సమానత్వ సాధన మరిచిన బడ్జెట్‌

2 Feb, 2021 01:28 IST|Sakshi

రెండో మాట

ఆదాయాల్లో అసమానతలను కనిష్ట స్థాయికి తగ్గించి వేయాలని, హోదాలో అసమానతలు తొలగించి, ప్రతిపత్తిలో తగిన సానుకూల సౌకర్యాలు, అవకాశాలు కల్పించాలని, ఇవి వ్యక్తుల స్థాయిలోనే కాక వివిధ ప్రాంతాల్లో నివసించే ప్రజలమధ్య, వివిధ వ్యాపకాల్లో ఉన్న ప్రజల మధ్య ప్రోత్సహించాలని ఆదేశిక సూత్రాల స్పష్టమైన ఆదేశం. అంతేగాదు, స్త్రీపురుషుల మధ్య వివక్ష లేకుండా జీవించడానికి తగిన అవకాశాలను, భృతిని కల్పించి తీరాలని, కొద్దిమంది వ్యక్తుల వద్ద సంపద కేంద్రీకరణ జరగకూడదని, ప్రజలందరి ప్రయోజనాలకు విరుద్ధంగా ఉత్పత్తి సాధనాలు కొద్దిమంది వద్ద పోగుపడరాదనీ భారత రాజ్యాంగంలోని 39వ అధికరణ హెచ్చరించింది. ఈ దృష్ట్యా చూసినపుడు మోదీ ఎనిమిదవ వార్షిక బడ్జెట్‌ ఈ ప్రకటిత రాజ్యాంగ చట్ట నిబంధనలకు క్రమేణా విరుద్ధ స్వభావంతో అవతరించినట్టు భావించవలసి వస్తోంది.

‘‘భారత ద్రవ్య వ్యవస్థలోని వైఫల్యాల ప్రమాదం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించాలంటే భారత బ్యాంకులు, తదితర పబ్లిక్‌ రంగ సంస్థలపైన ప్రభుత్వ నిత్య నియంత్రణను పెందలాడే తొలగించేయాలి. అసమా నతలను తొలగించడంపై కేంద్రీకరణకన్నా ఆర్థికాభివృద్ధి సాధనపైనే కేంద్రీకరిం చాలి. ప్రభుత్వ నియంత్రణ వల్ల ద్రవ్య వ్యవస్థా రంగం పలు వైఫల్యాలకు గుర వుతూ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోంది’’. – 2021 ఆర్థిక సర్వేక్షణ (30–01–2021)

ఇంతకూ అసలు విశేషమేమంటే.. కోవిడ్‌–19 మహమ్మారి రాకముందు నుంచి పాలకులు ఊదరబెట్టి అదరగొడుతున్న ‘స్వయంపోషక ఆర్థిక వ్యవస్థ’ (ఆత్మనిర్భర్‌ భారత్‌), ‘అందరికోసం అందరి వికాసం’ (సబ్‌ కీ సాత్, సబ్‌ కీ వికాస్‌) అన్న పాలకుల నినాదాల వెనుక అసలు రహస్యం ఏమిటో తేటతెల్లమై పోయింది. పబ్లిక్‌రంగ సంస్థల్ని ప్రభుత్వ నియంత్రణ వ్యవస్థ నుంచి పెందలాడే తప్పించి ప్రైవేట్‌రంగ బడా గుత్త పెట్టుబడి వర్గాలకే ధారాదత్తం చేయాలన్న పాలకవర్గాల నిశ్చితాభిప్రాయాన్ని ప్రభుత్వ తాజా ఆర్థిక సర్వేక్షణ బాహాటంగానే ప్రకటించింది. భారత ప్రజలమైన మేము మాకు మేముగా ఈ రాజ్యాంగాన్ని అంకితం చేసుకుంటున్నామన్న ప్రకటిత లక్ష్యానికి, ఆ ప్రకటన ఆధారంగానే రూపొందించుకున్న గణతంత్ర రాజ్యాంగం నిర్దేశించిన పౌరుల జీవించే ప్రాథ మిక హక్కులకూ కట్టుబడే బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఆచరణలో వారి ఆర్థిక స్వాతంత్య్రానికి భరోసా ఇస్తూ అక్షర సత్యంగా దేశంలోని బడుగు, బలహీన వర్గాల, పేద ప్రజా బాహుళ్యానికి వర్తించే ఆదేశిక సూత్రాలను 37, 25, 39వ రాజ్యాంగ అధికరణలుగా స్పష్టంగా పేర్కొంది. ఈ ఆదేశిక సూత్రాలు, పౌరులు హుందాగా బతికే, ఆర్థిక స్వాతంత్య్రంపై హామీపడ్డాయని మరచిపోరాదు.

ఈ ప్రకటిత సూత్రాల లక్ష్యమే సంక్షేమ రాజ్య స్థాపన. ఆ సంక్షే మాన్ని పేదసాదలకు ఆచరణలో దక్కేలా చూసే బాధ్యతను రాజ్యాంగ అధికర ణలు స్పష్టం చేశాయి. వీటి ప్రకారం పౌరులు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం విధిగా పొంద డానికి అర్హులని ఆదేశిక సూత్రాలు విస్పష్టంగానే పేర్కొన్నాయి. ఆదాయాల్లో అసమానతలను కనిష్ట స్థాయికి తగ్గించి వేయాలని, హోదాలో అసమానతలు తొలగించి, ప్రతిపత్తిలో తగిన సానుకూల సౌకర్యాలు, అవకాశాలు కల్పించాలని, ఇవి వ్యక్తుల స్థాయిలోనే కాక, వివిధ ప్రాంతాల్లో నివసించే ప్రజలమధ్య, వివిధ వ్యాపకాల్లో ఉన్న ప్రజలమధ్యా ప్రోత్సహించాలని ఆదేశిక సూత్రాల స్పష్టమైన ఆదేశం. అంతేగాదు, స్త్రీ పురుషుల మధ్య వివక్షత లేకుండా జీవించడానికి తగిన అవకాశాలను, భృతిని కల్పించి తీరాలని ప్రజలం దరి ప్రయోజనాలకు విరుద్ధంగా ఉత్పత్తి సాధనాలు కొద్దిమంది వద్ద పోగుపడ రాదనీ 39వ అధికరణ హెచ్చరించింది.

ఈ దృష్ట్యా చూసినపుడు మోదీ 8వ వార్షిక బడ్జెట్‌ ఈ ప్రకటిత రాజ్యాంగ చట్ట నిబంధనలకు క్రమేణా విరుద్ధ స్వభావంతో అవతరించినట్టు భావించవలసి వస్తోంది. అధికారానికి వచ్చినప్పటినుంచీ మోదీ ప్రభుత్వం, ‘మేకిన్‌ ఇండియా’ నినాదం ద్వారా హోరెత్తిస్తున్న  ‘భారతదేశంలోనే తయారీ’ అంటే, ఆ ఉత్పత్తుల్ని మన దేశీయులే తయారు చేయాలనా లేక మన తరఫున విదేశీ పెట్టుబడిదారులు ఇండియాలో ప్రవేశించి తయారు చేయాలనా? ఆ స్లోగన్‌లో ఉన్న ‘అస్పష్టత’ ఇప్పటికీ తొలగలేదు కాబట్టే బ్యాంకులు సహా మొత్తం దేశీయ ప్రభుత్వరంగ పరిశ్రమలే ఒక్కటొక్కటిగా విదేశీ గుత్త పెట్టుబడులకు జీహుకుం అనవలసిన స్థితికి పాలక విధానాలు చేరుకున్నాయి. ఒకవైపున కోవిడ్‌–19 వల్ల గత ఏడాదిగా పారిశ్రామిక, వ్యావసాయిక తదితర ఉపాధి రంగాలలో ఏర్పడిన మాంద్యం నేపథ్యంలో జీఎస్టీ పేరిట రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని కొల్లగొట్టి ఫెడరల్‌ వ్యవస్థ లక్ష్యానికి కేంద్ర పాలకులు చేటు తెచ్చారు. గత ఏడాది ప్రభుత్వ ఆర్థిక సర్వేక్షణ అభివృద్ధి శాతం ఈ ఏడాది 6 శాతం ఉంటుందని అంచనా వేస్తే అది కాస్తా మైనస్‌ 7.7 శాతానికి దిగజారిపోయింది.

వరల్డ్‌ బ్యాంక్‌ ప్రజా వ్యతిరేక ఆర్థిక సంస్కరణల్ని ముందుకు తీసుకెళ్లడంలో ఉద్దండపిండంగా సేవలందించిన ఆర్థిక నిపుణుడు అరవింద్‌ పనగారియా అడ్డూ అదుపూ లేని స్వేచ్ఛావాణిజ్య ప్రచారకుడు. ఆయన్ని తీసు కొచ్చి మోదీ మొట్ట మొదటి నీతిఆయోగ్‌ వ్యవస్థకు అధిపతిని చేశారు. కొద్ది కాలం ఉండి ఆయన అక్కడి నుంచి ఉడాయించారు. అలాగే ఆయన తర్వాత అదే ఆయోగ్‌ నుంచి మరి ఇద్దరు కూడా తప్పుకున్నారు. ఇక అంతకుముందే రిజర్వ్‌ బ్యాంక్‌ అధిపతిగా పనిచేసిన సుప్రసిద్ధ ఆర్థికవేత్త రఘురామరాజన్‌ మోదీ ప్రభుత్వంతో వేగలేక  అమెరికా యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా వెళ్లారు. ఇక ఇప్పుడు ఆఖరి అంకుశంగా మోదీ ప్రయోగించిన ఆయుధం ఏమిటంటే.. ఉరుమురిమి మంగళం మీద పడినట్లు మూడు నిరంకుశ రైతాంగ వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా గత 70 రోజులుగా భారత రైతాంగం చేస్తున్న భారీ నిరసనో ద్యమంపై ఉక్కుపాదం మోపి కార్పొరేట్‌ వ్యవసాయానికి తెరలేపేందుకు నిర్ణయించుకోవడమే.

అసమ సమాజంలో ఎన్నికల్లో దళితులకు ప్రత్యేత నియోజక వర్గాలు అవసరమని భావించినందున అందుకు వ్యతిరేకంగా వచ్చిన పూనా సంధి సందర్భంగా సత్యాగ్రహంలో ఉన్న గాంధీజీ ప్రాణాల్ని కాపాడినవారు డాక్టర్‌ అంబేడ్కర్‌ నాయకత్వాన దళిత వర్గాలేనని మరిచిపోరాదు. దళితులు గాంధీ ప్రాణ రక్షణ కోసం ఉమ్మడి నియోజకవర్గాల నుంచి పోటీ చేయడానికి నిర్ణయిం చుకున్నందున గాంధీ సత్యాగ్రహం నిలిపేశారు. దళితుల త్యాగం వల్ల గాంధీ తేరుకోవచ్చు గానీ, దళిత బహుజనుల స్థితిగతులు వారి త్యాగానికి తగిన దామా షాలో ఈనాటికీ మెరుగపడలేదు. రాజకీయ పక్షాలు ఈ రోజుకీ గ్రామసీమల్లో ప్రజల మధ్య చిచ్చుపెడుతూనే ఉన్నాయి. ఏకగ్రీవ ఎన్నిక ప్రక్రియకు మోకాలడ్డు పెడుతూనే ఉన్నాయి!! అందుకే అంబేడ్కర్‌ అన్నారు. ‘పార్లమెంటరీ ప్రజా స్వామ్యం స్వేచ్ఛను గుర్తించిందే కానీ, సమానత్వ సాధనను మరిచిపోయింది. ఈ వైఫల్యం అరాచకత్వానికి, తిరుగుబాటుకు దారితీస్తుంది’.

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు 
abkprasad2006@yahoo.co.in

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు