BR Ambedkar: తెలుగు నేలపై చైతన్య యాత్ర

6 Dec, 2022 12:21 IST|Sakshi
తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలో...

సందర్భం

నవభారత నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌కు తెలుగు నేలతో ఎంతో అనుబంధం ఉంది. పలు సందర్భాల్లో తెలుగు ప్రాంతాల్లో  పర్యటించి ఇక్కడి ప్రజ లను చైతన్యపరిచారు. భారతదేశంలో అంబేడ్కర్‌ ఇష్టపడి, ఎన్నోసార్లు విడిది చేసిన అతికొద్ది నగరాల్లో హైదరాబాద్‌ ఒకటి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటించారు. దేశానికి స్వాతంత్య్రంతో పాటు బహుజనులకు కూడా స్వాతంత్య్రం కావాలని కాంక్షిస్తూ పలు చైతన్యయాత్రలు ఆంధ్రలో చేశారు. 

అటువంటి పర్యటనల్లో 1944 సెప్టెంబరు 27వ తేదీ నుంచి అక్టోబరు 4వ తేదీ వరకూ జరిపిన పర్యటన చారి త్రాత్మకమైనది. అది రెండో ప్రపంచ యుద్ధ సమయం. అందుకే యుద్ధమనేది బ్రిటిష్‌ వారి సొంత వ్యవహారమనీ, యుద్ధం మన లక్ష్యం కాదనీ, సామాజిక స్వాతంత్య్రం మన గమ్యమంటూ తన ప్రసంగాల ద్వారా ఇక్కడి ప్రజలను చైతన్యపరిచారు. విజయవాడ మొదలు కొని విశాఖపట్నం వరకూ పర్యటించారు. తొలుత బెజవాడ రైల్వేస్టేషన్‌ లోనూ, గుడివాడ మొయిన్‌ రోడ్‌లోనూ ప్రజలనుద్దేశించి ఉపన్యసించారు. 

బాలికల వసతి గృహానికి గుడివాడలో శంకు స్థాపన చేశారు. అనంతరం ఏలూరు సందర్శించారు. అక్కడ మున్సిపల్‌ కార్యాలయంలో అంబేడ్కర్‌ను అభిమానులు, పురపాలక సభ్యులు ఘన సన్మానం చేశారు. కొవ్వూరులో ఎస్సీ కాలనీని సందర్శించి. షెడ్యూలు కాస్ట్‌ ఫెడరేషన్‌ ఫ్లాగ్‌ను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. అందుకే ‘జెండా పేట’గా ఆ కాలనీకి నామకరణం చేసుకున్నారు ప్రజలు. అనంతరం, తాడేపల్లిగూడెంలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించి, పాలకొల్లు, రామచంద్రాపురం వెళ్లారు. రాజమండ్రి వచ్చిన సందర్భంగా అక్కడి టౌన్‌ హాల్‌లో ఘనంగా పౌర సన్మానం జరి గింది. కాకినాడ పర్యటన అనంతరం పిఠాపురం వచ్చి ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సందర్శిం చారు. అక్కడి రాజా కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు.

తుని రైల్వేస్టేషన్‌ వద్ద ప్రసంగించిన అనం తరం అనకాపల్లి చేరుకోగా భారీ సంఖ్యలో ప్రజలు, అభిమానులు అంబేడ్కర్‌కు అక్కడి రైల్వేస్టేషన్‌ వద్ద స్వాగతం పలికారు. అక్కడి మున్సిపల్‌ స్కూల్లో జరిగిన సభలో ప్రసంగించిన అనంతరం, పట్టణ ప్రజలు, వైశ్య సంఘం అంబేడ్కర్‌కు ఘన సత్కారం చేశాయి. ఆనాటి అంబేడ్కర్‌ పర్యటనకు గుర్తుగా ఈ ప్రాంతం ‘భీముని గుమ్మం’ అని ప్రాచుర్యం పొందింది. అక్కడి ప్రభుత్వ పాఠశాలకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరును పెట్టి ఈ ప్రాంతీయులు నివాళి అర్పించారు. పర్యటన చివరలో విశాఖ సిటీకి వచ్చి పోర్టులో కార్మికులను కలిశారు. తర్వాత కలెక్టరేట్‌ వద్ద జరిగిన సభలో మాట్లాడారు.

అంబేడ్కర్‌ ఆంధ్రలో పర్యటించినపుడు ఆయన ప్రసంగాలను నందనారు హరి, రావురి ఏకాంబరం, కుసుమ వెంకటరామయ్య, పాము రామమూర్తి, జొన్నల మోహనరావు తదితరులు పలుచోట్ల తెలుగులోకి అనువదించేవారు. మొత్తం మీద అంబేడ్కర్‌ పర్యటన తెలుగు నేలను చైతన్యపరచింది. (క్లిక్ చేయండి: సామాజిక బందీల విముక్తి ప్రదాత!)

- డాక్టర్‌ జి. లీలావరప్రసాదరావు 
అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్, బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ, శ్రీకాకుళం

మరిన్ని వార్తలు