‘ఏజెన్సీ సుందరయ్య’ హ్యాట్రిక్‌ ఎమ్మెల్యే 

16 Apr, 2021 01:33 IST|Sakshi

మూడు పర్యాయాలు వరుసగా ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన అధికారాన్ని, పలుకుబడిని వాడుకొని నిలకడ సంపాదన కోసం ఓ ప్రైవేటు దవాఖానానో, కాలేజీనో  స్థాపించుకోలేదు. పిల్లలను తన పదవీ వారసులుగా తీర్చిదిద్దలేదు. కమీషన్ల కోసం నియోజకవర్గంలో జరిగే పనులకు కాలడ్డం పెట్టలేదు. దేశంలో ఇలాంటి ఎమ్మెల్యేలు ఉంటారా అని అస్సలు నమ్మని ప్రజలకు సజీవ సాక్ష్యం కుంజా బొజ్జి 1985 నుండి 1999 దాకా భద్రాచలం నియోజకవర్గం నుండి ఆనాటి అసెంబ్లీకి ప్రాతి నిధ్యం వహించిన ఆయనకు రాజధాని నగరంలో బెత్తెడు జాగా లేదు, తల దాచుకునేందుకు ఒంటి గది ఇల్లు కూడా లేదు. 95వ ఏట ఈ నెల 12న చనిపోయిన ఆయన నిర్యాణం కూడా సాదా సీదాగానే చరిత్ర పుటల్లో కలిసిపోయింది. సంపద ఉన్న వారి చావులే సందడి చేసే ఈ రోజుల్లో కుంజా బొజ్జిని తలచుకోవడమంటే మన రాజకీయ పరిజ్ఞానాన్ని ప్రక్షాళన చేసుకోవడమే.

వరరామచంద్రపురం మండలంలోని అడవి వెంకన్నగూడెం బొజ్జి స్వగ్రామం. పోలవరం ముంపు గ్రామాల్లో ఆ ఊరు ఖమ్మం జిల్లా నుండి రాష్ట్ర విభజనలో తూర్పు గోదావరి జిల్లాలో భాగమైంది. గిరిజన కోయజాతి బిడ్డగా 1926లో ఆయన జన్మించారు. గుడిసె నివాసం, పోడు వ్యవసాయమే జీవనం. 20 ఏళ్ళు దాటాక వారి వీరి సాయంతో పెద్దబాలశిక్ష నేర్చుకున్నారు. ఆయన జీవితంలో అదే చదువు. 1948లో లాలమ్మతో వివాహమైంది. 1950లో కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాలకు ఆకర్షితుడై ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటంలో గెరిల్లాదళానికి కొరియర్‌గా పనిచేశారు. పోలీసులకు పట్టుబడి జైలు జీవితం కూడా అనుభవించారు. 1970లో సీపీఐ (మార్క్సిస్టు) పార్టీలో చేరి స్థానిక రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తూ 1981లో వీఆర్‌పురం సమితి మెంబర్‌గా ప్రజా ప్రాతినిధ్య రంగప్రవేశం చేశారు.

నిత్యం సైకిల్‌పై తిరుగుతూ గ్రామాలకు వెళుతూ అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించేవారు. గిరిజన గ్రామాలకు రోడ్లు, బస్సు రవాణా, తాగునీటి సమస్యల్ని తీర్చడం, పాఠశాలల, వైద్యశాలల ఏర్పాటుపై ఎక్కువగా దృష్టి పెట్టారు. ప్రజలతో ఏజెన్సీ సుందరయ్యగా కీర్తి పొందారు.  భద్రాచలం నియోజకవర్గంలో ఎవరూ సాధించని మెజారిటీతో గెలుపొందారు. 1994లో పోలైన ఓట్లలో 62.55 % బొజ్జికి వచ్చాయి. 39,225 ఓట్ల మెజారిటీ 1952 నుండి ఇప్పటి దాకా ఓ రికార్డుగానే మిగిలివుంది.

ఒకే వ్యక్తి నాలుగోసారి పోటీ చేయకూడదన్న పార్టీ నియమావళి ప్రకారం మళ్ళీ పోటీ చేయలేదు. అదేవిధంగా పార్టీ ఆదేశాలను శిరసావహిస్తూ ఎమ్మెల్యే కోటాలో ఆయనకు హైదరాబాద్‌లో ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించినా తీసుకోలేదు. ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం ప్రభుత్వం ఇచ్చే వేతనంలో కొంత తీసుకుని మిగతాది పార్టీకి ఇచ్చేసేవారు. మాజీ ఎమ్మెల్యేగా అందే భృతిలో కూడా వీలైనంత ప్రజాసేవకే ఖర్చు చేస్తారు. ఇప్పటికి సొంతూరులో మామూలు ఇంట్లో నివాసం. ప్రతి ఏటా వేసవిలో భార్యాభర్తలు కలిసి తునికాకు సేకరణకు వెళ్లేవారు. ఇలా వచ్చిన సొమ్ములో కూడా ప్రజలకు భాగముండేది. వారికి ముగ్గురు కొడుకులు, ముగ్గురు కుమార్తెలున్నారు. అందరి బతుకులు వ్యవసాయాధారాలే. రెండేళ్ల క్రితం భార్య లాలమ్మ చనిపోయారు. 92 ఏళ్ల వయసులోనూ కర్రసాయంతో సొంతంగా నడుస్తూ, చురుగ్గా మాట్లాడారు. ఈ మధ్యే అనారోగ్య కారణంగా భద్రాచలంలో కూతురు ఇంటికి వచ్చారు. అక్కడే ఏప్రిల్‌ 12న తుది శ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు సొంతగ్రామం అడవి వెంకన్నగూడెంలో జరిగాయి. ఈ రోజుల్లో పాలక పార్టీలకు పనికొచ్చే దివంగత నేతలే కీర్తించబడి కొత్త ప్రచారాన్ని పొందుతున్నారు. కుంజా బొజ్జికి ఇలాంటి ఆసరా అవసరం లేదు. ఆయన తమ ప్రాంతానికి చేసిన సేవలే బొజ్జిని గొప్ప ప్రజానాయకుడిగా కలకాలం నిలబెడతాయి.


వ్యాసకర్త: బి. నర్సన్‌
తెలంగాణ గ్రామీణ బ్యాంకు విశ్రాంత అధికారి
మొబైల్‌: 94401 28169

మరిన్ని వార్తలు