కోవిడ్‌ వ్యాక్సిన్‌ అమలు–వైవిధ్యతే కీలకం

17 Jan, 2021 02:30 IST|Sakshi

మానవచరిత్రలో కెల్లా అతిపెద్ద టీకా కార్యక్రమం భారతదేశంలో మొదలైంది. ప్రపంచంలోనే అతి పెద్ద కోవిడ్‌–19 నిరోధక వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దేశవ్యాప్తంగా ప్రారంభించారు. వ్యాక్సిన్ల చరిత్రలో ఇంత తక్కువ కాలంలో ఒక వైరస్‌ నిరోధక టీకాను ఆవిష్కరించడం కూడా ఇదే మొదటిసారి కావడం విశేషం. గత మార్చి నుంచి ప్రపంచమంతా విస్తరించిన కరోనా వైరస్‌ను అడ్డుకోవడానికి అనేక వైద్య పరిశోధనా సంస్థలు తీవ్ర ప్రయత్నాలు సాగించాయి. కేవలం ఎనిమిది నెలల వ్యవధిలోనే భారత్‌ కూడా రెండు కోవిడ్‌–19 వ్యాక్సిన్‌లను ఆమోదించి జనవరి 16 నుంచి దేశమంతటా పంపిణీకి శ్రీకారం చుట్టింది.

తొలిదశలో అంటే ఆరునెలల కాలంలో కనీసం 30 కోట్లమందికి వ్యాక్సిన్‌ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంట్లో కూడా మొదటిదశలో 3 కోట్లమంది ఆరోగ్యరంగ సిబ్బందికి, పారిశుధ్య కార్మికులకు, వృద్ధులకు టీకా వేయనున్నారు. నిర్దేశించిన టీకా కేంద్రాల్లోనే సార్వత్రిక వ్యాక్సినేషన్‌ అమలు చేయడం, ఏ దశలో ఎవరెవరికి టీకాలు వేయాలి అని ముందే నిర్ణయించుకుని దానికనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టడంవల్ల తక్కువ కాలం లోనే వ్యాక్సిన్‌ డోస్‌లను దేశమంతటా పంపిణీ చేయడానికి వీలుకలిగిందనే చెప్పాలి. అయితే తొలిదశలోనే 30 కోట్లమందికి ఆరునెలల కాలంలో టీకాలు పంపిణీ చేయడం సాధారణ విషయం కాదు.. అందుకే ప్రపంచమంతా భారత్‌లో జరగనున్న కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమం అమలు తీరును ఆసక్తిగా పరిశీలిస్తోంది.

ఇప్పటికే కోవిడ్‌ నిరోధక టీకా పంపిణీ అమలైపోయిన అమెరికాలో టీకా వేసుకున్న తర్వాత చాలామందికి అలెర్జీలు రావడం, ప్రత్యేకించి వేరువేరు కోవిడ్‌–19 టీకాలు వేసుకున్నవారికి తీవ్ర సమస్యలు ఏర్పడటం తెలిసిందే. భారత్‌లో ఇప్పుడే టీకా కార్యక్రమం మొదలవుతున్నందున ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు టీకా వేసుకున్న తర్వాత కలిగే దుష్ఫలితాలపట్ల స్పందించాల్సి ఉంటుంది. ప్రతి కరోనా టీకా కేంద్రం వద్ద ప్రత్యేక వైద్యుల బృందాన్ని నియమించాల్సి ఉంటుంది.

వ్యాక్సిన్‌ ఏదయినా సరే వివిధ వర్గాల, ఆరోగ్య స్థాయిలున్న ప్రజలు వేసుకున్నప్పుడు అనివార్యంగా కొన్ని దుష్ఫలితాలు రావడం కద్దు కాబట్టి ప్రమాదాలను ముందే ఊహించి అప్రమత్తంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పైనే ఉంటోంది. పైగా వ్యాక్సిన్‌ డోసుల లభ్యత పరిమితంగానే ఉంటోంది కాబట్టి వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికుల తర్వాత వృద్ధులలో ఎవరెవరికి టీకాలు అందించాలనే ప్రాథ మ్యంపైకూడా పూర్తి కసరత్తు మొదలెట్టాల్సిందే. పైగా కరోనా పాజిటివ్‌ కేసులు తక్కువగా నమోదైన పట్టణాలు, గ్రామాల్లోని వ్యక్తులకు టీకా వేయడం, జనసాంద్రత చాలా ఎక్కువగా ఉండి కరోనా మరణాల రేటు అధికంగా నమోదైన నగరప్రాంతాల్లో వ్యక్తులకు టీకావేయడంలో వ్యత్యాసాలను కూడా ప్రభుత్వ సిబ్బంది గమనించాల్సి ఉంది. ఉదాహరణకు ముంబైలో కిక్కిరిసి ఉండే ప్రాంతాల్లో ఒకటికి మించి వ్యాధులు లేని వ్యక్తికి తక్కువ జనసాంద్రత ఉన్న అరుణాచల్‌ప్రదేశ్‌లోని సైన్యంలోని వ్యక్తికి కరోనా టీకా వేయడంలో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే విషయంలోనూ ముందస్తు కసరత్తు అవసరమవుతుంది

టీకా పంపిణీకి వ్యవస్థాగత ఏర్పాట్లు కీలకం
ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు, వృద్ధులకు టీకా వేస్తున్నప్పుడు వారి బాగోగులు చూసే సంరక్షకులకు, కుటుంబ సభ్యులకు కూడా వ్యాక్సిన్‌ ఇచ్చే విషయాన్ని కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవలసి ఉంది. ఏదైనా వ్యాక్సిన్‌ అన్ని వర్గాల ప్రజలకు ఒకేవిధంగా పనిచేస్తుందా అనేది ఇప్పటికైతే మనకు తెలీదు. అలాగే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న శిశువులకు, పిల్లలకు, గర్భిణులకు ఇతర ప్రజానీకానికి ఎంత సమర్థంగా ఈ వ్యాక్సిన్‌ పనిచేస్తుందనే విషయంలో కూడా స్పష్టతలేదు. ఇప్పుడైతే 18 ఏళ్లలోపు యువతకు, పిల్లలకు, గర్భిణీలకు వ్యాక్సిన్‌ ఇవ్వకూడదని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. అలాగే 65 ఏళ్లు దాటిన వారికి టీకా ఇస్తే ఫలితం ఎలా ఉంటుందనేది కూడా ఇప్పటికిప్పుడు అంచనా వేయలేం. కాబట్టి అందుబాటులో ఉన్న డేటా ప్రాతిపదికన కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ వ్యూహం కూడా మారుతూ ఉండాలి. ముఖ్యంగా వ్యాక్సిన్‌ని డబ్బు పెట్టి కొనలేని వర్గాలకు టీకాను ఎలా అంది స్తారనేది మరో సమస్య.

ఇప్పుడైతే దేశంలో రెండు వ్యాక్సిన్లకు మాత్రమే ఆమోదం లభించింది. భవిష్యత్తులో మరిన్ని వ్యాక్సిన్‌లు ఆమోద ముద్ర పొందితే, టీకా ఉత్పత్తి దారుల మధ్య పోటీ వాతావరణంలో టీకా ధరలను తగ్గించి కొనేందుకు కూడా ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా టీకా పంపిణీ, నిర్వహణలో ప్రైవేట్‌ రంగానికి కూడా భాగస్వామ్యం ఇస్తే ప్రభుత్వ ఆరోగ్య సంస్థలపై పడనున్న పెనుభారాన్ని కాస్త తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. దేశవ్యాప్తంగా భారీస్థాయిలో వ్యాక్సినేషన్‌ చేస్తున్నప్పుడు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లోని వైద్యుల సేవలు చాలా ఉపయోగపడతాయి. అదే సమయంలో కోవిడ్‌–19 టీకాను కొనుగోలు చేయగల సామర్థ్యం ఉన్న వారు టీకాను బహిరంగ మార్కెట్‌లో కొనుక్కునే వీలు కల్పించాలి. ఉదాహరణకు ఫైజర్‌ వ్యాక్సిన్‌ని దేశంలో అమ్మడానికి, పంపిణీ చేయడానికి దిగుమతి చేయడానికి ఫైజర్‌ అనుమతి కోరింది. అయితే ఆర్థికపరంగా, వనరుల పరంగా ఫైజర్, మోడెర్నా వంటి వ్యాక్సిన్‌ రకాలను భారత్‌లో ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలోకి అనుమతించడం కష్టమే కావచ్చు. అయితే ప్రైవేట్‌ ఆరోగ్య సంస్థలు కరోనా టీకా పంపిణీ నుంచి దూరం పెట్టాల్సిన పనిలేదు. పైగా ఏ వ్యాక్సిన్‌ని కూడా సార్వత్రికంగా ఉచితంగా, సబ్సిడీ ధరలకు మాత్రమే అందజేయడం కుదరని పని.

అలాగే ప్రైవేట్‌ రంగ సంస్థలను, ప్రభుత్వ రంగ సంస్థలను తమ ఉద్యోగులకు తామే టీకా పంపిణీ చేసేందుకు అనుమితిస్తే ప్రజారోగ్య అధికారులపై భారం తగ్గించవచ్చు. దేశవ్యాప్త వాక్సినేషన్‌ అనేది దాదాపుగా వికేంద్రీకృత ప్రక్రియతో కూడి ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధుల, పలు వ్యాధులున్న వారి జాబితాను, ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌ లైన్‌ కార్యకర్తల జాబితాను రూపొందిస్తున్నారు. వివిధ వ్యాధులతో మగ్గుతున్న వారిని గుర్తించడానికి జాతీయ ఆరోగ్య గుర్తింపు కార్డును కలిగి ఉండటం ఎంతైనా అవసరం. అందుకే ప్రస్తుతం పౌరులందరికీ జాతీయ ఆరోగ్య ఐడీని అందించగలిగితే భవిష్యత్తులో మరింత ఉత్తమంగా సిద్ధం కావచ్చు. అయితే రోగుల గుర్తింపు కార్డును ఆరోగ్య సంస్థలకు ఇవ్వాలంటే కూడా ముందుగా వారి ఆమోదం తప్పనిసరి.

-హరిహర్‌ స్వరూప్‌

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు