కర్ణాటకం కోసం బీజేపీ కసరత్తు

31 Jul, 2021 00:18 IST|Sakshi

కర్ణాటక మంత్రివర్గ కూర్పుపై ముఖ్యమంత్రి బసవ రాజ బొమ్మైతో పాటు బీజేపీ హైకమాండ్‌  కసరత్తు చేస్తోంది. బసవరాజ్‌ పేరుకు ముఖ్యమంత్రి అయినా కేబినెట్‌లోకి ఎవరిని తీసుకోవాలనే దానిపై ఆయన కున్న అధికారం తక్కువ. పార్టీ ఢిల్లీ పెద్దలే మంత్రుల ఎంపికలో కీలకపాత్ర వహిస్తారు. ఈ పరిస్థితిని నిశి తంగా పరిశీలించిన వారికి ఇందిర హయాంలో కాంగ్రెస్‌ రాజకీయాలు గుర్తుకురాక మానవు.

కర్ణాటకలో కొత్త తరం నాయకులను ప్రోత్సహిం చాలని బీజేపీ హైకమాండ్‌ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హిందూత్వ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండటం, కనీసం మూడు దఫాలు ఎమ్మె ల్యేగా ఎన్నికవడాన్ని ప్రాతిపదికలుగా తీసుకుంటు న్నట్లు బెంగళూరు రాజకీయ వర్గాల కథనం. ఈ నేప థ్యంలో యడ్యూరప్ప కేబినెట్‌లో పనిచేసిన చాలా మందికి మంత్రి పదవులు దక్కే అవకాశాలు కనిపిం చడం లేదు. అయితే యడియూరప్ప రాజీనామా తరు వాత ముఖ్యమంత్రి పదవిని ఆశించిన అరవింద్‌ బెల్లాడ్, బీపీ యత్నాల్‌కు తప్పకుండా చోటు దొరుకు తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సంఘ్‌ పరివార్‌కు సన్నిహితుడైన సురేష్‌ కుమార్, యడ్యూరప్ప శిబిరం నుంచి అశోక్‌కు మంత్రి పదవులు ఖాయమన్న వార్తలు  వినిపిస్తున్నాయి. 

బసవరాజ బొమ్మై ప్రమాణస్వీకారం చేశారో లేదో మాజీ ముఖ్యమంత్రి జగదీశ్‌ సెట్టార్‌   నిరసన గళం వినిపించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ కేబి నెట్‌లో చేరే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. 2012లోనే ముఖ్యమంత్రిగా పనిచేసిన చరిత్ర జగదీశ్‌ది. అయితే 2019లో ఏర్పడ్డ యడియూరప్ప కేబినెట్‌లో ఎలాంటి భేషజాలకు పోకుండా పనిచేశారు. యడియూరప్ప తనకంటే వయసులోనూ, రాజకీయంగానూ సీనియర్‌ కావడంతో ఆయన కేబినెట్‌లో ఉన్నానన్నారు. బసవ రాజతో తనకెలాంటి గొడవలూ లేవనీ, ఆత్మ గౌర వాన్ని కాపాడుకోవడానికే తనకు సబ్‌ జూనియర్‌ అయిన బసవరాజ మంత్రివర్గంలో చేరదలుచుకోలే దనీ స్పష్టత ఇచ్చారు.

ఇదిలావుంటే, బసవరాజ ప్రమాణ స్వీకారానికి బళ్లారి నేత బి. శ్రీరాములు డుమ్మా కొట్టారు. ఆయన్ని కొంతకాలంగా ఢిల్లీ పెద్దలు దూరం పెడుతున్నారు. దీంతో ఆయన కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. సుష్మా స్వరాజ్‌ చనిపోయిన తరువాత శ్రీరాములు రాజకీయ జీవితం దాదాపుగా మసక బారిందనే చెప్పవచ్చు. ఇక సీనియర్‌ నేత కేఎస్‌ ఈశ్వరప్ప ఉపముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నారు. చాలా మంది మఠాధిపతులు తనను ఉప ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారని మనసులోని మాటను బయటపెట్టారు. అయితే బీజేపీలాంటి సైద్ధాంతిక పార్టీలో ఇలాంటి బెదిరింపులు ఎవరూ పట్టించుకోరు. 

యడియూరప్ప మీద నమ్మకంతోనో, పదవులకు ఆశపడో గతంలో కాంగ్రెస్, జేడీ (ఎస్‌) నుంచి 17 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. వారికి యడి యూరప్ప మంచి పదవులే కట్టబెట్టారు. ఇప్పుడు దళపతి మారడంతో తమ పరిస్థితి ఏమిటని వారు ఆందోళన పడుతున్నారు. అయితే వీరిని దూరం చేసు కుంటే ప్రభుత్వ మనుగడకే ప్రమాదం ఏర్పడవచ్చు. అసెంబ్లీలో మేజిక్‌ ఫిగర్‌ కంటే కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఎక్కువున్నారు. అంటే ఏడు గురు ఎమ్మెల్యేలు ప్లేటు ఫిరాయిస్తే బసవరాజ సర్కార్‌ పడి పోవడం ఖాయం. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మె ల్యేలకు ఎలాంటి అన్యాయం జరగదని తాను భావి స్తున్నట్లు మాజీ మంత్రి బీసీ పాటిల్‌ అన్నారు. ఏమైనా ఎవరినీ నారాజ్‌ చేయకుండా అడుగులు వేస్తోంది  బీజేపీ. 

బసవరాజ టీమ్‌తోనే 2023 అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలన్నది బీజేపీ పెద్దల ఆలోచనగా తెలుస్తోంది. కర్ణాటకలో పార్టీ బలోపేతానికి యడియూరప్ప పునా దులు తవ్విన విషయాన్ని ఎవరూ కాదనలేరు. అయితే కొంతకాలంగా ఆయన పాలన గాడి తప్పిందన్న విమ ర్శలున్నాయి. యంత్రాంగంలో అవినీతి పెరిగింది. ప్రభుత్వ వ్యవహారాల్లో యడియూరప్ప పుత్రరత్నం జోక్యం పెరగడంతో బీజేపీ ఇమేజ్‌ డ్యామేజ్‌ అయింది. అలాగే కోవిడ్‌ను కట్టడి చేసే విషయంలోనూ యడియూరప్ప సర్కార్‌ విఫలం అయిందన్న విమర్శలు న్నాయి. దీంతో పాతవారిని పక్కనపెట్టి ప్రజలకు కొత్త నాయకత్వాన్ని పరిచయం చేయాలని బీజేపీ నిర్ణయిం చుకున్నట్లు రాజకీయవర్గాల మాట. 

ఎస్‌. అబ్దుల్‌ ఖాలిక్‌
సీనియర్‌ జర్నలిస్ట్‌ ‘ మొబైల్‌ : 87909 99335 

మరిన్ని వార్తలు