వేణువై పలకరించి... స్నేహమై పరిమళించి..

26 Feb, 2023 03:43 IST|Sakshi

కొందరు మనుషులుంటారు, వాళ్లు మనుషు లెవరూ చెయ్యలేని పనులు చేస్తారు. వారిని దేవత లనో, దేవుళ్లనో పొగిడే లోపే సామాన్యులుగా తమ అసామాన్యత్వాన్ని చాటుకుంటారు. అటువంటి వారిని సామాన్యులే నెత్తిన పెట్టుకుని మోస్తారు. అందుకు మన కాలపు సాక్ష్యం తుమ్మల వేణు గోపాలరావు... సింపుల్‌గా వేణు మాస్టారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి పట్టుదలగా చదివి, అంచెలంచెలుగా పైస్థాయికి ఎదిగిన వ్యక్తి ఆయన. ఎక్కడో కృష్ణా జిల్లాలోని ఘంటశాల పాలెంలో పుట్టి అమెరికాలో ఎమ్మెస్‌ చేసే వరకూ ఎదగడం అంటే ఆ రోజుల్లో అంత సులువేమీ కాదు. కానీ, ఇలా ఎదుగుతున్న క్రమంలోనే ఆయన తన చుట్టూ ప్రపంచపు లోతును సులువుగానే కనుగొన్నారు. సమాజంలో వస్తున్న మార్పులను ఆకళింపు జేసుకున్నారు. రావాల్సిన మార్పులకు వేగుచుక్క కావాలని నిశ్చయించుకున్నారు. వయసు, హోదా, సామాజిక స్థితులను పట్టించుకోకుండా అందరికీ స్నేహ హస్తం చాచారు. కడ వరకూ అందరికీ మంచి స్నేహితుడిగా నిలిచి పోయారు. 

డిగ్రీ పరీక్షలు రాసి విశాఖలోని హెచ్‌బీ కాలనీలో అడుగు పెట్టిన నాకు, ఆయన ఎదురు పడినప్పుడు హడిలి చచ్చా. మామూలు కాలేజీ ప్రిన్సిపాల్‌ అంటేనే ఉలికిపాటుగా ఉండే వయసులో ఏకంగా యూనివర్సిటీలో ప్రిన్సిపాల్‌ అనేసరికి మాటలు పెగల్లేదు. నా పరిస్థితి అర్థం చేసుకున్న ఆయన నెమ్మదిగా లోప లకు వెళ్లి పోయారు. చలసాని ప్రసాద్, కృష్ణాబాయిలతో మాట్లాడి వెళ్లిపోతుంటే బయటకు వచ్చి ‘అరవైలో ఇరవై’ అనే పుస్తకం, దానితోపాటు చిన్న బుక్‌లెట్‌ చేతిలో పెట్టారు.

అప్పుడు రాళ్లయినా అరి గించుకునే ఆకలితో ఉండేవాడిని కాబట్టి రాత్రికి రాత్రే చదివేశా. ఆయ నంటే గౌరవం రెట్టింపు అయ్యింది. కానీ, మళ్లీ కలిసినప్పుడు మాత్రం మామూలే. అందుకు కారణం, ఆయన గట్టిగా, ఖరాకండీగా, నిర్దిష్టంగా మాట్లా డటం.   రావిశాస్త్రి, కారా మాస్టార్ల గురించి ఆసక్తి కరమైన కబుర్లు చెప్పే వారు. ఆయనకు గుర్తుకు వచ్చి నప్పుడల్లా ‘మీరు ఇది తప్పకుండా చద వాలి’, ‘ఇది చూశారా?’ అంటూ లోపలెక్కడ్నించో పుస్తకాలు పట్టుకొచ్చి ఇచ్చే వారు. 

విద్యారంగంలో ఉన్నత శిఖరాలను అధిరో హించి, సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో మార్గ దర్శిగా నిలిచిన వేణు మాస్టారు కృషినీ, ప్రతిభనీ, ఆశయా లనీ... ఇటు విద్యా రంగం వారు గానీ, అటు సాహిత్య రంగంవారు గానీ గుర్తించకపోయినా సొంత గ్రామ స్థులు అక్కున చేర్చుకుని విగ్రహం ఏర్పాటు చేయ డం సంతోషకరం. అక్కడే వికాస కేంద్రం కూడా ఏర్పాటు చేసి, ఆయన భావాలను బాగానే ఒంట బట్టించుకున్నట్టు నిరూపించుకున్నారు.

ఈ సందర్భంగా ఆయనతో సాన్నిహిత్యం కలిగిన అనేకమంది చిన్నా, పెద్దల అభిప్రాయాలతో కూడిన పుస్తకాన్ని ఆవిష్కరించడం ద్వారా ఆయన గురించి భావితరాలు కూలంకుషంగా తెలుసుకునే వీలు కల్పిస్తున్నారు. తుమ్మల వేణుగోపాలరావు లాంటి కృషీ వలురు అరుదుగా ఉంటారు.  అటువంటి అసామా న్యులను పట్టించుకుని, పదిమందికీ ఆదర్శంగా నిలిపేవారే ప్రస్తుత సమాజానికి అవసరం.

– దేశరాజు, సీనియర్‌ జర్నలిస్ట్‌  9948680009
(నేడు కృష్ణా జిల్లా ఘంటసాల పాలెంలో తుమ్మల వేణుగోపాలరావు విగ్రహావిష్కరణ) 

మరిన్ని వార్తలు