Urban Eco Farming: వీకెండ్స్‌ వ్యవసాయం 

11 May, 2021 10:16 IST|Sakshi

సేంద్రియ వ్యవసాయం నేర్చుకుంటూ పండించుకుంటున్న నగరవాసులు

600 చదరపు గజాల్లో ఒక కుటుంబానికి సరిపడా కూరగాయల సాగు 

విస్తరిస్తున్న వీకెండ్స్‌ సేంద్రియ వ్యవసాయం 

ఫైనాన్స్‌ రంగంలో పని చేసే విశాఖకు చెందిన ప్రణయశ్రీకి సెంటు పంట భూమి కూడా లేదు. కానీ, వారం వారం ఆమె తన కుటుంబంతో సహా పొలానికి వెళుతుంటారు. ఆమె కుటుంబంలో ఎవరికీ వ్యవసాయం తెలియదు. కానీ, వారే తమ కుటుంబానికి కావలసిన కూరగాయలను సేంద్రియ విధానంలో పండించుకుంటున్నారు. ఆశ్చర్యంగా ఉంది కదూ..! అవును.. ‘అర్బన్‌ ఏకో ఫార్మింగ్‌’ వినూత్న ప్రయత్నంతో ప్రణయశ్రీకి ఇది సుసాధ్యమవుతోంది.. ఇలా..!

నగరవాసులైన నవతరం చేస్తున్న ఆధునిక సహజ వ్యవసాయ పోకడ ఇది. మన కూరగాయలు మనం పండించుకోవడానికి మనకి ఎకరాల కొద్దీ పొలం ఉండనక్కర లేదు. కుటుంబానికి మూడు మడులు (600 చదరపు అడుగులు) చాలు. సేంద్రియ ఆహారంపైన, వీకెండ్స్‌లో మనకి నచ్చిన కూరగాయాల్ని పండించుకోవచ్చు. అది కూడా ఎటువంటి హానికరమైన ఎరువులు వాడకుండా.. సేంద్రియ విధానంలోనే. విశాఖ, విజయనగరం శివారు ప్రాంతాల్లో ఈ తరహా వ్యవసాయం ఇప్పుడు నయా ట్రెండ్‌గా మారింది. 

ప్రస్తుతం సేంద్రియ ఆహారోత్పత్తులకు గిరాకీ పెరుగుతోంది. రసాయనాల్లేని ఆహారంపై ప్రజలు అవగాహన పెంచుకుంటున్నారు. వీలున్నవారు తమ ఇళ్లపైనే ’సేంద్రియ ఇంటి పంటలు’ పెంచుకుంటున్నారు. అయితే, ఆ అవకాశం లేని వారు నగరానికి దగ్గరలో ఇంటిపంట మడులను అద్దెకు తీసుకొని వారాంతాల్లో సేంద్రియ సేద్యం చేస్తున్నారు. విశాఖకు చెందిన ఉషా గజపతిరాజు తమ అపార్ట్‌మెంట్‌ భవనంపైనే సేంద్రియ కూరగాయలు, పండ్లను అనేక ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారు. ఇంటిపంటలపై ఎందరికో శిక్షణ ఇస్తున్నారు.

అయితే, సేంద్రియ ఇంటిపంటల సాగుపై ఆసక్తి ఉండి, ఇంటిపై సాగు చేసుకునే అవకాశం లేక సతమతమయ్యే వారి కోసం ఉష కొత్త ఆలోచన చేశారు. విజయనగరం జిల్లా బసవపాలెంలో 30 ఎకరాలలో ’అర్బన్‌ ఎకో ఫామ్స్‌’ను ప్రారంభించి, ప్రజలను భాగస్వాములు చేస్తున్నారు. కుటుంబానికి మూడు మడులు అద్దెకిచ్చి.. వారాంతాల్లోæ వారే వచ్చి కూరగాయలు పండించుకునేలా మెలకువలను నేర్పిస్తున్నారు. ఆ పంటల బాగోగులను అర్బన్‌ ఎకో ఫామ్స్‌ సిబ్బంది చూసుకుంటారు. వినియోగదారులకు మడులు చూసుకోవడానికి వెళ్లలేకపోతే కూరగాయలను ఆ సిబ్బందే డోర్‌ డెలివరీ చేస్తారు.  

నలుగురున్న ఒక కుటుంబానికి నెలకి సరిపడా కూరగాయలు పండించడానికి మూడు ’బెడ్లు’ (600 చదరపు అడుగుల స్థలంలో మూడు ఎత్తు మడులు) అవసరం అవుతాయి. ఇందులో బీర, బీట్‌ రూట్, క్యారెట్, ముల్లంగి, తోటకూర, గోంగూర, స్వీట్‌ కార్న్, ఆనప, వంగ, కాకర, బెండ, దోస, మిరప, ఉల్లి కాడలు.. ఇలా అనేక రకాలైన పంటలను ఆ మడుల్లో సాగు చేస్తారు. వీటితో పాటు కొందరు వినియోగదారుల కోసం జామ, బొప్పాయి మొక్కలు కూడా నాటుతున్నారు.

తృప్తిగా పండించుకొని తింటున్నాం..
మన పరిసరాలన్నీ కాలుష్యమయమే. ఇది ఎవరూ కాదనలేని నిజం. నగరాలు, పట్ణణాలైతే ఇక కాలుష్యంతో కలిసి జీవనం సాగించాల్సిందే. తిండిలో అన్నీ కెమికల్సే. ఇది అనేక జబ్బులకు కారణం అవుతోంది. ఇప్పుడిప్పుడే ఈ విషయాన్ని గ్రహిస్తున్న చాలామంది సేంద్రియ విధానంలో పండిస్తున్న ఉత్పత్తులంటే ఆసక్తి చూపుతున్నారు. సాధారణ కూరగాయల ధరలతో పోలిస్తే సేంద్రియ విధానంలో పండిన కూరగాయల ధరలు ఎక్కువగా ఉండటం, పైగా అవి నిజంగానే ఆర్గానిక్‌ వెజిటబుల్సా కాదా? అనే అనుమానం కూడా వస్తుంది.

అటువంటి సమయంలో నాకు ’అర్బన్‌ ఎకో ఫామ్స్‌’ కోసం తెలిసింది. వెంటనే నేను కొన్ని మడులను అద్దెకు తీసుకున్నాను. అందులో కొన్ని రకాల కూరగాయల్ని పెంచుతున్నాను. నేను నెలకి కూరగాయలకు ఎంత ఖర్చు పెడుతున్నానో, దీనికీ అంతే ఖర్చు అవుతుంది. పైగా సేంద్రియ విధానంలో కూరగాయాల్ని నేనే పండించుకుని తింటున్నాననే తృప్తి కలుగుతోంది. నాకు వ్యవసాయం కొత్తే అయినా, క్రమక్రమంగా తెలుసుకుంటూ.. సేంద్రియ వ్యవసాయంలో మెలకువలు నేర్చుకుంటున్నాను.
– మనిష్, విశాఖపట్నం

వారానికోసారి పొలానికి పిక్నిక్‌
అర్బన్‌ ఎకో ఫామ్‌ నగర శివారు ప్రాంతంలో ఉండటంతో ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. చాలామంది వీకెండ్స్‌ ఎంజాయ్‌ చేసేందుకు ఇటువంటి ప్రదేశాలకు రావాలనుకుంటారు. ఇప్పుడు ఎకో ఫామ్స్‌లో ఫ్లాట్స్‌ తీసుకోవడం వలన వీకెండ్స్‌ ఎంజాయ్‌ చేయడంతో పాటు సొంతంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. కానీ ఉద్యోగం చేసే నాకు వ్యవసాయం తెలియదు. ఎకో ఫామ్స్‌లో నాకిష్టమైన కాయగూరల్ని పండించుకుంటున్నాను. నా కుటుంబంతో వారం, వారం ఇక్కడికి పిక్నిక్‌లా వచ్చి, వ్యవసాయం గురించి తెలుసుకున్నాను. మట్టితోనూ, మొక్కలతోనూ సమయాన్ని గడపడం ఆనందంగా ఉంది. ఇప్పుడు మేము పండించిన కాయగూరల్నే ఇంటిల్లపాదీ తింటున్నాం.’’ – డాక్టర్‌ జయ, విశాఖపట్నం

చేస్తూ నేర్చుకోవడం..! 
నిజానికి నేను వత్తి రీత్యా డైటీషియన్‌ని. ఖాళీ సమయాల్లో టెరస్ర్‌ ఫార్మింగ్, చెత్త నుంచి కంపోస్టు తయారు చేయటం నేర్చుకున్నాను. ఈ క్రమంలో ప్రజలు సేంద్రియ ఉత్పత్తులపై చూపిస్తున్న ఆసక్తిని గమనించాను. అయితే, మార్కెట్‌లో ఆర్గానిక్‌ ప్రోడక్ట్స్‌ పేరుతో లభించేవన్నీ నిజమైన ఆర్గానిక్‌ పదార్థాలు కావని భావించి.. నేనే స్వయంగా సేంద్రియ వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాను. ఇందులో ఆసక్తి ఉన్న వారిని భాగస్వాములను చేశాను. ఒక్కొక్కరికి ఫ్లాట్ల చొప్పున కొంత స్థలం కేటాయించి (గరిష్టంగా 600 అడుగులు) వారికి కావల్సిన కూరగాయలు పండిస్తాం.

అలా పండించిన వాటిని వారానికోసారి వారి ఇంటికే స్వయంగా అందిస్తాం. విత్తనం నుంచి పంట చేతికొచ్చే వరకు సాగు చేసే విధానాన్ని ఫోటోలు తీసి కస్టమర్ల సెల్‌ఫోన్లకు పంపిస్తాను. ఆసక్తి ఉన్న వినియోగదారులు కావాలంటే వారే తమ ఫ్లాట్లలో పంటలు పండించుకుంటారు. చాలామంది వీకెండ్‌లో వచ్చి ఇక్కడ వ్యవసాయం చేస్తారు. వ్యవసాయంపై అవగాహన లేని వారికి మేం ఇక్కడ నేర్పిస్తాం. లెర్నింగ్‌ బై డూయింగ్‌ విధానంలో ఇక్కడ ఫార్మింగ్‌ సాగుతుంది. 

ఈ ఎకో ఫార్మ్‌లో 25 రకాలైన కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నాం. వీటిలో వినియోగదారులు తమ అభిరుచి మేరకు ఏవైనా 12 రకాలను ఎంచుకొని, వారి ఫ్లాట్స్‌లో పండించుకోవచ్చు లేదా మేమే వారి కోసం పండిస్తాం. ఫార్మింగ్‌ మొదలు పెట్టిన 40 రోజుల నుంచి ప్రతి వారం వినియోగదారుడికి 8 కిలోలు.. వారు పండించుకున్న కూరగాయలను, ఆకుకూరలను బాక్సులలో పెట్టి అందిస్తాం.

600 అడుగుల స్థలాన్ని అద్దెకివ్వడం నుంచి ఇంటికి కూరగాయలు అందించడం వరకు అన్ని మేమే చేస్తాం. వారి స్థలంలో వేసుకునే మొక్కలు, విత్తనాలు, సేంద్రియ ఎరువులన్నీ మేమే సమకూరుస్తాం. ఆవు పేడ, మూత్రం, మొక్కల ఆకులతో తయారు చేసిన ఎరువులే వాడతాం. వీకెండ్స్, హాలీడేస్‌లో ఇక్కడి వచ్చి స్వయంగా పండించుకోవడం వారికి ఆనందాన్ని ఇవ్వడంతో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపడం వారికి మానసిక ఉల్లాసాన్ని కూడా కలిగిస్తుంది.

– ఉషా గజపతిరాజు,  (9949211022)
‘అర్బన్‌ ఏకో ఫార్మింగ్‌’ నిర్వాహకురాలు

– బోణం గణేష్, 
సాక్షి ప్రతినిధి, విజయనగరం

మరిన్ని వార్తలు