అన్నంలోకి నిమిషాల్లో రుచులు

10 Dec, 2023 05:10 IST|Sakshi

ఇంట్లో పేరెంట్స్‌ లేని సమయంలో సింపుల్‌గా చేసుకునే కొన్ని వెరైటీలను చూద్దామిప్పుడు. మ్యాగీ, పాస్తా, శాండ్విచ్, చాకోస్‌ వంటివన్నీ పిల్లలు.. చిటికెలో చేసుకుని, తినగలిగినవే. నిజానికి ఇదివరకటి పిల్లలైతే అటుకులు, మరమరాలు వంటివి ఇంట్లో ఉంటే చాలు.. వాటితో ఎన్నో వెరైటీలను ఇట్టే చేసుకునేవారు.అటుకులు, బెల్లం కోరు, శనగపప్పు, కొబ్బరికోరు కలుపుకొని తింటే... బలమే కాదు చాలాసేపటి వరకు ఆకలినీ ఆపుతుంది.  

బెల్లం పాలు కాచుకుని అటుకులు వేసుకుని తినడం, లేదంటే అటుకుల్లో కాస్త ఉప్పు, కారం వేసి దోరగా వేయించుకోవడం వంటివి చిటికెలో చేసుకోవచ్చు. ఇక మరమరాలు తడిపి.. ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తురుము, టొమాటో ముక్కలు వంటివి వేసి క్షణాల్లో రుచికరమైన స్నాక్‌ని రెడీ చేసుకోవచ్చు.

3 నిమిషాల్లో మజ్జిగ చారు
కావాల్సినవి:  పెరుగు – పావు కప్పు (కొద్దిగా నీళ్లు పోసుకుని.. పలుచగా చేసుకోవాలి) ఉల్లిపాయ ముక్కలు – టేబుల్‌ స్పూన్, కరివేపాకు, కొత్తిమీర – కొద్దికొద్దిగా, ఉప్పు – కొద్దిగా, నూనె – 2 టేబుల్‌ స్పూన్లు ఎండుమిర్చి – 2 (ముక్కలు చేసుకోవాలి), పసుపు – పావు టీ స్పూన్‌
ఆవాలు, పచ్చి శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, అల్లం తురుము – కొద్దికొద్దిగా..
తయారీ: ముందు కళాయిలో నూనె వేసుకుని.. అందులో ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. దానిలో ఉప్పు వేసుకుని, ఎండుమిర్చి ముక్కలు, అల్లం తురుము, పసుపు వేసుకుని తిప్పుకోవాలి. ఇప్పుడు ఆ తాలింపు మిశ్రమాన్ని పలుచగా చేసుకున్న పెరుగులో కలిపి బాగా తిప్పాలి. అందులో కొత్తిమీర తురుము కూడా వేసుకుని అన్నంలోకి తింటే అదిరిపోతుంది. తాలింపు వేసే సమయంలో, వేడి పాత్రను పట్టుకునేప్పుడు జాగ్రత్తలు అవసరం.

5 నిమిషాల పచ్చడి 
కావాల్సినవి: పచ్చిమిర్చి – 5, చింతపండు – అర నిమ్మకాయ సైజ్‌ (గింజలు లేకుండా తీసి, కడిగి, నానబెట్టుకోవాలి), కరివేపాకు – 2 రెమ్మలు, జీలకర్ర – అర టీ స్పూన్, ఉప్పు – కొద్దిగా, ఉల్లిపాయ – చిన్నది (నాలుగైదు ముక్కలు చేసుకోవాలి), నూనె – 1 టీ స్పూన్‌ (కాచాల్సిన పనిలేదు)
తయారీ: పచ్చిమిర్చి, చింతపండు, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు వేసుకుని కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకుని.. దానిలో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని, మరోసారి మిక్సీలో కచ్చాబిచ్చాగా గ్రైండ్‌ చేసుకుని..  కొత్తిమీర తురుము, నూనె వేసుకుని, వేడి వేడి అన్నంతో తింటే సూపర్బ్‌గా ఉంటుంది. ఇంట్లో ఏం లేనప్పుడు.. పెద్దలు అందుబాటులో లేనప్పుడు, అత్యవసర పరిస్థితుల్లో ఈ పచ్చడి చేసుకోవచ్చు. 

10 నిమిషాల లోపు కర్రీ
కావాల్సినవి: ఉల్లిపాయ–1(చిన్నగా తరగాలి), టొమాటోలు – 6 (చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి), పచ్చిమిర్చి – 2, ఉప్పు – సరిపడా, అల్లం– వెల్లుల్లి పేస్ట్‌ – అర టీ స్పూన్‌ పైనే, కారం – 2 టీ స్పూన్, ధనియాల పొడి, గరం మసాలా – 1 టీ స్పూన్‌  చొప్పున, నూనె – 2 టేబుల్‌ స్పూన్లు పైనే..
తయారీ: ముందుగా చిన్న కుకర్‌లో నూనె వేసుకుని ఉల్లిపాయలు వేగించుకుని.. టొమాటో ముక్కలు వేసి నిమిషం పాటు మగ్గనివ్వాలి. ఆ తర్వాత అల్లం–వెల్లుల్లి పేస్ట్‌ వేసి మరో నిమిషం మగ్గించుకోవాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ వేసి గ్లాసున్నర వాటర్‌ పోసి.. మూతపెట్టి, మూడు విజిల్స్‌ వచ్చేవరకు ఉంచాలి.

ఈ ప్రాసెస్‌ మొత్తం ఐదు నిమిషాల్లో పూర్తి అవుతుంది. కాస్త చల్లారాక.. మూత ఓపెన్‌ చేసి.. అందులో కరివేపాకు వేసుకుని, ఇంకాస్త గ్రేవీలా అయ్యేందుకు..  చిన్నమంటపై కాసేపు మగ్గించుకోవచ్చు. ఆ సమయంలో గరిటెతో ఇంకాస్త మెత్తగా చేసుకోవచ్చు. చివర్లో కొత్తిమీర తురుము వేసుకుని.. బాగా కలిపి స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవచ్చు. ఇదే మాదిరి టొమాటో ముక్కల బదులు బంగాళదుంప ముక్కలు, ఆనపకాయ ముక్కలు ఇలా చాలా కూరగాయలతోనూ ఈ వంటకాన్ని చేసుకోవచ్చు.

>
మరిన్ని వార్తలు