స్వాతంత్య్ర సాధనకు అండ.. జాతీయ జెండా

25 Mar, 2021 13:19 IST|Sakshi

సందర్భం

జాతీయోద్యమంలో తొలిసారిగా 1916లో లక్నో జాతీయ కాంగ్రెస్‌ సభలో జాతీయపతాకను ఎగరవేశారు. పింగళి వెంకయ్య గొప్ప స్వాతంత్య్ర సమర యోధులు. 1919లో జలంధర్‌కు చెందిన లాలాహన్స్‌రాజ్‌ మన జాతీయ పతాకంపై రాట్నం చిహ్నం ఉంటే బాగుంటుందని సూచించగా గాంధీజీ అంగీకరించారు. 1921 లో అఖిలభారత కాంగ్రెస్‌ మహాసభలు విజయవాడలో జరిగాయి. ఆ సభలో గాంధీజీ బందరు ఆంధ్రజాతీయ కళాశాల అ«ధ్యాపకులుగా పనిచేస్తున్న పింగళి వెంకయ్యను పిలిపించి కాషాయం, ఆకుపచ్చ, మధ్యలో రాట్నం ఉండేలా జాతీయ జెండాను రూపొందించాలని కోరారు. వెంకయ్య వెనువెంటనే జాతీయ పతాకాన్ని రూపొందించి కాంగ్రెస్‌ పార్టీకి అందించారు. ఆ తర్వాత సత్యం, అహింసలకు ప్రత్యేక నిదర్శమైన తెలుపు రంగు కూడా ఉండాలని గాంధీజీ చెప్పడంతో ఆ జెండాలో అదనంగా తెలుపురంగును చేర్చడంతో మూడు రంగులతో నేటి త్రివర్ణ పతాకాన్ని దేశానికి అందించారు.

ఆ జెండా ఆంధ్రదేశంలోనే ఆవిర్భవించడం మనకు గర్వకారణం. తొలిరోజుల్లో జాతీయ పతాకంలోని రంగులు జాతిమతాలకు సంకేతాలకు భావించారు. క్రమేపీ అవి జాతి మతాతీత సంపదలుగా నిర్ధారించబడ్డాయి. కుంకుమపువ్వు (కాషాయం)శౌర్యానికి, త్యాగశీలానికి ప్రతీక. ఆకుపచ్చరంగు అకుంఠిత భక్తి విశ్వాసానికి, శూరత్వానికి సంకేతం. తెలుపు స్వాతంత్య్ర పోరాట ప్రాతిపదికైన సత్యం, అహింసలకు ప్రత్యేక నిదర్శనంగా నిలిచాయి. స్వాతంత్య్రం అనంతరం రాజ్యాంగ పరిషత్‌ నెహ్రూ గారి సూచన మేరకు రాట్నానికి బదులుగా అశోక ధర్మచక్రాన్ని నిర్ణయించింది. అందులోనూ రాట్న చిహ్నమైన చక్రం ఉండటం గమనార్హం. 

పింగళి వెంకయ్య కృష్ణాజిల్లా మచిలీపట్నం సమీపాన భట్లపెనుమర్రు గ్రామంలో 1876 ఆగస్టు రెండోతేదీన జన్మించారు. ఆయన తల్లిదండ్రులు వెంకటరత్నమ్మ, హనుమంతరాయుడు దివితాలూకా యార్లగడ్డ గ్రామ కరణం. వెంకయ్య బాల్యం నుండి ప్రతిభావంతమైన విద్యార్థి. 19వ ఏటా బొంబాయి వెళ్లి సైన్యంలో చేరాడు. దక్షిణ ఆఫ్రికాలో ఉన్న మహాత్మగాంధీతో  పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం దాదాపు అర్థ శతాబ్దంపాటు కొనసాగింది. 

స్వాతంత్య్ర సాధనకు దేశమంతటా జెండా సత్యగ్రహ ఉద్యమాలు ఆయా రాష్ట్రాల్లో విజయవంతంగా సాగాయి. 1923 మే ఒకటో తేదీన ‘జెండా సత్యగ్రహ ఉద్యమం’ తొలిసారిగా ప్రారంభమైంది. అందులో వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది స్త్రీ, పురుషులు జాతీయ అభినివేశంతో పాల్గొన్నారు. ఆంధ్రప్రాంతం నుండి తొలిసారిగా సుభద్రాదేవి అనే మహిళా వాలంటీర్‌ ఈ ఉద్యమంలో పాల్గొంది. ఉద్యమం విజయవం తం కావడంతో జెండాకు ఒక పవిత్రత, సార్వజనీనత, గౌరవ ప్రాముఖ్యాలు ఏర్పడ్డాయి. దీంతో సభలన్నింటిలో జాతీయ జెండా ప్రాధాన్యత సంతరించుకుంది. 

జెండా ప్రతిష్టకోసం ప్రాణాలొడ్డి లాఠీ బాధలు భరించి, జరిమానాలతో నష్టపోయిన వారెందరో ఉన్నారు. ఆ సందర్భంగా ఎందరో ప్రముఖ రచయిత లు జెండాను కీర్తిస్తూ ప్రశంసగీతాలు రాశారు. వాటిలో గురుజాడ రాఘవశర్మ రాసిన ‘జెండా ఎత్తరా జాతికి ముక్తిరా’ ప్రజల్లో గొప్ప ఉత్తేజాన్ని రేపింది. సుంకర సత్యనారాయణ రాసిన ‘ఎగురవే జెండా.. శాంతిదూతగా జాతీయజెండా –యుగయుగంబుల జగతినెగురవే జెండా సౌఖ్య ప్రదాతగా స్వాతంత్య్ర జెండా’ అనే గీతం ప్రజల్లో జెండా పట్ల మరింత గౌరవాన్ని పెంచింది. ఎందరో పోరాటవీరుల త్యాగఫలితంగా జాతీయ జెండా అండగా స్వాతంత్య్రాన్ని సాధించాం. 

ఇటీవల మాచర్లలో పింగళి వెంకయ్యగారి కుమార్తె సీతామహాలక్ష్మి ఆర్థిక ఇబ్బందులను గుర్తించి స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి రూ.75 లక్షల నగదు ఇచ్చి సహకరించడం ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మానవతా దృక్పధానికి నిదర్శనంగా నిలుస్తోంది. వెంటనే పింగళి వెంకయ్య గారికి భారతరత్న ఇవ్వాలంటూ భారత ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. భారత జాతికి స్ఫూర్తిగా నిలిచిన మన జాతీయ జెండా, ఆ జెండా రూపకర్త పింగళికి ‘భారతరత్న’ బిరుదు లభిస్తే ఆ మహనీయుడికి నిజమైన నివాళి లభించినట్లే. 

-డా. పీవీ సుబ్బారావు
(పింగళి వెంకయ్య శతజయంతి సందర్భంగా) 
వ్యాసకర్త సాహీతి విమర్శకులు: 98491 77594

మరిన్ని వార్తలు