ఒక ఆలయం... ముగ్గురు దేవుళ్లు

7 Jul, 2022 14:42 IST|Sakshi

ఒక ఆలయం... ముగ్గురు దేవుళ్లుసాధారణంగా దేవాలయంలో ఒక్కరే ప్రధాన దేవుడు ఉంటాడు. కానీ కొన్ని దేవాలయాల్లో ముగ్గురు దేవుళ్లు మూడు వేరు వేరు గర్భగృహాల్లో ఉంటారు. ఇటువంటి ఆలయాలను త్రికూటాలయాలు అని వ్యవహరిస్తారు. అయితే ఇవి చాలా తక్కువ సంఖ్యలో నిర్మితమయ్యాయి. హన్మకొండలోని వేయి స్తంభాల గుడి త్రికూటాలయమే. పానగల్లు ఛాయా సోమేశ్వరాలయం, మంథనిలోని గౌతమేశ్వరాలయం, సంగారెడ్డికి సమీపంలోని కల్పగూరు కాశీ విశ్వేశ్వరాలయాలు ఇలాంటివే.

హన్మకొండ వేయిస్తంభాల ఆలయం కాకతీయ శిల్ప కళారీతికి అద్దంపట్టే అద్భుతమైన ఆలయం. క్రీ.శ. 1163లో రుద్రదేవ మహారాజు కట్టించిన ఆలయమిది. ఆయన పేరుతోనే ఈ ఆలయాన్ని రుద్రేశ్వరాలయం అనీ, దీనిలోని లింగాన్ని రుద్రేశ్వర లింగం అనీ వ్యవహరిస్తారు. నక్షత్రాకారంలో నిర్మించిన ఈ త్రికూటాలయంలో శివుడు, విష్ణువు, సూర్య దేవుళ్లకు గర్భాలయాలు ఉన్నాయి. స్తంభాలు ఒకదాని తరువాత ఒకటి వరుసలు దీరినట్లు చెక్కబడి కనిపిస్తాయి.

మంథనిలోని గౌతమేశ్వరాలయం కూడా త్రికూటాలయమే. దీనిని కూడా 1000 స్తంభాల ఆలయం అని వ్యవహరిస్తారు. ఈ ఆలయం హన్మకొండ ఆలయం కన్నా ముందుగానే నిర్మించారని భావిస్తున్నారు. ఇక్కడి శివలింగం అచ్చంగా హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయంలోని శివలింగం లాగే ఉంటుంది. ఆదిగురువు శంకరాచార్యులు కూడా ఈ ఆలయాన్ని సందర్శించారట. అయితే, దీన్ని రాష్ట్ర కూటులు నిర్మించారా, లేదా చాళుక్యులా అనే విషయంలో స్పష్టత లేదు. అయితే, కాకతీయులు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారని చెబుతారు.

మరో త్రికూటాలయం పానగల్లులో ఉన్న ఛాయా సోమేశ్వరాలయం. నల్లగొండ జిల్లా కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. కుందూరు చోళులు నిర్మించిన ఈ దేవాలయానికి రెండు ప్రత్యేక తలు ఉన్నాయి. ముఖ్యమైంది ఈ దేవాలయం గర్భ గుడిలో గోడపై ఎప్పటికీ కదలకుండా ఒకే స్థానంలో ఉన్నట్లుగా కనపడే నీడ. రెండోది అక్కడికి దగ్గరలోని చెరువులో నీరుంటే గర్భగుడిలోకి అది ఉబికిరావడం. 11వ శతాబ్దంలో చాళుక్య శైలిలో నిర్మిచిన ఈ త్రికూటాలయంలోని ఒక దాంట్లో శ్రీదత్తాత్రేయుడు కొలువై ఉండగా, మరొకటి ఖాళీగా కనిపిస్తోంది. తూర్పు ముఖంగా లోతుగా ఉన్న మూడో గర్భాలయంలో మూలవిరాట్టు శ్రీసోమేశ్వర స్వామి దర్శన మిస్తారు. గర్భగుడి ముఖద్వారం ముందు రెండు స్తంభాలున్నా అన్నివేళలా ఒకే నీడ పడుతుంది. అది వెలుతురు ఉన్నంత సేపు కదలకుండా ఒకే స్థానంలో ఉంటుంది. సూర్యుని గమనంలో మార్పు ఆ నీడను మార్చదు. ఆ నీడ ఎలా పడుతుంది, ఎందుకు అది వెలుతురులో ఉన్నంతవరకూ తన స్థానాన్ని మార్చు కోదు అనేది ఆశ్చర్యపరుస్తుంది. భౌతిక శాస్త్రంలోని పరిక్షేపణ కాంతి ఆధారంగా ఈ త్రికూట ఆలయాన్ని నిర్మించారు.

సంగారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో కల్పగూరు గ్రామంలో కాశీ విశ్వేశ్వర ఆలయం ఉంది. హన్మకొండ వేయిస్తంభాల ఆలయ నిర్మాణశైలిలోనే ఇదీ ఉంది. ఈ ఆలయంలో దక్షిణాన కాశీ విశ్వేశ్వరుడు, ఉత్తరాన వేణుగోపాల స్వామి, పశ్చిమాన అనంత  పద్మనాభ స్వామి గర్భాలయాలు ఉన్నాయి. (క్లిక్‌: స్ఫూర్తినిచ్చే ‘కాకతీయ వైభవం’)

కాకతీయ ఆలయాలు నిర్మాణ శైలి, శిల్ప సౌందర్యాలకు ప్రసిద్ధి చెందినా... నాటి ఇంజినీర్లు వాడిన సాంకేతిక విజ్ఞానం కొంత వివాదాస్పదంగా మారింది. భూకంపాల వంటి ప్రకృతి విపత్తులను తట్టుకోవడానికి పునాదుల్లో ఇసుకను వాడటం నాటి ఆలయాల నిర్మాణంలో కనిపించే సాధారణ దృశ్యం. అయితే అదే ఈ ఆలయాల మనుగడకు శాపంగా మారింది. కాలక్రమంలో పునాదులు కుంగి ఆలయాలు కూలిపోవడానికి కారణమయింది. హన్మకొండ ఆలయంలోని కొంత భాగం ఇందువల్లనే దెబ్బతిన్నదని అంటున్నారు.


- కన్నెకంటి వెంకటరమణ 
సంయుక్త సంచాలకులు, ఐ అండ్‌ పీఆర్, హైదరాబాద్‌
(‘కాకతీయ వైభవ సప్తాహం’ జూలై 7–13 వరకు)

మరిన్ని వార్తలు