Interesting Facts: ఆడ దోమలే ఎందుకు కుడతాయి.. వాళ్లను ప్రేమిస్తాయి!

3 Sep, 2021 13:50 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

దోమలను ఇలా నివారిద్దాం...

దోమ కాటు బారిన పడకుండా ఉండాలంటే, మన నివాసాలకు దగ్గరలో వాటి ఆవాసాలు లేకుండా జాగ్రత్త పడాలి. అలాగే దోమలు ఇంట్లో తిరగకుండా పరిశుభ్ర వాతావరణం కల్పించుకోవాలి. చికిత్స కన్నా నివారణే ఉత్తమమని గుర్తించాలి. దోమ కాటు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు...

ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ చేరకుండా జాగ్రత్త పడాలి. నిల్వ నీటిలో దోమలు గుడ్లు పెడతాయి. ఎక్కడైనా నీరు నిలిచినట్లు ఉంటే దాన్ని శుభ్రం చేయడం లేదా ఆ నీటిలో కాస్త కిరోసిన్‌  వేయడం ద్వారా దోమలు చేరకుండా చూడొచ్చు. అలాగే మురికి నీటిలో నడవడం కూడా మంచిది కాదు.
ఇంట్లో పగిలిన కిటికీలు, ద్వారాలు సరిచేయించడం, కిటికీలకు, ద్వారాలకు తెరలను అమర్చడం మంచిది. రిపెల్లెంట్లు, దోమల బ్యాట్‌లు చాలా వరకు దోమల నివారణకు ఉపయోగపడతాయి.
బెడ్‌పై దుప్పట్లు దిండ్లు ఇష్టారీతిన ఉంచకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. దోమతెరను వాడడం అత్యుత్తమ నివారణా మార్గం.
ఆరుబయట సాయంకాలాలు, ఉదయాలు అచ్ఛాదన లేకుండా తిరగవద్దు. ఈ సమయంలో దోమకాటు ప్రమాదకరం. మిగిలిన సమయాల్లో కూడా శరీరమంతా కప్పే దుస్తులు వాడడం వల్ల దోమకాటునుంచి కాపాడుకోవచ్చు. 
శరీరంలో సరైన ఇమ్యూనిటీ పెంచుకోవడం మంచిది. ఇందుకోసం సమతుల ఆహారం, నియమిత వ్యాయామం అవసరం. వీలైనంత ఎక్కువగా ద్రవరూప ఆహార పదార్ధాలు తీసుకోవాలి. నిల్వ ఆహారానికి దూరంగా ఉండాలి. 
కొన్ని రకాల వ్యాధులకు టీకాలున్నాయి. అవసరమనుకుంటే ఈ వ్యాక్సినేషన్‌ ఉపయోగపడుతుంది. 
శరీరంలో ఏదైనా అనారోగ్య చిహ్నాలు కనిపిస్తే వీలైనంత త్వరగా డాక్టర్‌ను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించాలి. అశ్రద్ధ ప్రమాదకరం. 

దద్దుర్లు.. దురద
దోమ కుట్టగానే వెంటనే మనకు తెలియదు. ఎందుకంటే దోమ విడుదల  చేసే ఒక రసాయనం మనకు నొప్పి, జిల తెలియకుండా అవి రక్తం పీల్చేందుకు  సాయం చేస్తాయి. అయితే దోమలు కుట్టిన కొద్ది సేపటికి బెందులు(దద్దుర్లు)  రావడం జరుగుతుంది, అలాగే జిల కూడా ఆరంభమవుతుంది. దోమ లాలాజలంలో ఉండే యాంటీ కోయాగ్యులెంట్‌(రక్తం గడ్డ కుండా ఉంచే రసాయనం) వల్ల ఈ రియాక్షన్లు వస్తాయి. వీటిని గీరిన కొద్దీ పెద్దవి అవుతుంటాయి.

ఈ దద్దుర్లు, దురద నివారణకు కొన్ని మార్గాలు..
యాంటీ హిస్టమైన్‌  క్రీమ్‌ లేదా అలెర్జీ నివారణ ఆయింట్‌మెంట్‌ పూయవచ్చు. ఇవి లేనప్పుడు గ్రీన్‌ టీ బ్యాగును తడిపి కుట్టిన చోట ఉంచడం వల్ల రిలీఫ్‌ వస్తుంది. ∙ దద్దుర్ల ద్వారా వచ్చే దురద నివారణకు తేన అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే అలోవీరా జెల్‌ కూడా దురద నివారణకు ఉపయోగపడుతుంది. ∙ తులసి ఆకుల రసం దద్దుర్లను నయం చేయడం, దురదను తగ్గించడమే కాకుండా దోమలు దరి చేరకుండా రక్షణనిస్తుంది.

లాంవడర్‌ పుష్పాల ద్వారా వచ్చే ఆయిల్‌ దోమలను తరిమివేస్తుంది. అలాగే యాంటీ బ్యాక్టీరియల్‌ రక్షణ ఇస్తుంది. చర్మానికి కూడా మంచిది. ∙ లెమన్‌  యూకలిప్టస్‌ ఆయిల్, గ్రీక్‌ కాట్నిప్‌ ఆయిల్‌ సైతం దోమలను తరిమి వేయడంలో, దురద నివారించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ∙ పైవేవీ దొరక్కపోతే వెనిగర్, వంట సోడా, వెల్లుల్లి, టూత్‌పేస్టును ట్రై చేయవచ్చు. వీటివల్ల దురద తగ్గుముఖం పడుతుంది. 

ఆడ దోమలే ఎందుకు కుడతాయి..
దోమల్లో మగదోమలు మనిషిని కుట్టవు. ఇవి సాధారణంగా చెట్ల రసాలపై ఆధారపడి జీవిస్తాయి. ఆడదోమల్లోనే మనిషిని కుట్టేందుకు అవసరమైన ముఖ విన్యాసం ఉంటుంది. అందువల్ల ఇవే మనిషి రక్తాన్ని పీలుస్తాయి. అట్లాగని రక్తం వీటి ఆహారం అనుకోవద్దు. కేవలం గుడ్లు పెట్టడానికి అవసరమైన ప్రొటీన్‌  దోమలకు మనిషి రక్తం ద్వారా లభిస్తుంది. దీనికోసమే అవి మనుషులను కుడతాయి. కుట్టి ఊరుకోకుండా పలు వ్యాధులను వ్యాపింపజేస్తాయి. అలాగే దోమలన్నీ ప్రమాదకారులు కాకపోవచ్చు. కొన్ని ప్రజాతులు మాత్రమే ప్రమాదకర వ్యాధులను వ్యాప్తి చేస్తాయి. ముఖ్యంగా క్యూలెక్స్, అనాఫిలస్, ఏడిస్‌ జాతుల దోమల కాటు వల్ల పలు డేంజరస్‌ వ్యాధులు సంక్రమిస్తుంటాయి. 

కొందరికే ప్రత్యేకం?
మనుషుల్లో కొందరు మిగిలినవారి కన్నా ఎక్కువగా దోమలను ఆకర్షిస్తారని, అందువల్ల వీరినే ఎక్కువగా కుడతాయని పరిశోధనలు చెబుతున్నాయి. కొందరి శరీరాల జోలికి పొమ్మన్నా దోమలు పోవు. ఈ వ్యత్యాసానికి కారణాలేంటి అంటే దోమల్లో ఉండే ఘ్రాణ శక్తి అని చెప్పవచ్చు. దోమలకు కార్బన్‌ డై ఆక్సైడ్‌(సీఓ2) ఇష్టం. అందువల్ల ఎక్కువ సీఓ2 వదిలేవాళ్ల చుట్టూ ఎక్కువగా దోమలు మూగుతాయి. అంటే అధికంగా పనిచేసేవాళ్లు, వర్కౌట్లు చేసేవాళ్లకు దోమకాటు అవకాశాలు ఎక్కువ. అలాగే శరీరం నుంచి ఎక్కువ వేడి ఉత్పత్తి చేసేవాళ్లను కూడా దోమలు ఇష్టపడతాయి. ఉదాహరణకు గర్భిణీ స్త్రీలు. అలాగే శ్వాసలో లాక్టిక్‌ ఆసిడ్‌ వాసన ఉన్నవాళ్లను కూడా దోమలు ప్రేమిస్తాయి. 

రిపెల్లెంట్లు ఎంత సేఫ్‌?
ఆధునిక యుగంలో దోమల నుంచి కాపాడటానికి పలు రకాల రిపెల్లెంట్లు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని రిపెల్లెంట్లను అగ్గిపుల్లతో వెలిగించి వాడాలి, కొన్నింటిని కరెంట్‌ ద్వారా వాడవచ్చు. వీటి ద్వారా విడుదలయ్యే రసాయనాలు దోమలను తరిమి కొడతాయి. అయితే అన్ని రకాల రిపెల్లెంట్లు మనిషికి మంచివి కావు. వీటివల్ల కొన్ని సమస్యలు కూడా వస్తాయి. శ్వాస సంబంధమైన సమస్యలు, కళ్లు ఎర్రబారడం, జలుబు, దగ్గు, ఆస్తమా వంటి సమస్యలు రిపెల్లెంట్ల కారణంగా వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల కెమికల్‌ రిపెల్లెంట్లను వాడే బదులు సహజసిద్ధమైన రిపెల్లెంట్లు లేదా ఎలక్ట్రానిక్‌ తరంగాలు ఉత్పత్తిచేసే రిపెల్లెంట్లను వాడడం మంచిదని సిఫార్సు చేస్తున్నారు.
-డి. శాయి ప్రమోద్‌ 

చదవండి: Mosquitoes: బోదకాలు, చికున్‌ గున్యా, కాలా అజర్‌.. ఇంకా

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు