లైక్,షేర్‌.. చీటింగ్‌

26 Feb, 2023 03:42 IST|Sakshi

ఇంట్లో కూర్చునే లక్షలు సంపాదించవచ్చంటూ సోషల్‌ మీడియాలో ప్రకటనలు 

వాట్సాప్, టెలిగ్రాం చాటింగ్‌తో ముగ్గులోకి.. 

ఫేక్‌ వెబ్‌సైట్‌లతో బురిడి 

విజయవాడలో రోజురోజుకీ పెరుగుతున్న బాధితులు 

విజయవాడ స్పోర్ట్స్‌: సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని యువత విలవిల్లాడుతున్నది. అత్యాశకు పోయి రూ.లక్షలకు లక్షలు సమర్పించుకుంటుంది. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. నిత్యం ఈ తరహా ఘటనలు ఎక్కడో ఓచోట వెలుగు చూస్తూనే ఉన్నాయి.

ఇటీవల కాలంలో విజయవాడ సీతారామపురం ప్రాంతానికి చెందిన ఓ యువతి హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. వర్క్‌ ఫ్రం హోంలో భాగంగా ప్రస్తుతం సీతారామపురంలోని తన ఇంటి నుంచే పనిచేస్తున్నది. ఈ నెల ఐదో తేదీన తన వాట్సాప్‌కు వచ్చిన మెసేజ్‌కు ఆకర్షితురాలై వెంటనే మెసేజ్‌లోని వెబ్‌సైట్‌ను క్లిక్‌ చేసింది.

వెబ్‌సైట్‌లోకి వెళ్లి వివరాలను చెక్‌ చేసుకుంటుండగానే సదరు కంపెనీ నుంచి ఆమెకు ఫోన్‌ కాల్‌ వచ్చింది. ‘ఇన్‌స్టా గ్రాం, యూ ట్యూబ్, ఫేస్‌బుక్‌లో వచ్చే వీడియోలు చూసి లైక్, షేర్‌ చేస్తే డబ్బులు చెల్లిస్తామని, ఇంట్లో కూర్చునే నెలకు లక్షలు సంపాదించవచ్చు అని ఫోన్‌లో చెప్పిన వ్యక్తి మాటలను నమ్మింది. యువతికి టాస్క్‌లు మొదలయ్యాయి.

ఆ రోజు తన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగానికి కాసేపు విరామం ఇచ్చి ఈజీగా వచ్చే డబ్బుల కోసం తాపత్రయపడి కష్టపడి కొత్త పని టాస్క్‌లు పూర్తి చేసింది. వెంటనే ఆమె బ్యాంక్‌ ఖాతాలో రూ.1,200 జమయ్యాయి. దీంతో అదే పనిగా మరుసటి రోజు టాస్క్‌లు పూర్తి చేయడంతో మళ్లీ రూ. 2 వేలు ఆమె బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. యువతి బానిసత్వాన్ని గ్రహించిన సైబర్‌ నేరగాళ్లు ఆమెను అప్పుడే అసలైన ముగ్గులోకి దించారు.

‘రూ.5 వేలు డిపాజిట్‌ చేసే కొన్ని పేరున్న కంపెనీల టాస్క్‌లు ఇస్తాం, ఆ కంపెనీ ప్రొడక్టస్‌కు రేటింగ్‌ ఇవ్వాలంతే.. ఇది సింపుల్‌ టాస్క్‌.. ఎక్కువ లాభాలొస్తాయి..!’ అని నమ్మించారు. రూ.5 వేలు డిపాజిట్‌ చేసి టాస్క్‌ పూర్తి చేసి వెబ్‌సైట్‌ వాలెట్‌ చెక్‌ చేసుకుంది. అందులో రూ.10 వేలు జమకావడంతో ఆనందంతో విత్‌డ్రా చేసుకుందామని విఫలయ­త్నం చేసింది. వెంటనే కంపెనీ ప్రతినిధులను ఫోన్‌­లో సంప్రదించింది.

రూ. ఏడు వేలు డిపాజిట్‌ చేసి టాస్క్‌ పూర్తి చేస్తే మీ వాలెట్‌లో ఉన్న రూ.10 వేలు తీసుకొవ­చ్చని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ఆ విధంగానూ చేసినా డబ్బు రాలేదు. బాధితురాలు డబ్బులు డిపాజిట్‌ చేస్తూనే ఉంది.. తీసుకోవడానికి వీలు లేని డబ్బు­లు వాలెట్‌లో పెరుగుతూనే ఉన్నా­యి.

ఈ విధంగా ఆ యువతి కేవలం 10 రోజుల్లో 14 లక్షల 13 వేల 900 రూపాయలను చెల్లించిన తరువాత సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కాగా, సై­బర్‌ నేర­గాళ్లు సోషల్‌ మీడియాలో విసురుతున్న వ­లలో నిరు­ద్యోగులతో సహా ఉద్యోగులు, ఉన్నత వి­ద్యా­వం­తులు పడుతుండడం గమనార్హం. ఢిల్లీ, రా­జ­స్థాన్, గుజరాత్‌ రాష్ట్రాల కేంద్రంగా ఈ తరహా మో­­సాలు జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. 

జిల్లాలో పెరుగుతున్న ఘటనలు  
ఈ ఆన్‌లైన్‌ మోసాల బాధితులు రోజురోజుకీ పెరుగుతున్నారు. నిత్యం స్మార్ట్‌ ఫోన్‌కే అంకితమవుతున్న వ్యక్తులు ఈ సైబర్‌ ఉచ్చులో పడుతున్నారు. ఈ ఏడాది జనవరి మూడో తేదీ నుంచి ఫిబ్రవరి 22వ తేదీ వరకు ఈ తరహా ఘటనలపై సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌లో 19 కేసులు నమోదయ్యాయి

అప్రమత్తంగా ఉండండి..  
స్మార్ట్‌ ఫోన్‌ వినియోగంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. సులువుగా డబ్బులు వస్తాయని నమ్మి మోసపోవద్దు. ఈ తరహా ఘటనల్లో సైబర్‌ నేరగాళ్లు ప్రత్యేకంగా రూపొందించుకున్న ప్రోగ్రామింగ్‌ ద్వారానే వెబ్‌ లింక్స్‌ను తయారు చేస్తారు.

డబ్బులు చెల్లింపులు యూపీఐ, ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్, నెఫ్ట్‌ తదితర పద్ధతుల ద్వారా సేకరిస్తారు. నేరగాళ్ల కదలికలపై నిఘా ఉంచాం. బాధితులకు న్యాయం చేస్తాం.  
– టి.కె.రాణా, పోలీస్‌ కమిషనర్, ఎన్టీఆర్‌ జిల్లా   

మరిన్ని వార్తలు