ఇది రైతుల పాలిట వరమా... శాపమా?

16 Jul, 2022 12:48 IST|Sakshi

‘‘ధరణి ఒక విప్లవం. ఈ పోర్టల్‌ నిర్మాణం కోసం నేను, చీఫ్‌ సెక్రటరీ ఆరు నెలలు రేయింబవళ్లు కష్టపడి పనిచేశాం. ఇది పబ్లిక్‌ డొమైన్‌లో ఉంటుంది. ఇక ఏ రైతుకైనా తన భూమి సరిహద్దులు చిటికెలో తెలిసిపోతాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇక భూసమస్యలకు తావే ఉండదు’’– ‘ధరణి’ ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ లోపలా, బయటా చేసిన ప్రసంగాల్లో నమ్మబలికిన మాటలివి. కానీ ఆచరణలో ధరణితో రైతన్నల పరిస్థితి పెనంపై నుండి పొయ్యిలోకి పడిన పరిస్థితి ఏర్పడింది. రైతన్నల ఈ గోసకు కారణమెవరంటే ముమ్మాటికీ కేసీఆర్‌ అసమర్థ విధానాలే అంటే అతిశయోక్తి కాదు.

ఏళ్ల తరబడి భూ వివాదాలను పరిష్కరించేందుకు ధరణి కార్యక్రమం ఒక ‘జిందా తిలిస్మాత్‌’గా కేసీఆర్‌ ప్రభుత్వం ప్రచారం చేసింది. 2020 అక్టోబర్‌ 19న ప్రారంభమైన ‘ధరణి’ కార్యక్రమం ఎటువంటి సమస్యలనూ పరిష్కరించకపోగా మరిన్ని కొత్త సమస్యలను సృష్టించింది. ఈ కొత్త చిక్కులతో రైతులు చెప్పులు అరిగేలా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు భూ సమస్యల పరిష్కారం కోసం 5 లక్షల దరఖాస్తులు వివిధ దశల్లో పెండింగ్‌లో వున్నాయి. మరో 8.50 లక్షల సాదా బైనామా దరఖాస్తుల స్థితీ అదే. ఈ సమస్యలకు పరిష్కారం చెప్పే నాథుడే కనబడటం లేదు.

రెవెన్యూ చట్టాల్లో సవరణలు చేయకుండా, ధరణి మాడ్యూల్స్‌లో మార్పులు చేయకుండా భూ సమస్యల పరిష్కారం సాధ్యం కాదంటూ ఇప్పటికే జిల్లా కలెక్టర్లు చేతులెత్తేశారు. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన రెవెన్యూ సదస్సులు సైతం సరైన మార్గదర్శకాలు లేకపోవడం వల్లే వాయిదా పడ్డాయి. జిల్లా కలెక్టర్లకు వచ్చిన ధరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం 14 రోజుల సమయం కేటాయించింది. కానీ అది ఆచరణలో సాధ్యంకాదని జిల్లా కలెక్టర్లు వాపోతున్నారు.

అగ్రికల్చరల్‌ అసైన్డ్‌ ల్యాండ్స్‌కు డిజిటల్‌ సైన్‌ కోసం అప్లై చేసుకునే అవకాశం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం ఎటువంటి స్పష్టతను ఇవ్వకపోవడంతో అసైన్డ్‌ ల్యాండ్‌ పొందిన లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక పట్టాదారుడు తనకు సంబంధించిన భూ విస్తీర్ణంలో మార్పులు చేర్పులు చేయించుకోవడం తలనొప్పి వ్యవహారంగా మారింది. ప్రస్తుతం ధరణి పోర్టల్‌ నిబంధనల ప్రకారం తనకున్న భూ విస్తీర్ణం కంటే ఎక్కువ భూమి నమోదైతే భూ విస్తీర్ణం పొందిన పట్టాదారుడు తనకు ఎక్కువ భూ విస్తీర్ణం నమోదైందని రూ. 1000 ఆన్‌లైన్‌లో కట్టి పట్టాలో మార్పులు కోరాలి. ఈ రకంగా తన భూ విస్తీర్ణాన్ని తగ్గించాలని ఎదురు డబ్బు కట్టి మరీ కోరేవారు ఎవరు ఉంటారో ధరణి పోర్టల్‌ డిజైన్‌ చేసిన ప్రభుత్వ పెద్దలు చెప్పాలి.

ధరణి పోర్టల్‌ అమల్లోకి రాగానే నిమిషాల్లో మ్యూటేషన్లు జరిగిపోతాయంటూ కేసీఆర్‌ సెలవిచ్చారు. కానీ ప్రస్తుతం కనీసం సరిహద్దు మ్యాప్‌లు కూడా లేకుండానే రిజిస్ట్రే్టషన్లు జరిగిపోతున్నాయి. దీంతో గట్టు తగాదాలు, ఘర్షణలు నిత్యకృత్యాలయ్యాయి. ధరణిలో వచ్చిన మరో సమస్య బైనంబర్లతో రిజిస్ట్రేషన్లు. దీనివల్ల సామాన్యులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. బైనంబర్లతో రిజిస్ట్రేషన్లు పొందినవారికి రెవెన్యూ అధికారులు బైనంబర్ల ఆధారంగా భూసరిహద్దులు చూపడం కష్టసాధ్యమౌతోంది. దీంతో ఎవరైనా ఏ భూమికైనా తానే హక్కుదారుడననే వాదనకు దిగేందుకు ఈ విధానం తావిస్తోంది.

ధరణి పోర్టల్‌లో కొత్తగా తీసుకువచ్చిన ‘రైట్‌ టు ప్రైవసీ మాడ్యూల్‌’ ద్వారా రాజకీయ నాయకులు, అవినీతి అధికారులు అక్రమంగా సంపాదించిన భూములకు గోప్యత పొందే అవకాశం కలుగుతోంది. ధరణిలో వెల్లువెత్తిన భూ సమస్యలను పరిష్కారం చేయాలంటే క్షేత్రస్థాయి విచారణ తప్పనిసరి. కానీ దానికి తగిన రెవెన్యూ సిబ్బంది ప్రభుత్వం వద్ద లేదు. ప్రస్తుతం ధరణి పోర్టల్‌లో 33 రకాల ట్రాన్సాక్షన్స్‌ మాడ్యూల్స్, 11 రకాల ఇన్‌ఫర్మేషన్‌ మాడ్యూల్స్‌ అందుబాటులో వున్నాయి. వీటితోపాటు భూ వివాదాల పరిష్కారానికి సరళతరమైన మాడ్యూల్స్‌ను ధరణి పోర్టల్‌లో చేర్చితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లభించదు.

ధరణి లోపాలవల్ల భూ రిజిస్ట్రేషన్లు, వాస్తవ పట్టాదారులు పాసు పుస్తకాలలో వున్న సమస్యలతో... రైతుబంధు, రైతు బీమా, రుణ మాఫీ వంటి పథకాలకు నోచుకోవడం లేదు. పట్టాదారు పాసు పుస్తకం లేనిదే రైతన్నకు బ్యాంకులో రుణ సౌకర్యం పొందే అవకాశం కూడా లేదు.

ధరణితో దగా పడ్డ రైతన్నలు ఇప్పటికే ఐక్య ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. అందుకు ఆదిలాబాద్‌ జిల్లా కంజర్ల గ్రామమే ఉదాహరణ. సాదా బైనామాపై వ్యవసాయ భూమి కొనుగోలు చేసిన జైపాల్‌ రెడ్డి కుటుంబానికి పట్టా లేకపోవడంతో ఆ భూమిని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నించారు. దీంతో ఆ గ్రామస్థులంతా తిరగబడి అదే రైతుకు భూమి దక్కేలా పోరాడారు. (క్లిక్‌: ఇది సర్కారీ కాంట్రాక్టుల దోపిడీ!)

రాష్ట్రప్రభుత్వం మొద్దునిద్ర వీడి రాష్ట్రంలో వున్న భూ సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలి. ధరణి పోర్టల్‌లో వున్న సమస్యలను సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలి. ధరణి పోర్టల్‌లో వున్న లోపాల దిద్దుబాటు కోసం ప్రభుత్వం టైమ్‌ బౌండ్‌ ప్రోగ్రాం రూపొందించాలి. రైతాంగం ఇచ్చిన లక్షలాది అర్జీల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు దోహదపడాలి. ప్రచార ఆర్భాటం కోసమే రెవెన్యూ సదస్సుల పేరుతో కాలయాపన చేస్తే... భూ సమస్యల బాధితులను సమీకరించి బీజేపీ ఉద్యమిస్తుంది.


- బండి సంజయ్‌కుమార్‌
కరీంనగర్‌ పార్లమెంటు సభ్యులు
బీజేపీ తెలంగాణ అధ్యక్షులు

మరిన్ని వార్తలు