Valentines Day 2023: ఎవరిని ప్రేమించాలి? ఎందుకు ప్రేమించాలి?.. క్షణకాల సుఖం కోసం..

13 Feb, 2023 12:01 IST|Sakshi

ఎవర్ని ప్రేమించాలి? ప్రతి ఏటా ఫిబ్రవరి 14 వస్తుంది.. ప్రేమికులంతా చాలా గ్రాండ్‌గా వేలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ డేని సమర్థించేవారు ఎంతమంది ఉన్నారో.. వ్యతిరేకించేవారూ అంతేమంది ఉన్నారు. అసలు ప్రేమకు సెలబ్రేషన్ అవసరమా? ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటేనే ప్రేమ ఉన్నట్లా? .. ప్రేమ అనేది ప్రేమికులకు మాత్రమేనా?

ప్రేమ కోసం పరితపించే జీవులు ఇంకెవరూ లేరా? సొసైటీలో ఎన్ని కుటుంబాలు సంతోషంగా ఉంటున్నాయి? .. ఎంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డలతో ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నారు? అంటే ఖచ్చితంగా చెప్పలేం. తల్లిదండ్రులు పిల్లలతో ఆనందంగా గడిపేది మహా అయితే వాళ్లు డిగ్రీలు పుచ్చుకునే వరకే. ఉద్యోగం రాగానే.. పెళ్లి ఆ తరువాత పిల్లలు.. అలా వాళ్లకొక జీవితం ఏర్పడ్డాక తల్లిదండ్రులను పట్టించుకునే పిల్లలు ఎంతమంది ఉన్నారు.

అమాయకపు తల్లిదండ్రులు
ఉద్యోగ రీత్యా విదేశాల్లో స్థిరపడితే ఇక ఆ తల్లిదండ్రుల కష్టాలకు అంతే లేదు. డబ్బు ఉన్నా.. పిల్లల ఆప్యాయత.. అనురాగాల కోసం పరితపించి పోతూ ఎంతో మంది తల్లిదండ్రులు వృద్ధాశ్రమాల్లో మగ్గిపోతున్నారు.. రేపు వస్తాడు.. ఎల్లుండి వస్తాడు .. అని ఎదురుచూస్తూ వాళ్లు ఎప్పుడూ తిరిగి రారన్న అబద్ధం తెలియని ఎంతోమంది అమాయకపు తల్లిదండ్రులు అక్కడే తనువు చాలించేస్తున్నారు.

క్షణకాలం వారి సుఖం ఆలోచిస్తారు కానీ..
అలా చాలామంది తల్లిదండ్రులకు పిల్లల నుంచి ప్రేమ దొరకట్లేదు.. ప్రేమించో.. పెద్దలు కుదిర్చినదో పెళ్లి చేసుకుంటారు. ఆపై మనస్పర్థలు.. కలిసి బతకడం ఇష్టం లేదంటూ విడాకులు తీసుకునే జంటలు ఎన్నో చూస్తున్నాం. ఒకరినొకరు అర్థం చేసుకోరు.. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండదు.. కానీ.. ఈలోపే పిల్లల్ని కంటారు. క్షణకాలం వారి సుఖం ఆలోచిస్తారు కానీ.. విడిపోతే తమ పిల్లల భవిష్యత్ ఏంటో ఆ క్షణం ఆలోచించరు.

తల్లిదండ్రులు చేసిన తప్పునకు బలైపోయి అనాథలైన ఎంతోమంది పిల్లలు ఈ సమాజంలో ఉన్నారు. ఓవైపు తల్లిదండ్రుల నిరాదరణ.. మరోవైపు సమాజం చిన్నచూపు అక్కడా వారికి కరువైంది ప్రేమే కదా.. ప్రేమ.. కులం.. మతం .. వయసు… అన్ని అడ్డుగోడల్ని కూల్చేస్తుంది. ప్రేమించడం తప్పుకాదు.. కానీ అవగాహన లేని ప్రేమ జీవితాన్ని నాశనం చేస్తుంది.

దీన్ని కూడా ప్రేమే అంటారా?
నమ్మిన వాడు మోసం చేశాడని.. నమ్మిన ఆడది మంచిది కాదని ప్రేమలో విఫలమయ్యే దాకా చాలామంది ప్రేమికులకు అర్థం కాదు. దాన్ని తొందరపాటు అనాలో వారి గ్రహపాటు అనాలో తెలియదు. అదే తొందరపాటుకు ప్రతిఫలంగా పుట్టే పిల్లలు ఎంతమందో చెత్తబుట్టల్లో తేలుతున్నారు. పాపం వాళ్లేం చేశారు… కుక్కలు ఈడ్చుకుపోతుంటే వారి రోదన ఎవరికి వినిపిస్తుంది.. ఆ పాపం ఎవరిది.. దీన్ని కూడా ప్రేమే అంటారా?

భర్త చనిపోతే భార్య, భార్య చనిపోతే భర్త మళ్లీ పెళ్లి చేసుకుంటారు. మొదటి భార్య, లేదా భర్తకు పుట్టిన పిల్లల్ని మాత్రం మర్చిపోతారు. వాళ్లేం పాపం చేశారండి. ఆ పిల్లల పట్ల ఎందుకు సమన్యాయం చూపించరు. ఆ పిల్లల్ని వదిలేసి తమ జీవితం చూసుకుంటే దాన్ని స్వార్ధమనేగా అంటారు. తమకు పుట్టిన బిడ్డలకి ప్రేమను పంచడంలో ఈ తేడాలేంటో.. ఇక తల్లిదండ్రుల్ని పంచుకునే పిల్లలు గురించి చెప్పాలి.

కాటికి కాలు చాచే ఆ వయసులో
వృద్ధాప్యంలో ఒకేచోట ఉండాల్సిన పేరెంట్స్ని తలొకరు పంచుకుంటూ ఉంటారు. తల్లిదండ్రుల్ని చూడటానికి అన్నదమ్ముల మధ్య పంతాలు.. మనస్పర్థలు.. చివరికి పంపకాలు. పిల్లల మనసు నొప్పించలేక.. ఒకరిని విడిచి ఒకరు ఉండలేక ఆ పెద్దవాళ్లు పడే బాధ మాటల్లో చెప్పలేం. కాటికి కాలు చాచే ఆ వయసులో పాపం.. అప్పుడూ వారికి ప్రేమ కరువవుతోంది.

పిల్లలే జీవితంగా గడిపిన ఎంతోమంది పేరెంట్స్ ఇప్పుడు అదే పిల్లల దగ్గర తమ జీవితం ఎంత త్వరగా ముగుస్తుందా అని భారంగా కాలం వెళ్లదీస్తున్నారు.. పేరెంట్స్ ఇచ్చే ఆస్తులు కావాలి.. కానీ తల్లిదండ్రులు వద్దనుకుంటే ఆ పేరెంట్స్ ని ప్రేమించేది ఎవరు? ఇక అన్నదమ్ములు.. అక్క చెల్లెళ్లు.. తోడల్లుళ్లు.. తోడికోడళ్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎంతమంది మధ్య ప్రేమ ఉంది.. ఎక్కడ ప్రేమ దొరుకుతుంది అంటే ఒక ఛాన్స్ ఉందిలెండి.

డబ్బుంటేనే..
అదేంటంటే డబ్బుండాలి. డబ్బుంటే ప్రేమాభిమానాలు పొంగుకొస్తాయి. అదే డబ్బులేని వాడి గురించి ఆలోచించడానికి కూడా మనసు ఒప్పుకోదు. డబ్బుతో కొనలేనివాటిలో మొదటిది.. చివరిది ఒకటే.. అదే 'ప్రేమ'. మన సమాజంలో నిజమైన ప్రేమ కోసం పరితపించిపోతున్న వాళ్లు ఇలా చాలామందే ఉన్నారు. ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి..

మన తల్లిదండ్రుల్ని ..మన కుటుంబాన్ని.. మన తోటివారిని .. ప్రేమించాలి.. మన పుట్టిన ఊరిని.. మన మట్టిని.. మన దేశాన్ని.. ప్రేమించగలగాలి. ప్రేమించడానికి ఇంతమంది ఉండగా.. లవర్స్ డే రోజు ప్రేమ అవసరమా.. నాకైతే అవసరం లేదనిపిస్తోంది. ఇది పూర్తిగా నా అభిప్రాయం.. ఎవరినీ కించపరచడానికి మాత్రం కాదు.
-లక్ష్మీ పెండ్యాల, జర్నలిస్టు

చదవండి: పిల్లలు సెల్‌ఫోన్‌, టీవీకి అడిక్ట్‌ అయ్యారా? ఇలా చేయండి.. కడుపులో నులిపురుగులు ఉంటే..

మరిన్ని వార్తలు