నా కాపురాన్ని నిలబెట్టండి మేడమ్

22 Nov, 2020 10:31 IST|Sakshi

నాకు 28 ఏళ్లు. పెళ్లయి ఆరేళ్లవుతోంది. పెళ్లికి ఏడాది ముందు ఒవేరియన్‌ సిస్ట్‌ ఆపరేషన్‌ అయింది.  ఈ విషయం బయటకు చెబితే పెళ్లి చెడిపోతుందేమోనని దాచిపెట్టి పెళ్లి చేశారు మావాళ్లు. పెళ్లయి ఆరేళ్లయినా పిల్లలు పుట్టకపోయేసరికి గైనకాలజిస్ట్‌కు చూపించుకోవాల్సి వచ్చింది. అక్కడ అసలు విషయం చెప్పాల్సి వచ్చింది.

ఆ నిజం విన్న మా అత్తింటి వాళ్లు నాకు అందువల్లే పిల్లలు పుట్టట్లేదని, మేం వాళ్లను మోసం చేశామని నన్ను మా పుట్టింటికి పంపించేశారు. ఇది జరిగి ఎనిమిది నెలలవుతోంది. ఎంత చెప్పినా మా వారు కూడా వినట్లేదు. దయచేసి వాళ్ల సందేహానికి పత్రికాముఖంగా జవాబిచ్చి నా కాపురాన్ని నిలబెట్టండి మేడమ్‌. 
– సుచిత్ర ( ఈ మెయిల్‌ ద్వారా వచ్చిన ప్రశ్న).

నీకు ఓవేరియన్‌ సిస్ట్‌కు ఆపరేషన్‌ చేసినప్పుడు మొత్తం ఓవరీ (అండాశయం) తీసివేశారా లేదా కేవలం సిస్ట్‌ ఒక్కటే తొలగించి మిగతా అండాశయం ఉంచారా అనే విషయాలు తెలియవలసి ఉంది. గర్భాశయం రెండు వైపుల ఒకటి చొప్పున రెండు అండాశయాలు ఉంటాయి. ప్రతి నెలా 11–16వ రోజు లోపల ఒక అండాశయం నుంచి ఒక అండం విడుదల అవుతుంది. సాధారణంగా ఒక నెల కుడివైపు నుంచి ఒక నెల ఎడమవైపు నుంచి విడుదల అవుతాయి. ఈ అండం అండవాహికలోకి ప్రవేశిస్తుంది. ఈ అండం విడుదలయ్యే సమయంలో కలయిక వల్ల వీర్యకణాలు యోని నుంచి గర్భాశయంలోకి ప్రవేశించి దాని నుంచి ట్యూబ్‌లో ఉన్న అండంలోకి చొచ్చుకొని వెళ్లి దానిని ఫలదీకరణ చేయడం వల్ల పిండం ఏర్పడుతుంది. ఆ పిండం మరలా గర్భాశయంలోకి ప్రవేశించి, అక్కడ ఎండోమెట్రియమ్‌ పొరలో దానికి సరిపడా రక్త ప్రసరణ, హార్మోన్స్‌ ఉన్నప్పుడు, పిండం అంటుకొని గర్భం పెరగడం మొదలయ్యి మెల్లగా శిశువుగా మారుతుంది.

ఇక్కడ గమనించవలసింది. అండాశయం నుంచి అండం విడుదల, ట్యూబ్స్‌ తెరుచుకొని ఉండటం, గర్బాశయం లోపలి పొర సరిగా పెరగడం, హార్మోన్స్‌ సక్రమంగా పనిచేయడం, అలాగే మగవారిలో వీర్యకణాల సంఖ్య, కదలిక నాణ్యత అన్నీ సరిగ్గా ఉంటేనే గర్భం వస్తుంది. నీకు ఓవేరియన్‌ సిస్ట్‌ వల్ల ఒక అండాశయం తొలగించి ఉంటే కూడా, ఇంకొక అండాశయం ఉంది కాబట్టి దాని నుంచి ప్రతి నెలా అండం విడుదలవుతుంది. మిగతా పైన చెప్పిన సమస్యలు ఏమీ లేకపోతే ఒక అండాశయం లేకపోవడం వల్ల గర్భం రాకపోవడం ఏమి ఉండదు. గర్భం రాకపోవడానికి సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి, ట్యూబ్‌ టెస్ట్‌ (హెచ్‌ఎస్‌జీ) అండం సాధారణంగా విడుదల అవుతుందా లేదా తెలుసుకోవడానికి ఫాలిక్యులర్‌ స్టడీ స్కానింగ్, ఇన్‌ఫెక్షన్స్‌ ఏమైనా ఉన్నాయా, హార్మోన్స్‌ సక్రమంగా ఉన్నాయా అని తెలుసుకోవడానికి రక్త పరీక్షలు చేయించుకొని సమస్యను బట్టి చికిత్స తీసుకుంటే గర్భం వచ్చే అవకాశాలు బాగా ఉంటాయి.

అన్నింటికంటే ముందు, ఈ కాలంలో మారిన ఆహారపు అలవాట్లు, తాగుడు, పొగ తాగుడు, వ్యసనాలు, మానసిక ఒత్తిడి వంటి కారణాల వల్ల మగవారిలో కూడా చాలా మందిలో శుక్రకణాల (వీర్య కణాలు) సంఖ్య బాగా తగ్గిపోవడం, కదలిక నాణ్యత సరిగా లేకపోవడం పరిశీలనకి వచ్చిన విషయం కాబట్టి ఒకసారి మీ వారికి కూడా సీమెన్‌ అనాలసిస్‌ పరీక్ష చేయించడం మంచిది. అందులో సమస్య ఉంటే దానికి తగ్గ చికిత్స తీసుకొని, గర్భం కోసం ప్రయత్నించడం ద్వారా గర్భం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. గర్భం సాధారణంగా రాకపోవడానికి ఆడవారిలో 50 శాతం కారణం అయితే, మగవారిలో లోపాలు కూడా 50 శాతం కారణం అవుతాయి. పెళ్లయిన తరువాత ఒవేరియన్‌ సిస్ట్‌ బయటపడుంటే అప్పుడైనా ఆపరేషన్‌ చేయించుకొని చికిత్స తీసుకునే వాళ్లు కదా.

ఆరు సంవత్సరాలు కాపురం చేసి ఇప్పుడు కాదంటే ఎలా? సమస్యను వాళ్లు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం మంచిది.  మీ పెద్దవారిని, మీ అత్త తరపు వాళ్లని కూర్చోబెట్టి మాట్లాడుకొని, సమస్యను పరిష్కరించుకోవడం మంచిది. డాక్టర్‌ను సంప్రదించి భార్య భర్త ఇద్దరు పరీక్షలు చేయించుకొని, సమస్యను బట్టి చికిత్స తీసుకొని మందుల ద్వారా, లేదా ఐయూఐ పద్ధతి, మరీ కాకుంటే ఐవీఎఫ్‌ టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ పద్ధతి ద్వారా గర్భం కోసం ప్రయత్నించవచ్చు. 
-డా.వేనాటి శోభ
గైనకాలజిస్ట్‌
హైదరాబాద్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా