మరోకథ: పులి  

26 Sep, 2021 12:51 IST|Sakshi

యాభైయేళ్ల క్రితం అతను ప్రాణాలకు తెగించి సాహసంతో పులితో పోరాడాడు.. పులి అతని ధాటికి తట్టుకోలేక ఎక్కడికో పారిపోయింది. ఆ తరువాత ఆ పులి జాడలేదు.  అలా ఒంటిచేత్తో పోరాడేవాళ్లు ఇప్పుడు ఒక్కరే నాకు తెలిసి..’ అని ఆగి ఒక్కసారి ‘ రాజమ్మ.. రాజన్న కొడుకు కూతురు. రాజన్న చనిపోయే ముందు ఆ విద్యను కొడుక్కి నేర్పుతానంటే నేర్చుకోలేదు.

‘ఇందుమూలంగా మన్యం ప్రజలకు చుట్టుపక్కల గూడెపు ప్రజలకు తెలియజేయునది ఏమనగా.. మనిషి రగతం రుచి మరిగిన పెద్దపులి మన్యంలోకి వచ్చింది. పొలంలో పనిచేసుకుంటున్న మడుసులను, మేకలను పశువులను దేన్నీ ఇడిసిపెట్టకుండా సంపుతుంది. సీకటిపడ్డాక బయటకు రాకూడదహో.. ఒంటరిగా తిరగొద్దని అడవి  దొరలు చెబుతున్నారు.. పారాహుషార్‌ ’ అంటూ టముకు వేస్తూ వెళ్తున్నాడు వ్యక్తి.
మన్యం ఉలిక్కిపడింది. పులి అటవీప్రాంతంలో నుంచి యథేచ్ఛగా మన్యంలోకి అడుగుపెట్టింది. మన్యం గ్రామాల్లో పులి సంచారం. మనుషుల రక్తం రుచి మరిగిన పులి పిచ్చిపట్టినట్టు తిరుగుతోంది.  

దాపులనే వున్న అడవి నుంచి ఎలా వచ్చిందో తెలియదు. ఒక్కసారిగా గ్రామాల మీద విరుచుకుపడుతోంది. పొలం పనులు చేసుకుంటున్న మహిళల మీద దాడిచేసింది. రాత్రివేళ పొలంలో కాపలాగా వున్నవాళ్లను పొట్టన పెట్టుకుంటోంది.
ఎప్పుడు ఎలా వచ్చి దాడి చేస్తుందో తెలియడం లేదు. 13 మందిని చంపేసింది.

పులికి ఎరగా మేకలు, గుర్రాలను చెట్లకు కట్టి కూడా అధికారులు ప్రయత్నాలు చేశారు. రెండు మేకలను  తినేసి వెళ్లిపోయింది కానీ దొరకలేదు. ఫారెస్ట్‌ రేంజర్లు అడవిలో నాలుగు ప్రాంతాల్లో చెట్లపై మంచెలు ఏర్పాటు చేసుకుని టార్చిలు,  వైర్‌లెస్‌ సెట్లు,  వలలతో సిద్ధమై రాత్రీపగలు దాని జాడ కనిపెట్టేందుకు నిఘా పెట్టారు. పులుల సంరక్షక విభాగానికి చెందిన 30 మంది కమాండోలు.. అత్యాధునిక ఆయుధాలతో  పోలీసులు నిత్యం అడవంతా గాలించసాగారు. పదిమంది ప్రైవేటు షార్ప్‌ షూటర్లనూ అధికారులు రప్పించడంతో ఆయుధాలతో వారూ పగలూరేయీ అడవిని జల్లెడ పడుతున్నారు.

పులిని అడ్డగించడానికి ఏనుగులపై ఒక బృందం తిరుగుతోంది.
ఇవి చాలవన్నట్లు లేటెస్ట్‌ టెక్నాలజీనీ ఉపయోగిస్తున్నారు. ఒక పవర్‌ గ్లైడర్, డ్రోన్‌ కూడా నిత్యం అడవిని పరిశీలించేందుకు అక్కడి గగన తలంలో తక్కువ ఎత్తులో తిరుగుతున్నాయి.

ఇంతచేసినా పులి జాడ దొరకలేదు. ఈ విషయం నేషనల్‌ చానెల్స్‌లోకి వెళ్లింది. రక్తంతాగే పులి జనారణ్యాల మధ్య విచ్చలవిడిగా తిరుగుతోందన్న వార్త సంచలనం అయ్యింది. మన్యం ప్రజలకు  కంటిమీద కునుకు కరువైంది.  ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ పులిని బంధించినా, చంపినా పదిలక్షల పారితోషికాన్ని ప్రకటించింది. పులివేటగాళ్లను రంగంలోకి దించింది. అయినా ఫలితం కనిపించలేదు. పులి కనిపిస్తే మత్తిచ్చి పట్టుకునేందుకు ట్రాంక్విలైజర్‌ గన్‌ లతో వెటర్నరీ డాక్లర్ల బృందం కూడా ఈ వేటలో పాలుపంచుకుంటోంది.

ఫారెస్ట్‌ రేంజర్‌గా పనిచేసి రిటైరైన రామభద్రాన్ని పిలిపించి అతని సలహాను కోరారు  సీనియర్‌ అధికారులు.
డెబ్భైయేళ్లు దాటిన రామభద్రం అధికారుల వంక చూసి చెప్పాడు..‘కొన్ని పులులు మనుషుల రక్తం రుచి మరుగుతాయి. కేవలం ఆకలి కోసం మాత్రమే జంతువుల మీద దాడిచేసే పులులు వేరే. నేను ఉద్యోగంలో చేరిన తొలినాళ్లలో ఒకపులి మన్యం ప్రజలమీద దాడిచేసింది. కంటిమీద కునుకు లేకుండా చేసింది. అప్పుడు మనుషుల రక్తం రుచి మరిగిన ఆ పులిని వేటాడి చంపడానికి పులులవేటలో మొనగాడైనా రాజన్నను రంగంలోకి దించాం.

రాజన్న అంటే పులులతో ఆట ఆడుకునే  మొనగాడు. అతను వస్తుంటే పులులు పక్కకు తప్పుకుంటాయి. పులుల వేటలో అతడు ఆనాటి యువకులకు తర్ఫీదు ఇచ్చేవాడు. వాళ్ళ పూర్వీకులు పులులను వేటాడడంలో అప్పటి సంస్థానాధీశులకు, అప్పటి బ్రిటిష్‌ పాలకులకు మెళకువలు చెప్పేవారట. రాజన్న మాత్రం అడవిలో దాడిచేసే పులుల నుంచి ఎలా రక్షించుకోవాలో చెప్పేవాడు. పులులను చంపకూడదని ఈ విద్య నేర్పించే ముందే ప్రమాణం చేయించుకునేవాడు.

యాభైయేళ్ల క్రితం అతను ప్రాణాలకు తెగించి సాహసంతో పులితో పోరాడాడు.. పులి అతని ధాటికి తట్టుకోలేక  ఎక్కడికో పారిపోయింది. ఆ తరువాత ఆ పులి జాడలేదు. అలా ఒంటిచేత్తో పోరాడేవాళ్లు ఇప్పుడు ఒక్కరే నాకు తెలిసి..’ అని ఆగి ఒక్కసారి ‘ రాజమ్మ.. రాజన్న కొడుకు కూతురు. రాజన్న చనిపోయే ముందు ఆ విద్యను కొడుక్కి నేర్పుతానంటే నేర్చుకోలేదు. కానీ అతని కూతురు, రాజన్న మనవరాలు రాజమ్మ నేర్చుకుంది. రాజన్న కొడుకు, కోడలు ఒక ప్రమాదంలో చనిపోయారు. మనవరాలిని పెంచిపెద్ద చేసి పెళ్లి చేశాడు. రాజన్న కూడా కాలం చేశాడు. రాజమ్మను విధి కూడా చిన్న చూపు చూసింది. ఆమె భర్త చిన్నవయసులోనే కన్ను మూశాడు. మూడేళ్ళ తన కూతురితో పక్కనే వున్న గూడెంలో బతుకు వెళ్లదీస్తోంది. ధైర్యంలో  తాతను పోలిన వ్యక్తి’ అని చెప్పాడు రామభద్రం.

‘ఒక మహిళ, అదీ ఒక బిడ్డతల్లి మనుషుల రక్తం మరిగిన పులిని ఎదుర్కోగలదా?’ అనే సంశయాలున్నా పులిని ఎదుర్కోవడానికి వారికీ మరోమార్గం కనిపించలేదు. వందల వేల ఎకరాల మేర విస్తరించి వున్న ఈ మన్యం ప్రాంతం గురించి ఇక్కడే పుట్టిపెరిగిన  రాజమ్మకే తెలుసు. పులి వేటగాడైన రాజన్న వారసురాలు రాజమ్మే సరైన ఎంపిక అనుకున్నారు. 
∙∙ 
ముప్పయేళ్ల రాజమ్మ వడివడిగా అడుగులు వేస్తూ నడుస్తోంది. చీకట్లు మన్యాన్ని చుట్టుముట్టాయి తన జీవితంలా! అయినా ఆమెలో ధైర్యం, పోరాడాలనే  సాహసం చచ్చిపోలేదు. మూడేళ్ళ బిడ్డ మాయదారి రోగంతో పోరాడుతోంది. పుట్టుకతోనే వచ్చిన జబ్బు. గుండెకు రం్ర«ధం ఉందని.. ఆపరేషన్‌ చేయాలనీ కనీసం అయిదులక్షలు అయినా కావాలి అని డాక్టర్‌ చెప్పాడు. 

తన గూడేనికి తిరిగివస్తుంటే రాములు తాత ఎదురొచ్చాడు.. ‘బేగి ఎల్లిపో రాజమ్మా.. అసలే రోజులు బాగాలేవు మాయదారి పులి.. ఎప్పుడు ఎవరిమీద పడి పేణాలు తీత్తదో ’ అంటూ.
నవ్వుకుంది రాజమ్మ. తనకు పులికన్నా పెద్ద సమస్య.. తన బిడ్డ రోగం.. ఆ సమస్యకు ఆ మన్యం దేవుడే పరిష్కారం చూపించాలి అనుకుంది.
అప్పుడే అక్కడికి ఫారెస్ట్‌ రేంజర్‌ జీపు వచ్చి ఆగింది. అందులో నుంచి రామభద్రం దిగాడు. రాజమ్మను పలకరించాడు. తనతో పాటు తీసుకువెళ్లాడు.
∙∙ 
ఫారెస్ట్‌ ఆఫీసర్, రామభద్రం, రాజమ్మ ముగ్గురే వున్నారు. రాజమ్మ ఒళ్ళో బిడ్డ నిద్రపోతోంది.
‘రాజమ్మా.. మీ తాత రాజన్న నాకు గురువులాంటోడు. ఈ మన్యాన్ని ఒకప్పుడు పులిబారి నుంచి కాపాడిన దేవుడు. ఇప్పుడు పులి సమస్య మళ్ళీ వచ్చింది. పులిని ఎలా వేటాడాలి, మట్టి కరిపించాలో ఆ పట్లు నీకు మీ తాత నేర్పించాడు. ఈ మన్యాన్ని కాపాడడానికి మీ తాత రూపంలో నువ్వే ముందుకు రావాలి. నీ  పరిస్థితి తెలుసు. నీ బిడ్డ ఆపరేషన్‌ బాధ్యత ప్రభుత్వం చూసుకుంటుంది. నీకు సాయంగా ఫారెస్ట్‌ గార్డులు వుంటారు. ఈ సాహసం చేయగలవా?’  అడిగాడు రామభద్రం.. రాజమ్మ వంక చూసి. రాజమ్మలో అతనికి రాజన్న రూపమే కనిపిస్తోంది.

ఎక్కువసేపు ఆలోచించలేదు రాజమ్మ.. తన బిడ్డ  ప్రాణాలు కాపాడుకునే అవకాశం, దానికి తోడు ఈ మన్యం ప్రజల ప్రాణాలు కాపాడే అదృష్టం వచ్చింది. తనకు పులిని వేటాడే విద్య నేర్పిస్తున్నప్పుడు తాత చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.. ‘నీకోసం కాకుండా నిన్ను నమ్ముకున్న వాళ్ళకోసం నువ్వు చేసే సాహసమే  నిజమైన సాహసం’ అని.

 రామభద్రం ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది  రాజమ్మ. ‘ఈ రాత్రికే పులివేట మొదలవుతుంది. మనుషుల రుచి మరిగిన పులిని వేటాడుతా.. నా తాత మీద ఆన’ అంటూ గూడేనికి బయల్దేరింది రాజమ్మ . పులివేటకు మరోపులి సిద్ధమైంది. 
∙∙ 
ట్రంకుపెట్టె తెరిచింది రాజమ్మ. తనకు పులిని వేటాడే విద్యను నేర్పించేప్పుడు తాను కట్టుకున్న చీర, ఒంపులు తిరిగున్న పిడిబాకు, తెల్లటి పట్టీలాంటి వస్త్రం.. పెట్టెలోంచి తీసింది. 

గోచీలా చీర కట్టింది. తెల్లటి దళసరి వస్త్రాన్ని పట్టీలా కుడికాలుకు కట్టుకుంది. పిడిబాకును ఆ పట్టీపొరల్లో పెట్టింది. తన గుడిసెలోని మట్టిగోడ మీదున్న తాత ఫోటో ముందు నిలబడి దండం పెట్టుకుంది.  ‘తాతా నువ్వు నేర్పిన విద్య ఈరోజు నా బిడ్డ ప్రాణం,ఈ మన్యం ప్రజల ప్రాణం కాపాడబోతుంది. నన్ను ఆశీర్వదించు’ అంటూ. మంచంలో పడుకున్న బిడ్డను ఎత్తుకొని తన వీపుకు చీరతో కట్టేసుకుంది. శత్రువులను ఎదిరించడానికి వెళ్తోన్న వీరనారిలా ఉంది.
∙∙ 
 చీకటిపడింది.. రాజమ్మ చెవులు రిక్కించింది. పులి అడుగుల శబ్దాన్ని గుర్తించగలదు. ఒక్కసారిగా వేగంగా లంఘించగలదు.. అది తాత ద్వారా నేర్చుకున్న విద్య. నీటిలో పులి ఈదుతున్న శబ్దం. ఏడు కిలోమీటర్ల వెడల్పైన నదిని ఈదగలదు తను. పులిలా మారింది రాజమ్మ. తాతను మనసులో స్మరించుకుంది. ఆమె చేతులు ఆయుధాలుగా మారుతున్నాయి. చుట్టూ చెట్ల మీద ఆయుధాలతో ఫారెస్ట్‌ గార్డులూ ఎలర్ట్‌గా వున్నారు.
పలచని వెన్నెల.. ఆ వెలుతురులో  చెట్ల చాటున పులి నీడ.. రెండుకాళ్ళ మీద నిలబడితే మనిషి ఎత్తును మించే ఎత్తు. దాదాపు రెండువందల కిలోల బరువున్న పులి..

రాజమ్మ కళ్లు అటువైపు తిరిగాయి. పులి ఒకేసారి గాల్లోకి ఎగిరింది. మెరుపు వేగంతో పక్కకు దూకింది రాజమ్మ. ఫారెస్ట్‌ గార్డులు తుపాకులు గురిపెట్టేలోగా నాలుగుసార్లు రాజమ్మ మీదకు లంఘించింది పులి. ఇప్పుడు.. పులికి ఎదురుగా వుంది రాజమ్మ. తనే మాత్రం వెనక్కి తిరిగినా, తగ్గినా  పులి పంజా తన బిడ్డ మీద పడుతుందని తెలుసు. పిడికిళ్లు బిగించి తెరిచింది. చేతులను చురకత్తుల్లా మార్చింది. 

పులి తనమీద పడేసమయంలో ఒడుపుగా పక్కకు జరిగింది.తన రెండు కాళ్లను చెట్టుకు ఆనించి గాలిలో నిలబడి పులి తలను గట్టిగా పట్టుకుంది. ఆ పట్టులో ఒడుపుంది. పులి వేటగాడైన తాత నేర్పిన కిటుకుంది. ఒక చేత్తో పులి తలను చుబుకం నుంచి పైకి లేపింది. కుడిచేత్తో తన కాలికి చుట్టుకున్న పట్టీలో నుంచి పిడిబాకు తీసి పులి గొంతుక పక్కవైపు బలంగా దించింది. ఒక్కసారిగా పులి కిందకు జారింది. రాజమ్మ వైపు కోపంగా చూస్తూ పైకి లేచి లంఘించబోయింది. ఆ అవకాశం ఇవ్వలేదు రాజమ్మ. తానే సివంగిలా పులి మీదకి దూకింది. పులి బోర్లా పడిపోయింది. తన చేతిలోని పిడిబాకు పులి కళ్ళలోకి దింపబోయింది.

ఒక్కక్షణం.. ఒకే ఒక్క క్షణం.. పులికళ్ళలో కన్నీళ్లు కనిపించాయో.. ఓటమిని అంగీకరించిన దైన్యాన్ని గ్రహించిందో.. అమ్మ మనసును చూసిందో కానీ ఆగిపోయింది రాజమ్మ. అప్పటికే చెట్టు మీదున్న ఫారెస్ట్‌ గార్డులు కిందకు దూకి పులిని బంధించేందకు సంసిద్ధంగా ఉన్నారు.. మన్యం ప్రజలూ  ఆయుధాలు, కాగడాలతో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.. ‘ చంపెయ్‌ రాజమ్మా.. పులి కళ్ళను పొడిచెయ్‌’ అంటూ అరుస్తున్నారు. 

రాజమ్మ చురుకైన కళ్లు పులి కళ్ల వంకే చూస్తున్నాయి. తనకు పులిని వేటాడే విద్య నేర్పిస్తూ తాత చెప్పిన మాటలు గింగురుమంటున్నాయి.. ‘మనలాగే పులి కూడా  ఒక జీవే. శరణు జొస్తే వదిలివేయడం వీరుల లక్షణం’ అంటూ. అలా తన తాత యాభైయేళ్ల కిందట వదిలేసిన పులి సంతతే ఈ పులి అనిపించింది ఆమెకు. రాజమ్మ పెదవులు పులి చెవుల దగ్గరికి వెళ్లాయి..  

‘ నీకు నా మాటలు వినిపిస్తాయో.. లేదో! నువ్వు వినగలవో లేదో తెలియదు. నేనొక అమ్మను. నా బిడ్డను, నా తలిదండ్రుల్లాంటి నా మన్యం ప్రజలను కాపాడుకోవడానికే నిన్ను చంపాలనుకున్నాను. కానీ చంపలేకపోతున్నాను. పులివైనా నువ్వు తల్లివే కదా! నీ బిడ్డలకు నిన్ను దూరం చేయలేను. వెళ్ళు.. పారిపో! ఈ రాజమ్మకు దొరకనంత దూరం వెళ్ళిపో’ అని చెప్పి లేచింది రాజమ్మ.

మన్యం ప్రజలు భయంగా చూస్తున్నారు రాజమ్మ ఏం చేస్తుందో అర్థం కాక. ఆమె చేతులు పైకి లేపి మన్యం ప్రజలను వారించింది. 
పులి లేచింది. రాజమ్మ వైపు చూసింది. పులి కళ్లలో కృతజ్ఞతాభావం. తన బిడ్డలున్న అడవి వైపు పరుగెత్తింది. అభయారణ్యంలోకి వెళ్ళిన ఆ పులి తిరిగి ఎప్పుడూ జనారణ్యంలోకి రాలేదు.

రాజమ్మ ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల్లో సగం  తన బిడ్డ ఆపరేషన్‌ కు ఖర్చు చేసి, మిగితా సగం మన్యం ప్రజల బాగుకోసం ఇచ్చేసింది. 
రాజమ్మ మన్యంలో తిరుగుతుంటే  పులి తిరుగుతున్నట్టే ఉంది. తమను కాపాడే పులి. మన దేశం గర్వించే జాతీయ చిహ్నంలా.
- విజయార్కె

చదవండి: ఈవారం కథ: సార్థకత 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు