Johnson Choragudi: భావోద్వేగాల బంధం

1 Nov, 2022 15:40 IST|Sakshi

రాష్ట్రావతరణ దినమైన నవంబర్‌ ఒకటి, గత చరిత్రలోకి చేజారి పోకుండా మళ్ళీ ‘స్వాధీనం’ చేసుకుని, సకాలంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గొప్ప పరిణతిని ప్రదర్శించింది. ఇక్కడ స్వాధీనం అంటున్నది– ‘క్లెయిమ్‌’ అనే ఆంగ్ల పదాన్ని దృష్టిలో ఉంచుకుని. తెలంగాణ మన నుంచి విడిపోయినప్పుడు, 1956 నుండి నైసర్గిక ఆంధ్రప్రదేశ్‌ చరిత్రను ‘క్లెయిమ్‌’ చేసుకోవలసిన – ‘పెద్దన్న’ పాత్రను గత ప్రభుత్వం తొలి ఐదేళ్లు  వదులుకుంటే, చివరికి ఆ లోపాన్ని జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం సరిచేసింది. ముఖ్యమంత్రిగా ఆయనకు తొలి అనుభవం అయినప్పటికీ, నిర్ణయానికి అవసరమైన మేధోమథనం ఎంత వేగంగా జరిగింది అంటే, 2019 జూన్‌లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం నుంచి అక్టోబర్‌ మూడవ వారం నాటికి – నవంబర్‌ 1 రాష్ట్రావతరణ దినోత్సవం అని ప్రకటన వెలువడింది. అది కూడా చీఫ్‌ సెక్రటరీ ఈ విషయాన్ని ప్రకటించడం ద్వారా, ఈ ప్రభుత్వం ‘బిజినెస్‌ లైక్‌’ పనిచేస్తుందనే సంకేతాలు కూడా మొదట్లోనే వెలువడ్డాయి. 

ఐదేళ్లు ఆలస్యం అయినప్పటికీ కడకు ప్రభుత్వం తల నెరిసినతనంతో, సమ్యక్‌ దృష్టి (హోలిస్టిక్‌ అప్రోచ్‌) తో వ్యవ హరించి ఒక చారిత్రిక తప్పిదాన్ని సరిచేసింది. అలా తొలి ఏడాది విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో రాష్ట్రావతరణ దినోత్సవాలు – ‘స్టేట్‌ ఫంక్షన్‌’గా జరిగాయి. ఇది జరిగాక, అదే వారంలో 2019 నవంబర్‌ 6న దీనిపై రాష్ట్ర ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. జాతీయ స్థాయిలో అత్యున్నత పురస్కారంగా భావిస్తున్న భారతరత్న, పద్మ విభూషణ్‌ తరహాలో రాష్ట్రంలో సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ ప్రజా రంగంలో విశేష సేవలు అందించిన వారికి రాష్ట్రావతరణ దినోత్సవం నాడు పురస్కరాలతో ప్రభుత్వం సత్కరిస్తుంది అని అందులో ప్రకటించింది. 

అయితే, కరోనా కారణంగా 2020లో ‘మెడికల్‌ ఎమర్జెన్సీ’ కావడంతో అది ఆగినా, ఆ తర్వాత రెండేళ్లుగా రాష్ట్రావతరణ దినోత్సవం నాడు ప్రభుత్వం పురస్కారాలతో సత్కరించడం గొప్ప విషయం. గత ఏడాది– ‘వైఎ స్సార్‌ లైఫ్‌ టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డు’ పురస్కారానికి 10 లక్షల నగదు, మెమెంటో, ప్రశంసాపత్రం, అలాగే, ‘వైఎస్సార్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డు’ పురస్కారానికి 5 లక్షల నగదు, మెమెంటో, ప్రశంసా పత్రం అందించారు. పురస్కార గ్రహీతల ఎంపిక కోసం ప్రభుత్వం పకడ్బంది ‘స్క్రీనింగ్‌’ విధానాన్ని అనుసరిస్తున్నది.    
  
2022 పురస్కారాలకు ‘వైఎస్సార్‌ లైఫ్‌ టైం ఎచీవ్‌ మెంట్‌ అవార్డు’కు 20 మందినీ, ‘వైఎస్సార్‌ ఎచీవ్‌ మెంట్‌ అవార్డు’కు 10 మందినీ ఎంపిక చేశారు. వీరిని – వ్యవసాయం, పరిశ్రమలు, వైద్య రంగం, విద్యా రంగం, కళారంగం, సాహిత్యం, మీడియా, స్త్రీ రక్షణ – సాధికారికత రంగాల నుంచి ఎంపిక చేశారు. (క్లిక్ చేయండి: తూర్పు కనుమల అభివృద్ధిపై విభిన్న వైఖరి!)

అలజడి తర్వాత కుదురు కోవడం గురించి యోచించడానికి, అధినేతకు ప్రజలు – ప్రాంతము మధ్య ఉండే భావోద్వేగాల బంధం ఎటు వంటిదో తెలియాలి. లేనప్పుడు, అస్పష్టం అయోమయం మిగులుతుంది. ‘రాజ్యం’లో భాగమైన–’ఎగ్జిక్యూటివ్‌’ అందించే విలువైన మార్గదర్శనాలను అధినేత నిర్ణయాత్మకంగా వినియోగించుకున్నప్పుడు, ప్రజల తీర్పుతో ఎన్నికయిన ప్రభుత్వాలకు అది అదనపు విలువ అవుతుంది. ఇవన్నీ కాకుండా ప్రస్తుత సీఎంకీ ఏపీ ‘బ్యూరోక్రసీ’కీ మధ్య వయస్సులో కుదిరిన సారూప్యత వల్ల, ఇక్కడ తక్కువ కాలంలో ఎక్కువ ప్రభావవంతంగా ప్రస్తుతం ప్రభుత్వంలో పని సాగుతున్నది.  


- జాన్‌సన్‌ చోరగుడి 
అభివృద్ధి – సామాజిక అంశాల వ్యాఖ్యాత

మరిన్ని వార్తలు