ్తే మీరూ ఈ స్టేషన్‌కి వెళ్లి చూడండి. ఆ ప్రత్యేకమైన బెంచ్‌ మీద కూర్చుని ఓ ఫొటో కూడా దిగండి. 

మరిన్ని వార్తలు