BR Ambedkar: స్మృతివనం చరిత్రాత్మకం

6 Dec, 2021 11:02 IST|Sakshi

Ambedkar Death Anniversary 2021: సమాజ దిశా నిర్దేశాన్ని ప్రభావితం చేసి, ఒక సమున్నత ఆశయం కోసం కృషి చేసిన యుగపురుషుడు డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌. అనేక వివక్షలకు గురైనా తన పట్టుదలతో రాజ్యాంగాన్ని రచించే స్థాయికి ఎదిగారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక సంస్కర్తగా జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని అందుకున్నారు. ఇరవై మిలియన్‌ ఓట్లతో ‘ద గ్రేటెస్ట్‌ ఇండియన్‌’గా గుర్తింపు పొందారు. ప్రముఖ ఆర్థికవేత్త నరేంద్ర జాదవ్‌.. అంబేడ్కర్‌ను ‘భూమి ఉన్నంతకాలం దేశ అత్యున్నత ఆర్థికవేత్త’గా పేర్కొన్నారు. అమర్త్య సేన్‌ ‘భారత ఆర్థిక రంగ పితామహుడి’గా అభివర్ణించారు. బ్రిటిష్‌ కొలంబియా ప్రావిన్స్‌ ఆఫ్‌ వెస్ట్రన్‌ కెనడా ఆయన జయంతిని ‘సమానత్వ దినోత్సవం’గా జరుపుకోవాలని నిశ్చయించింది. అమెరికాలోని బోస్టన్‌ నగరంలో ఉన్న మసాచుసెట్స్‌ యూనివర్సిటీలోనూ, న్యూయార్క్‌ లోని కొలంబియా విశ్వ విద్యాలయంలోనూ, బ్రాండియస్‌ యూనివర్సిటీలలోనూ ఆయన విగ్రహాలను ఏర్పాటు చేశారు. భారత పార్లమెంట్‌ ఆయన విగ్రహాన్ని సెంట్రల్‌ హాల్‌లో ప్రతిష్ఠించి గౌరవించింది.

అటువంటి మహనీయునికి స్మృతివనం నిర్మించడం అంటే ఆయన స్ఫూర్తిని కొనసాగించేందుకు కంకణబద్ధులు కావడమే. ఇందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నడిబొడ్డున ఉన్న స్వరాజ్‌ మైదాన్‌లో (పి.డబ్లు్య.డి. గ్రౌండ్స్‌) స్మృతివనం ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం అంబేడ్కర్‌ అభిమానులకు, ప్రజాస్వామ్యవాదులకు సంతోషాన్ని కలిగిస్తోంది. ఇరవై ఎకరాల స్ధలంలో నిర్మిస్తున్న ఈ స్మృతివనంలో  125 అడుగుల విగ్రహంతో పాటు ఆయన జీవిత విశేషాలను ప్రదర్శించేందుకు మ్యూజియం, గ్యాలరీ, ఇంకా పుస్తక పఠనంతో జ్ఞాన సముపార్జన చేసిన అంబేడ్కర్‌ స్ఫూర్తిని గుర్తుచేస్తూ అంతర్జాతీయ స్థాయి గ్రంథాలయాన్ని నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా అధికారులతో చర్చించి 2022 ఏప్రిల్‌ 14 అంబేడ్కర్‌ జయంతి నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందుకుగానూ 249 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌లో అంబేడ్కర్‌ స్మృతివనం చరిత్రాత్మకం కానున్నది.

గత ప్రభుత్వం నగరానికి దూరంగా నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టు చిత్తశుద్ధి లోపం కారణంగా ఐదేళ్ల కాలంలో అతీగతీ లేకుండా పోయింది. అంబేడ్కర్‌ 125వ జయంతి సందర్భంగా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగినప్పటికీ అప్పటి ప్రభుత్వం శ్రద్ధ చూపలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడలోని స్వరాజ్‌ మైదానంలో ఈ ప్రాజెక్టును నిర్మించాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2020 జూలై 8న శంకుస్థాపన చేసి త్వరితగతిన పనులు ప్రారంభించి పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. దీని ద్వారా ముఖ్యమంత్రి దళిత, ఆదివాసీ, అట్టడుగు వర్గాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా అర్థమవుతోంది. అంబేడ్కర్‌ స్ఫూర్తిని కొనసాగించేందుకు చర్యలు తీసుకోవడం అభినందనీయం.
– నేలపూడి స్టాలిన్‌ బాబు
సామాజిక రాజకీయ విశ్లేషకులు 
(నేడు అంబేడ్కర్‌ వర్ధంతి)

మరిన్ని వార్తలు