ట్రంప్‌ పాలన ఓ చీకటి అధ్యాయం

16 Jan, 2021 00:31 IST|Sakshi

ఆధునిక ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లైన అమెరికాలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ అధ్యక్షుని, ఉపాధ్యక్షుని ఎన్నికకు ఆమోదం తెలిపే క్యాపిటల్‌ భవనంపై ట్రంప్‌ మద్దతుదారులుగా పేర్కొంటున్న మూకలు దాడికి పాల్పడడం అమెరికా చరిత్రలో ఒక చీకటి రోజు. అమెరికా ప్రజాస్వామ్య చరిత్రలోనే డొనాల్డ్‌ ట్రంప్‌ నాలుగేళ్ల పాలనాకాలం ఓ చీకటి అధ్యాయం. ట్రంప్‌ పాలన ప్రారంభం నుంచే ఆయన తీసుకుంటూ వచ్చిన పాలనాపరమైన చర్యలు వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి. యూఎస్‌–మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణ నిధుల కోసం ట్రంప్‌ చేసిన డిమాండ్‌ ఫలితంగా నెలరోజుల పాటు ప్రభుత్వం స్తంభించిపోయింది.

దీంతో జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించి, నిధుల కోసం వీటో అధికారాన్ని ఉపయోగించి ట్రంప్‌ చరి త్రను సృష్టించాడు. అక్రమ సరిహద్దు క్రాసింగ్‌లపై ట్రంప్‌ అవలంబించిన జీరో టాలరెన్స్‌ విధానం వల్ల కనీసం 5,500 కుటుంబాలనుంచి వారి పిల్లలు వేరుకావలసి వచ్చింది. ఇది ట్రంప్‌ తలపెట్టిన మొదటి మానవ హక్కుల ఉల్లంఘన. 2018లో వెరైటీ ఆఫ్‌ మాన్యువల్‌ డెమోక్రటిక్‌ రిపోర్ట్‌.. ట్రంప్‌ పరిపాలన ప్రారంభించినప్పటి నుంచి ప్రజాస్వామ్యానికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయని పేర్కొనడమే ఆయన ప్రజాస్వామ్యానికి ఇచ్చిన విలువలకు నిదర్శనం.

జో బైడెన్‌ భవిష్యత్తులో తనకు ప్రత్యర్థి అవుతున్నాడని అనుమానించి ఆయన కుమారుడు హంటర్‌పై విదేశీ జోక్యం పేరుతో దర్యాప్తు జరపాలని ట్రంప్‌ ఉక్రెయిన్‌పై ఒత్తిడి తెచ్చినట్లు మీడియా బయట పెట్టింది. ఆ విషయం బహిర్గతం కావడంతో డెమోక్రటిక్‌ పార్టీ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం, ప్రజా ప్రతినిధుల సభలో నెగ్గడం, సెనేట్‌లో తీర్మానం వీగిపోవడంతో మొదటిసారి అభిశంసన నుంచి తప్పించుకున్నారు ట్రంప్‌. ట్రంప్‌ పాలనాకాలంలో జార్జి ప్లాయిడ్‌ హత్య జాత్యహంకారానికి నిలువుట్టదం. ఈ హత్యకు వ్యతిరేకంగా నిరసనలు ఊపందుకోవడంతో డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్ష భవనం కింద బంకర్లోకి వెళ్లి దాక్కున్నారు.

అమెరికా అధ్యక్షుల గత విధానాలకు తిలోదకాలిచ్చి ఒంటెత్తు పోకడతో, కరోనాపై పోరులో ప్రపంచాన్ని ఒకే గొడుగుకిందకు తెచ్చే డబ్ల్యూహెచ్‌ఓ ప్రయత్నాలకు ట్రంప్‌ విఘాతం కలిగించారు. తన అహంభావ పోకడలతో కరోనా బాధితదేశాల్లో ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ దేశంగా అమెరికాను అనారోగ్య సుడిగుండంలోకి నెట్టి వేశాడు. 2020లో ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు నిలిపివేసి దాని నుంచి అమెరికా బయటకు వెళ్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించి డబ్ల్యూహెచ్‌ఓ ఆవిర్భావం నుంచి అమెరికా అనుసరిస్తున్న విధానాలకు తిలోదకాలిచ్చారు.

మునుపెన్నడూ జరగని విధంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలను వివాదాస్పదం చేసిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు ట్రంప్‌. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ, ప్రజా తీర్పులను అవమానాల పాలు చేశాడు. ఇప్పుడు సర్వశక్తులు ఒడ్డి పోరాడకపోతే మీకు ఈ దేశం దక్కదు, మన బలం చూపించాల్సిన క్షణమిది, బలహీనులను బయటకు పంపిద్దాం అంటూ అభిమానులకు పిలుపునిచ్చారు. మీతో కలిసి నేను క్యాపిటల్‌ భవనం వద్దకు వస్తానని చెప్పారు. దానితో ట్రంప్‌ మద్దతుదారులు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికకు ఆమోదం తెలుపడానికి ఉభయసభల సంయుక్త సమావేశం జరిగే క్యాపిటల్‌ భవనం పైకి దాడి చేయడం, మద్దతుదారులు కాన్ఫెడరేట్‌ జెండాతో సహా రావటంతో శ్వేత జాతి అహంకారం తేట తెల్లమైంది. క్యాపిటల్‌ భవనంపై దాడికి కారకుడనే ఆరోపణతో అమెరికా చరిత్రలోనే రెండవసారి అభిశంసనను ఎదుర్కొంటున్న మొదటి అధ్యక్షుడుగా చరిత్రలో మిగలనున్నాడు ట్రంప్‌.

అధ్యక్ష పదవి చివరి కాలంలో డొనాల్డ్‌ ట్రంప్‌ తన అధికారాలను దుర్వినియోగం చేసే చర్యలు అనేకం తీసుకున్నారు. అమెరికన్‌ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూనే ఉన్నారు. అమెరికా చరిత్రలో గతంలో సంభవించని పరిణామాలు ట్రంప్‌  పాలనా కాలంలో సంభవించాయి. ఆ పరిణామాలు కేవలం అమెరికాకే కాదు యావత్‌ ప్రపంచ ప్రజాస్వామ్యానికి చీకటి రోజులను మిగిల్చాయి.
-జుర్రు నారాయణ యాదవ్, టీటీయూ జిల్లా అధ్యక్షులు
మహబూబ్‌నగర్‌ ‘ మొబైల్‌: 94940 19270

 

మరిన్ని వార్తలు