చట్టాలకు దారిదీపాలు సంస్కర్తలే!

6 Jul, 2021 00:29 IST|Sakshi

రెండో మాట

టెక్నాలజీ తనతోనే పుట్టిందనుకునే భ్రమలో జీవిస్తూ, టెక్నాలజీని రాజకీయ ప్రత్యర్థులపై ప్రయోగించడం ద్వారా లబ్ధి పొందజూసే చంద్రబాబుకి ఓ పెద్ద ధర్మసందేహం వచ్చి –‘‘అసలు దిశ చట్టమే లేదు, మొబైల్‌ ‘యాప్‌’ను ఎలా అప్లై చేస్తారని’’ ఓ కొంటె ప్రశ్న వేశాడు! దారుణమైన వివక్ష ఫలితంగా  అసంఖ్యాక దళిత బహుజనులు సాంఘిక, ఆర్థిక దోపిడీని ఎదిరించి గుండె ధైర్యంతో జీవనాన్ని సాగించడానికి వీలు కల్పించిన సంస్కర్తల కృషి లేకుండా చట్టాలు... చట్టాలు వచ్చేదాకా సంస్కర్తలు, సంస్కరణాభిలాషులూ ఆగరు. రాష్ట్ర పురాచరిత్రలో ప్రజా జీవనాన్ని మెరుగుపర్చడానికి చట్టాలకు దారి దీపాలుగా ఉన్నవారు సంఘ సంస్కర్తలేనని వారి కృషి ఫలితంగానే ఆ మాత్రం చట్టాలైనా చూడగల్గుతున్నామని మరచిపోరాదు.

‘ఉలిపికట్టె (మూర్ఖుడు) కేలరా ఊళ్లో పెత్త నాలు’ అని మన పల్లెటూళ్లలో ఒక ముతక సామెత! వెనకటికొకడు చెడి చెన్నపట్నం చేరుకున్నట్టుగానే చంద్ర బాబు కూడా పదవీభ్రష్టుడై అమరావతిలో నిలవలేక హైదరాబాద్‌లో తలదాచుకుంటున్నది చాలక– ఆంధ్రప్రదేశ్‌ విభజనకు తేలు కుట్టిన దొంగలా రహస్యంగా సంతకాలు చేసి వచ్చిన తరువాత ఆడుతున్న నాటకాలను తెలుగు ప్రజలు మరిచిపోలేదు, మరిచిపోరు! అఖండ మెజారిటీతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ను, దాని యువ నాయకుడు జగన్‌ మోహన్‌రెడ్డిని 2019 జనరల్‌ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు గెలిపించింది మొదలు చంద్రబాబు, మిగిలిన అతని ‘డూడూ బస వన్నలూ’ ఆడుతున్న అబద్ధాలు అన్నీ ఇన్నీ కావు. 

పైగా సామాజిక రంగంలో సంస్కరణలకు, చట్టాలకు మధ్య తేడా కూడా తెలియకుండా మాట్లాడుతున్నాడు బాబు! ఈ మధ్య ఆంధ్రప్రదేశ్‌లో మహిళల భద్రతకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, ‘దిశ’ పేరిటనే ప్రత్యేక బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టి రాష్ట్ర పరిధిలోనే చట్టం రూపొందించి అమలు జరపడానికి సర్వప్రయత్నాలు చేస్తు న్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర సచివాలయ, గ్రామ సచివాలయాలు కేంద్రంగా అధికారుల స్థాయిలోనూ, వలంటీర్ల వ్యవస్థ కేంద్ర బిందు వుగానూ మహిళలకు అవగాహనా సదస్సులు నిర్వహించడమే గాక ఆధునిక టెక్నాలజీ ఆసరాగా ‘యాప్‌’ ఆధారంగా తమకు ఇబ్బంది ఎదురైనప్పుడు నిమిషాల మీద పోలీసు యంత్రాంగాన్ని కదిలించి రంగంలోకి దించడం ద్వారా మహిళలు తక్షణ రక్షణ పొందేందుకు సకల ఏర్పాట్లు జరిగాయి, ఇంకా జరుగుతున్నాయి. మహిళా లోకం నిర్భయంగా ఉండగల పరిస్థితుల్ని కల్పిస్తున్నారు. 

కానీ టెక్నాలజీ తనతోనే పుట్టిందనుకునే భ్రమలో జీవిస్తూ టెక్నా లజీని రాజకీయ ప్రత్యర్థులపై ప్రయోగించడం ద్వారా లబ్ధి పొంద  జూసే చంద్రబాబుకి ఓ పెద్ద ధర్మసందేహం వచ్చి–‘‘అసలు చట్టమే లేదు, మొబైల్‌ ‘యాప్‌’ను ఎలా అప్లై చేస్తారని’’ ఓ కొంటె ప్రశ్న వేశాడు! అతని ఉద్దేశంలో రాష్ట్రపతి సంతకం, కేంద్రం అనుమతి ఉంటే కదా రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని అమలు పర్చగలిగేది, అందుకే రాష్ట్ర చట్టం ‘నాలుక గీసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది, కాబట్టి అమలు జరగదు’ అని మహిళల్లో ఒక అనుమాన బీజం నాట డానికి ప్రయత్నించాడు బాబు! అంతేగాదు, ఇటీవల ముమ్మరించిన ‘కోవిడ్‌–19’ (కరోనా) వైరస్‌ ప్రభావానికి ఆంధ్రప్రదేశ్‌లో ఎంత మంది మరణిస్తే టీడీపీ నాయకుల ‘కడుపు చల్లబడుతుందో’ చంద్ర బాబుకు ఊరట కలుగుతుందో మనకు తెలియదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో ‘కరోనా’ వల్ల చనిపోయిన వారు కనీసం ‘లక్షా 30 వేల మంది ఉండాలి’ అని టీడీపీ ‘గణాంక అధికారి’ హోదాలో బాబు ఓ ప్రకటనే విడుదల చేయడం మరీ ఆశ్చర్యకరం! ‘పిట్ట’కు అసూయ ఉంటుందని భావించలేం గానీ, అశుభంగా వినిపించే గొంతుకు మారుపేరుగా మనవాళ్లు ‘తీతువు’ (ఊడూ) పిట్టను పేర్కొంటూం టారు. అలాంటి గొంతు, చూపూ బాబుది! 

ఇదంతా ఎందుకు చెప్పవలిసి వస్తోందంటే సామాజిక రుగ్మత లను, వాటి వల్ల వచ్చే అనర్థాలను ఎదుర్కోడానికి,  సమాజంలో దారుణమైన వివక్ష ఫలితంగా  అసంఖ్యాక దళిత బహుజనులను సాంఘిక, ఆర్థిక దోపిడీని ఎదిరించి గుండె ధైర్యంతో జీవనాన్ని సాగించడానికి వీలు కల్పించిన సంస్కర్తల కృషి లేకుండా చట్టాలు రాలేదు! మరో మాటలో చెప్పాలంటే... అల్లుడు వచ్చేదాకా అమా వాస్య ఆగదు, చట్టాలు వచ్చేదాకా సంస్కర్తలు, సంస్కరణాభిలా షులూ ఆగరు. ఇంతవరకూ మన రాష్ట్ర పురాచరిత్రలో ప్రజా జీవ నాన్ని మెరుగుపర్చడానికి చట్టాలకు దారి దీపాలుగా ఉన్నవారు సంఘ సంస్కర్తలేనని వారి ఆటుపోట్ల ఫలితంగానే ఆ మాత్రమే అర కొర చట్టాలైనా చూడగల్గుతున్నామని మరచిపోరాదు. అంతే గాదు, ఏపీ ‘దిశ’ చట్టం వెలుగుచూసిన తరువాత సీఎం హోదాలో జగన్‌ అనేకసార్లు కేంద్రంలోని బీజేపీ పాలకులకు లేఖలు రాస్తూ ‘దిశ’ చట్టా నికి తక్షణం ఆమోదముద్ర వేయాలని విజ్ఞప్తులు చేసినా, బీజేపీతో బాహాటంగానూ, లోపాయికారీగానూ ఈ క్షణం దాకా సన్నిహిత సంబంధాలున్న టీడీపీ నాయకత్వం ఇంతవరకూ ‘దిశ’ చట్టానికి ఆమోదం తెలపాలని కేంద్రాన్ని ఒక్కసారైనా కోరిన దాఖలాలు లేవు. 

19వ శతాబ్దంలో సంస్కర్తల విశిష్ట లక్షణం– హిందూ సంఘ సంస్కర్తలలో ఎక్కువమంది సర్వజనులు సుఖంగా ఉండాలని కోరు కున్నవారు కాబట్టే సనాతన దృక్పథంగల వారికి నచ్చకపోవడమో, ఎదురుదాడులు చేయడమో చేస్తూ వచ్చారు. జాతీయోద్యమ దశలో సమాజ సంస్కరణల కోసం బ్రిటిష్‌ సామ్రాజ్యవాద పాలనలో గళ మెత్తి పోరాడిన మహా సంస్కర్తలందరూ సంస్కరణల కోసం పడి గాపులు పడి, చట్టాలు మారేవరకు వేచి ఉండలేదు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ 19వ శతాబ్ది పరిణామాలే. సంఘ సంస్కరణల కోసం, విద్య, ఆర్థిక సంస్కరణల కోసం, సతీసహగమనం లాంటి సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా, దళిత బహుజనుల జీవితాలలో పెను మార్పుల కోసం ఉద్యమించి మంచి ఫలితాలు సాధించినవారు ఒకరు, ఇద్దరా– సతీసహగమన ఆచారం నిర్మూలనకు, వివక్షారహిత మైన సమాజం కోసం, విద్యా రంగ సంస్కరణల కోసం– రాజా రామ్మోహన్‌రాయ్, వీరేశలింగం, చిలకమర్తి, ఈశ్వర చంద్ర విద్యా సాగర్, జ్యోతిరావ్‌ ఫూలే, సావిత్రి ఫూలే, నారాయణగురు, బసవేశ్వ రుడు, త్రిపురనేని, అంబేడ్కర్, సాహూ మహరాజ్‌ (సత్యశోధక ఉద్యమం)లు ఒక చట్టం కోసం ఎదురుచూడకుండానే సాగించిన ఉద్యమాలు, మహాప్రారంభాలు ఎన్నెన్నో. వేదకాలంలోని సర్వ చాద స్తాలకు కారకులు కొలదిమందే. కానీ, తొలి వేదకాలంలో సతీసహగ మనం లేదు, బాల్య వివాహాలు లేవు, కులవ్యవస్థ, నాలుగు వర్ణాల కృత్రిమ విభజనా లేదన్నది పండితుల అభిప్రాయం. 

ఆ మాటకొస్తే– అశ్వఘోష్‌ ‘వజ్రశుచి’ ఉపనిషత్‌ ఈనాటిది కాదు, 9వ శతాబ్ది నాటిది. చివరికి భక్త తుకారామ్, అతని శిష్యుడు బహినాబాయ్, కలిగోపీనాథ్‌ వగైరా 18వ శతాబ్ది భక్త కవుల రచనలపైనా ‘వజ్రశుచి’ ప్రభావం ఉందంటారు పరిశోధకులు. దళిత వర్గానికి చెందిన ‘గురవ’ (మహారాష్ట్ర)ను కూడా బౌద్ధుడైన అశ్వ ఘోషుని ‘వజ్రశుచి’ హేతువాదం ప్రభావితం చేసింది. కానీ ఈ ప్రస్తా వనలు, పాఠాలు చంద్రబాబుకి అనవసరం. ఎందుకంటే– చరిత్ర అంటే ఆయనకి ‘ఎలర్జీ’ కనుకనే పాఠ్యగ్రంథాల నుంచి చరిత్ర పాఠాల్ని తీసి పారేయమని, తన తొలి హయాంలోనే అధికారుల్ని ఆదే శించాడు. ఎందుకంటే, మన వికృత చేష్టలన్నింటికీ ప్రాతినిధ్యం వహించిన దేశదేశాల దుష్ట పాలకులు చరిత్ర పాఠాలలో తరచుగా తారసిల్లుతూ ఉంటారు కాబట్టి. అర్ధంతరంగా కోటీశ్వరుడైన తన ఆత్మీయ పత్రిక అధినేత ఫలానా ‘ఎన్టీఆర్‌ ఫొటో ఇంక మన కెందుకు. దాన్ని పార్టీ బ్యానర్‌ నుంచి తొలగించి పారేయమని సలహా ఇస్తున్న వీడియో దృశ్యం వైరల్‌ అయి తెలుగులోకమంతా ‘గుప్‌’ మనడం అందుకు బాబు ‘గప్‌ చిప్‌’ కావడం దాచలేని బహిరంగ రహస్యం అయిపోయింది. బాబు అంత తెలివి తక్కువవాడా, ‘ఎన్టీఆర్‌ బొమ్మను అలా ఉంచే... నాటకం ఆడాల’న్నది అతని వ్యూహం.

మరోవైపున రాష్ట్ర ప్రజల సమ్మతితో అఖండ మెజారిటీతో ఎన్నికై ఆ ప్రజల సంక్షేమం కోసం రెండేళ్ల క్రితం ప్రారంభించిన సంక్షేమ పథ కాలను తు.చ. తప్పకుండా–ఇచ్చిన హామీలనే కాదు, ప్రకటించని పెక్కు సంస్కరణలను సహితం అమలుచేస్తున్న వైఎస్‌ జగన్‌ ముందుకుదూసుకు పోగలరన్న భరోసా ప్రజలకూ ఉండటం సహజం. ఆయన ఆసాంతం జయప్రదం కావాలని కోరుకుందాం. ఎదుటివాడి అసూయకు కావలసింది బలం కాదు, దౌర్బల్యం. ఎలా గంటే, అసూయ పొరుగింటి గుర్రాన్ని గాడిద అనిపిస్తుందట!


ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు