ఆహారపు అలవాట్లు మార్చుకుంటే హెచ్‌బీఏ1సీ నార్మల్‌కి వస్తుందా?

9 Jan, 2022 08:47 IST|Sakshi

 సందేహం

నా వయసు 24 ఏళ్లు. ఎత్తు 5.3, బరువు 52 కిలోలు. గత ఏడాది పెళ్లయింది. ప్రస్తుతం నాకు మూడో నెల. ఇటీవల డాక్టర్‌ సలహాపై హెచ్‌బీఏ1సీ టెస్ట్‌ చేయించుకుంటే, 7.7 ఉంది. తీపి పదార్థాలు పూర్తిగా మానేశాను. అన్నం కూడా తగ్గించాను. తరచు నీరసంగా ఉంటోంది. ఆహారపు అలవాట్లు మార్చుకుంటే హెచ్‌బీఏ1సీ నార్మల్‌కి వస్తుందా? నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందో దయచేసి వివరించగలరు.
– మాధురి, పర్లాకిమిడి

హెచ్‌బీఏ1సీ లేదా గ్లైకోనేటెడ్‌ హీమోగ్లోబిన్‌ టెస్ట్‌ ద్వారా మన రక్తంలో మూడు నెలల ముందు నుంచి సగటు చక్కెర శాతం ఎంతవరకు ఉందనేది తెలుస్తుంది. సాధారణంగా రక్తంలోని ఎర్రకణాలలోని హీమోగ్లోబిన్‌కు చక్కెర అంటుకుంటుంది. సుగర్‌ ఉన్నవాళ్లలో చక్కెర ఎక్కువగా అంటుకుంటుంది కాబట్టి హెచ్‌బీఏ1సీ ఎక్కువగా ఉంటుంది. హెచ్‌బీఏ1సీ 5.7 శాతం కంటే తక్కువగా ఉంటే, సుగర్‌ నార్మల్‌గా ఉన్నట్లు.

ఇది 5.7–6.4 శాతం మధ్య ఉన్నట్లయితే, ప్రీడయాబెటిక్‌ రేంజ్‌లో ఉన్నట్లు–అంటే, వీరికి త్వరలోనే డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పటి నుంచే ఆహార నియమాలను పాటించేటట్లయితే, డయాబెటిస్‌ వచ్చే అవకాశాలను తగ్గించుకోవచ్చు. హెచ్‌బీఏ1సీ 6.5 శాతం కంటే ఎక్కువ ఉంటే డయాబెటిస్‌ ఉన్నట్లు. మీకు హెచ్‌బీఏ1సీ 7.7 ఉంది. గర్భం మూడోనెల. అంటే, గర్భం రాకముందు నుంచే మీకు డయాబెటిస్‌ ఉన్నట్లుంది. ఇంతకుముందు ఎప్పుడూ సుగర్‌ టెస్ట్‌ చేయించుకుని ఉండరు కాబట్టి సుగర్‌ ఉన్నట్లు తెలియలేదు.

గర్భం లేకుండా ఉన్నట్లయితే, సుగర్‌ మందులతో పాటు, ఆహారపు అలవాట్లను కఠినంగా మార్చుకుని, ఆహార నియమాలను పాటించినట్లయితే హెచ్‌బీఏ1సీ మూడు నెలల్లో సాధారణ స్థితికి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాని, ఇప్పుడు మూడోనెల గర్భం కాబట్టి ఒకసారి ఎండోక్రైనాలజిస్టును సంప్రదిస్తే, వారు తినకముందు, తిన్న తర్వాత సుగర్‌ లెవల్స్‌ ఎలా ఉన్నాయో పరీక్షించి, వాటిని బట్టి సుగర్‌ అదుపులోకి రావడానికి ఇన్సులిన్‌ ఇంజెక్షన్లు, మందులు ఇవ్వడం జరుగుతుంది.

అలాగే గర్భం కాబట్టి ఆహార నియమాలను డాక్టర్‌ చెప్పిన ప్రకారం, అవసరమైతే న్యూట్రిషనిస్ట్‌ సలహా మేరకు సుగర్‌ నియంత్రణకు, బిడ్డ పెరుగుదలకు మధ్య సమన్వయం చేసుకుంటూ పాటించవలసి ఉంటుంది. ఆహారంలో తీపి పదార్థాలు, అన్నం, చపాతీ వంటివి తగ్గించేసి, రాగిజావ, తృణధాన్యాలు, జొన్నరొట్టె వంటివి తీసుకోవడం మంచిది. ఇవన్నీ పాటిస్తూ సుగర్‌ లెవల్స్‌ను తరచుగా పరీక్ష చేయించుకుంటూ, అదుపులో ఉన్నట్లయితే, అదే చికిత్స తీసుకుంటూ, డాక్టర్‌ పర్యవేక్షణలో చిన్నగా నడక వంటి వ్యాయామాలు చేసుకోవచ్చు.

సుగర్‌ లెవల్స్‌ అదుపులో లేకపోతే, ఇన్సులిన్‌ మోతాదును పెంచడం జరుగుతుంది. గర్భం వల్ల నీరసంగా ఉంటుంది. అలాగే సుగర్‌ లెవల్స్‌ మరీ తక్కువగా ఉన్నా, నీరసం వస్తుంది. ఆహారాన్ని కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు విభజించుకుని, ఆరుసార్లుగా, అంటే మూడుసార్లు ముఖ్యమైన ఆహారం, మూడుసార్లు స్నాక్స్‌లాగా తీసుకోవడం మంచిది.

గర్భంతో ఉన్నప్పుడు సుగర్‌ లెవల్స్‌ ముందు నుంచే అధికంగా ఉంటే, దాని ప్రభావం వల్ల కొందరిలో అబార్షన్లు, బిడ్డలో అవయవ లోపాలు, బిడ్డ బరువు సరిగా పెరగకపోవడం, కొందరిలో అధికంగా పెరగడం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు కాస్త ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కంగారు పడకుండా, ఎండోక్రైనాలజిస్టును సంప్రదించి, వారి పర్యవేక్షణలో సక్రమంగా చికిత్స తీసుకోవడం మంచిది. 

నా వయసు 33 ఏళ్లు. రెండేళ్ల కిందట సిజేరియన్‌ ద్వారా కాన్పు జరిగింది. ఆ తర్వాతి నుంచి నడుము నొప్పి మొదలైంది. కొద్ది నెలలుగా సమస్య మరింత తీవ్రంగా మారింది. ఆసరా లేకుండా కూర్చోవడం కూడా కష్టంగా ఉంటోంది. ఇంతవరకు ఏ డాక్టర్‌కు చూపించుకోలేదు. నేను ఎలాంటి చికిత్స తీసుకోవలసి ఉంటుందో చెప్పగలరు.
– ప్రసూన, కొవ్వూరు

సిజేరియన్‌ తర్వాత నడుంనొప్పి రావటానికీ, ఆపరేషన్‌కూ ఎలాంటి సంబంధం ఉండదు. కాకపోతే, కాన్పు ముందు తొమ్మిదినెలలు గర్భంలో బిడ్డ పెరగడం, తల్లి నుంచి క్యాల్షియం, విటమిన్లు తీసుకోవడం జరుగుతుంది. కాన్పు తర్వాత తల్లి పాల నుంచి బిడ్డకు క్యాల్షియం వెళ్లిపోవడం వల్ల తల్లి ఎముకలలో క్యాల్షియం తగ్గి, నడుంనొప్పి రావచ్చు. ఈ సమయంలో తల్లి క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు, పాలు పెరుగుతో పాటు క్యాల్షియం, విటమిన్‌–డి మాత్రలు తీసుకోవడం వల్ల నడుంనొప్పి లేకుండా, తల్లిలో ఎముకలు దృఢంగా ఉంటాయి.

మీ సమస్య మరీ తీవ్రంగా అనిపిస్తోంది. మీ సమస్యకు కారణం వెన్నుపూసలో ఎముకలు బలహీనపడటమా లేక వెన్నుపూసలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అనేది తేలవలసి ఉంది. కొందరిలో క్యాల్షియం, విటమిన్‌–డి లోపంతో పాటు థైరాయిడ్‌ సమస్య, వెన్నుపూసలో గుజ్జు తగ్గడం, డిస్క్‌ ప్రొలాప్స్‌ కావడం, వాటి మధ్య నరాలు ఒత్తుకోవడం వంటి అనేక కారణాల వల్ల అంత తీవ్రమైన నొప్పి ఉంటుంది.

ఇలా డాక్టర్‌కు చూపించుకోకుండా ఇబ్బందిపడటం సరికాదు. ఒకసారి ఆర్థోఫిజీషియన్‌ డాక్టర్‌ను సంప్రదించి, అవసరమైన ఎక్స్‌రే, రక్తపరీక్షలు చేయించుకుని, సమస్య ఎక్కడ ఉందో తెలుసుకుని, సరైన చికిత్స తీసుకోవడం మంచిది. 

-డా.వేనాటి శోభ
గైనకాలజిస్ట్‌
హైదరాబాద్‌

మరిన్ని వార్తలు