Makhana Panjiri: పాలిచ్చే తల్లికి తగిన శక్తినిచ్చే ఆహారం.. తామర గింజలతో పాంజిరి

18 Nov, 2022 11:54 IST|Sakshi

శీతాకాలం పగలు తక్కువ.. రాత్రి ఎక్కువ. రాత్రి వేళల్లో చలి ఎక్కువ. భోజనం బరువుగా ఉండకూడదు. అలాగని తక్కువ తింటే పోషకాలందవు. కొద్దిగా తిన్నా సరే... అది సమతులంగా ఉండాలి. ఆహారాన్ని దేహం వెచ్చగా ఒంటబట్టించుకోవాలి. అందుకే... ఇది ట్రై చేసి చూడండి.

పాంజిరి 
కావలసినవి:
►సన్నగా తరిగిన బాదం – కప్పు
►యాలకుల పొడి – ఒకటిన్నర టీ స్పూన్‌లు
►దోస గింజలు – పావు కప్పు
►తర్బూజ గింజలు – పావు కప్పు
►పిస్తా పప్పు – పావు కప్పు (తరగాలి)

►వాము – అర టీ స్పూన్‌
►ఎండు కొబ్బరి తురుము – కప్పు
►అల్లం తరుగు లేదా శొంఠి పొడి– 2 టేబుల్‌ స్పూన్‌లు
►జీడిపప్పు– కప్పు (చిన్న పలుకులు)

►తామరగింజలు – కప్పు
►వాల్‌నట్‌ తురుము – 3 టేబుల్‌ స్పూన్‌లు
►కిస్‌మిస్‌ – 3 టేబుల్‌ స్పూన్‌లు
►నెయ్యి– 3 టేబుల్‌ స్పూన్‌లు.

ప్రధానమైన పదార్థాలు:
►సూజీ రవ్వ – కప్పు
►నెయ్యి – ఒకటిన్నర కప్పు
►గోధుమ పిండి – రెండున్నర కప్పులు
►బెల్లం పొడి – ఒకటిన్నర కప్పు.

తయారీ:
►మందంగా ఉన్న బాణలిలో నెయ్యి వేడి చేసి తామర గింజలు (మఖానియా) వేయించాలి.
►వాటిని తీసి పక్కన పెట్టుకుని అదే బాణలిలో జీడిపప్పు, వాల్‌నట్, బాదం, తర్బూజ, దోసగింజలు, పిస్తా, కొబ్బరి తురుము, కిస్‌మిస్‌ వేసి సన్నమంట మీద దోరగా వేయించాలి.
►ఇందులో అల్లం తరుగు లేదా శొంఠి, వాము, యాలకుల పొడి కలిపి పక్కన ఉంచాలి.

►ఇప్పుడు ప్రధాన దినుసులను వేయించాలి.
►మరొక బాణలిలో నెయ్యి వేడి చేసి గోధుమ పిండి వేసి సన్నమంట మీద వేయించాలి.
►గోధుమ పిండి వేగి మంచి వాసన వస్తున్న సమయంలో సూజీ రవ్వ వేసి కలుపుతూ వేయించాలి.

►రవ్వ కూడా దోరగా వేగిన తర్వాత బెల్లం పొడి వేసి కలపాలి.
►ఇందులో ముందుగా వేయించి సిద్ధంగా ఉంచిన గింజల మిశ్రమాన్ని వేసి కలిపితే పాంజిరి రెడీ.
►దీనిని కప్పులో వేసుకుని పొడిగా స్పూన్‌తో తినవచ్చు.

పాలిచ్చే తల్లులకు ప్రయోజనకరం
►పిల్లలు కింద పోసుకోకుండా మొత్తం తినాలంటే మరికొంత నెయ్యి వేసుకుని లడ్డు చేయాలి.
►ఇది ఉత్తరభారతదేశంలో బాలింతకు తప్పనిసరిగా పెట్టే స్వీట్‌.
►పాలిచ్చే తల్లికి తగిన శక్తినిచ్చే ఆహారం. 

చదవండి: Kismis Doughnuts: మైదాపిండి, పంచదార..  కిస్మిస్‌ డోనట్స్‌ తయారు చేసుకోండిలా!
Amla Candy: ఆరోగ్య లాభాలెన్నో.. ఇంట్లోనే ఇలా ఆమ్ల క్యాండీ తయారీ
Nuvvula Annam: చిన్నా పెద్దా లొట్టలేసుకుంటూ తినేలా నువ్వుల అన్నం తయారీ ఇలా

మరిన్ని వార్తలు